ఫిలింసిటీలో అగ్రకథానాయకుల పోరాటాలు
ప్రపంచ ప్రసిద్ధ రామోజీ ఫిలింసిటీ అగ్రతారల పోరాటాలకు వేదికైంది. రామ్‌చరణ్‌ ఓ పక్క, ప్రభాస్‌ మరో పక్క వీరోచితంగా పోరాడుతున్నారు. వీళ్ల ఫైటింగుల మధ్యలో నందమూరి బాలకృష్ణ ‘మహానాయకుడు’ ర్యాలీ చేస్తున్నాడు. మరి ఆ సంగతేంటో ఒక్కసారి చదివేద్దాం.

మహానాయకుడి ర్యాలీ: ‘ఎన్టీఆర్‌’ జీవిత కథతో తెరకెక్కుతోన్న ‘మహానాయకుడు’కు సంబంధించిన బ్యాలెన్స్‌ సన్నివేశాలను ఫిలింసిటీలో తెరకెక్కించారు. దాంతో చిత్రీకరణ పూర్తయింది. ర్యాలీ నేపథ్యంలో ఈ సన్నివేశాలు సాగనున్నాయి. బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.


సాహో ముగింపు పోరాటం:
ప్రభాస్‌ నుంచి రాబోతున్న ‘సాహో’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుజీత్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ ఫిలింసిటీలో జరుగుతోంది. ముగింపు సన్నివేశాల్లో భాగంగా కీలకమైన పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్‌ను రూపొందించారు. ఫైట్స్‌ పూర్తయ్యాక ఇక్కడే పాటల చిత్రీకరణ చేయనున్నారు. యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.


‘బాహుబలి 2’ తర్వాత ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’పై భారీ అంచనాలున్నాయి. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలసి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. రామ్‌చరణ్‌తో పాటు వందలాదిమంది ఫైటర్లపై కీలక పోరాట ఘట్టాలను తెరకెక్కించే పనిలో ఉన్నారు జక్కన్న. పోలీస్‌ చెక్‌పోస్ట్‌ నేపథ్యంగా సాగే పోరాటమిది. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.