సెట్‌ వేయమంటే ఇల్లు కట్టిచ్చావేంటన్నారు
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. రెండు పనులూ చాలా కష్టమని వాళ్ల ఉద్దేశం. కానీ సినిమా వాళ్లు తలచుకుంటే ఎంత? అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేస్తారు. కళ్లు మూసి తెరిచేలోగా ఇల్లు కట్టేస్తారు. నిజంగా ఓ ఇల్లు కట్టాలంటే చాలా హైరానా పడిపోతాం. సిమెంటు, కాంక్రీటు, పిల్లర్లు, స్లాబు... అంటూ నానా హంగామా ఉంటుంది. కానీ సినిమా వాళ్లు కదా, అలాంటివేం వాడరు. వాళ్ల స్టైలే వేరుగా ఉంటుంది. ‘ప్రతిరోజూ పండగే’ కోసం కూడా ఓ ఇల్లు కట్టింది చిత్రబృందం. కేవలం 17 రోజుల్లో సిమెంటు, కాంక్రీటు లాంటివేం వాడకుండా - ఓ చూడచక్కని ఇంటిని తయారు చేసేశారు ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌. ‘ఛత్రపతి’, ‘ఈగ’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’ చిత్రాలతో కళా దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం ‘ప్రతి రోజూ పండగే’ చిత్రానికీ ఈయనే సెట్స్‌ రూపొందిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సాయి ధరమ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. అల్లు అరవింద్‌ నిర్మాత. హైదరాబాద్‌ శివార్లలో ఈ సినిమా కోసం ఓ ఇంటి సెట్‌ని రూపొందించారు. ఆ వివరాల్ని పంచుకున్నారు రవీందర్‌.

‘‘రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగే కథ ఇది. సత్యరాజ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన ఇంటి నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు తెర కెక్కించాలి. అందుకోసం రాజమండ్రి అంతా గాలించాం. కొన్ని ఇళ్లు నచ్చాయి. కానీ మాకు కావల్సినన్ని రోజులు ఆ ఇళ్లు ఇవ్వడానికి యజమానులు ఇష్టపడలేదు. పైగా దాదాపు 20 - 30 మంది ఆర్టిస్టులతో సన్నివేశాల్ని తీయాలి. అందుకోసం దాదాపు వంద మంది యూనిట్‌ సభ్యులు కష్టపడుతుంటారు. దాంతో సెట్‌ వేయక తప్పని పరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌ శివార్లలో ఓ ఎకరం స్థలం ఎంచుకుని, అందులో ఈ ఇల్లు కట్టాం. ఎవరు ఎలాంటి సెట్‌ వేసినా, ఆ సెట్‌కి ఓ క్యారెక్టర్‌ ఉండాలి. అలాంటి స్వభావం ఈ ఇంటికీ ఉంది. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే, ‘గతంలో ఈ ఇంట్లో ఇంతమంది ఉండేవారా?’ అనే అభిప్రాయం కలగాలి. 90 ఏళ్ల క్రితం కట్టిన ఇంట్లో మనం ఉన్నాం అనే భావన రావాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని ఈ సెట్‌ని డిజైన్‌ చేశాం. కొత్త తరహా డిజైన్‌ని ఎంచుకున్నాం. ఈ ఇంటి కోసం కలప తక్కువగా వాడాం. కేవలం గుమ్మాలలోనే టేక్‌ లుక్‌ కనిపిస్తుంది. ఆ గుమ్మాల్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి తీసుకొచ్చాం. కడియం నుంచి రూ.5 లక్షల వ్యయంతో మొక్కల్ని తీసుకొచ్చాం. ఇంటి చుట్టు కొన్ని చెట్లనూ నాటాల్సివచ్చింది. నీళ్ల ట్యాంకర్‌నీ ప్రత్యేకంగా డిజైన్‌ చేశాం. డైనింగ్‌ టేబుల్‌, మంచాలు, సోఫాలూ ఇవన్నీ తయారు చేసినవే. మాకు కావల్సిన డిజైన్‌ దొరికినప్పుడు ఎంత ఖరీదైనా వెచ్చించి కొనుగోలు చేశాం. ఇంట్లో కనిపించే క్యాలెండర్లు, ఫొటో ఫ్రేములూ, వంట సామాగ్రి.. ఇవన్నీ పల్లెటూర్ల వెంట తిరిగి, సేకరించి తీసుకొచ్చినవే. ఇంటి నిర్మాణం విషయానికొస్తే.. టెంపుల్‌ స్టోన్‌తో 12 అడుగుల ఎత్తున్న పిల్లర్స్‌ వేశాం. వాటిని ఫైబర్‌తో తయారు చేశాం. మజైకాతో ఫ్లోరింగ్‌ వేశాం. ఎక్కువగా రబ్బరు, జిప్సమ్‌ వాడాం. సిమెంటు ఎక్కడా వాడలేదు. దాదాపు 200మంది రాత్రింబవళ్లూ కష్టపడి 17 రోజుల్లో ఈ సెట్‌ని తీర్చిదిద్దారు. రూ.1.25 కోట్లు ఖర్చైంది. ఐదేళ్ల పాటు ఈ ఇల్లు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ సెట్‌ని చూసి దర్శకుడు మారుతి ఆశ్చర్యపోయారు. ‘సెట్‌ వేయమంటే ఇల్లు కట్టి ఇచ్చారేంటి’ అన్నారు. అల్లు అరవింద్‌గారు కూడా మెచ్చుకున్నారు’’.


- రవీందర్‌ (ప్రొడక్షన్‌ డిజైనర్‌)


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.