మోహన్‌బాబు ‘రాయలసీమ రామన్న చౌదరి’కి 20 ఏళ్లు

“నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయేదాని గురించి ఆలోచించను!’’ అంటూ మోహన్‌బాబు చెప్పిన ఈ డైలాగ్‌ ‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలోనిది. ఈ చిత్రం విడుదలై నేటికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలోని మరో డైలాగ్‌...‘‘గుర్రానికి కాళ్ళల్లో బలం, సింహానికి నోట్లో బలం, గరుడ పక్షికి కంట్లో బలం, ఈ రాయలసీమ రామన్న చౌదరికి వొళ్ళంతా బలమేరా!’’ మోహన్‌బాబు నోట చెప్పిన ఈ డైలాగ్‌ అప్పట్లో థియేటర్లో మారుమ్రోగిపోయింది. శ్రీ లక్ష్మి ప్రపన్న పిక్చర్స్ పతాకంపై సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్‌బాబు ద్విపాత్రాభినయం చేశారు. జయసుధ, ప్రియాగిల్‌, చంద్రమోహన్‌, బ్రహ్మానందం, అచ్యుత్, జయ ప్రకాష్ రెడ్డి, నర్రా వెంకటేశ్వరరావు, రంగనాథ్, గిరిబాబు, రాళ్లపపల్లి, కోవై సరళ తదితరులు నటించారు. చిత్ర కథేంటంటే వందల ఎకరాలు భూమి కలిగిన రంగనాథ్‌ (రామన్న తండ్రి) తన వారసత్వంగా వచ్చిన కొంత భూమిని పేదలకు పంచుతాడు. ఇంతలోనే తమ్ముడు (గిరిబాబు) కొడుకు రంగనాథ్‌ని బ్లాక్‌ మెయిల్‌ చేసి ఆస్తి మొత్తం రాయించుకుంటారు. దీంతో ఆయనకు పక్షవాతం వచ్చి మంచం పడతారు. తన తండ్రికి అన్యాయం జరిగినా ఊర్లోని జనం ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో, రామన్న ఊరి జనంతో పాటు తన తండ్రికి జరిగిన అన్యాయంపై పగతీర్చుకోవడానికి ఏం చేశాడన్నది మిగిలిన కథ. చిత్రంలో కోవై సరళ, బ్రహ్మనందంల హాస్యం ప్రేక్షకులను నవ్విస్తుంది. చిత్రానికి మణిశర్మ సంగీతం అదనపు బలం. ఈ సినిమా సెప్టెంబర్ 15న 2000 విడుదలై ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.