బాక్సాఫీస్‌పై ‘2.ఓ’ తుపాను

‘ 2.ఓ’... ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పేరే వినిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ... భాష ఏదైనా కావచ్చు.. ఆ సినిమా గురించే చర్చ. భారత్‌, అమెరికా, జపాన్‌... దేశమేదైనా కావచ్చు. దాని గురించే ఎదురుచూపులు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. భారతీయ సినిమాను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లిన దర్శక దిగ్గజం శంకర్‌ తెరకెక్కించిన చిత్రమిది. పైగా సంచలన విజయం సాధించిన ‘రోబో’కు సీక్వెల్‌గా రాబోతున్న సినిమా. దానికి తోడు బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ తొలిసారి ప్రతినాయకుడిగా రజనీతో ఢీకొనబోతున్న చిత్రమిది. వీరికి ఏఆర్‌ రెహమాన్‌, రసూల్‌ ఫుకుట్టి లాంటి హేమాహేమీలు తోడయ్యారు. అందుకే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నెల 29న చిట్టి థియేటర్లలో సునామీ సృష్టించేందుకు రాబోతున్నాడు. ఆరోజే ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో 2.ఓ వెనకున్న ఆసక్తికర విశేషాలివీ.

                                     

* ఈ చిత్రాన్ని సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు దర్శకుడు శంకర్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రచార కార్యక్రమాలకు చేసిన వ్యయంతో కలిపితే అది రూ.540 కోట్లకు పైచిలుకే అని సమాచారం. ఈ లెక్కన భారత్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా ‘బాహుబలి’ రికార్డును అధిగమించేసింది ‘2.ఓ’. ఎక్స్‌మెన్‌, బ్యాట్మ్యాన్‌, టెర్మినేటర్‌ లాంటి హాలీవుడ్‌ చిత్రాల బడ్జెట్‌కు ఇది సమానం.

* విడుదలకు ముందే ఈ చిత్రానికి జరిగిన మార్కెట్‌ చూస్తే దీనిపై ఎంత క్రేజ్‌ ఉందో అర్థమవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే పలు హక్కులు, అడ్వాన్స్‌ బుకింగ్‌ మార్గాల్లో రూ.490 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో థియేట్రికల్‌, శాటిలైట్‌, డిజిటల్‌ హక్కుల రూపంలో రూ.370 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇక తమిళనాడులో విడుదలకు ముందే అడ్వాన్స్‌ బుకింగ్‌ విషయంలో సంచలనాలు నమోదు చేయడానికి సిద్ధమైంది ‘2.ఓ’. అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా ఇప్పటికే రూ.120 కోట్లు వచ్చినట్లు ట్రేడ్‌ విశ్లేషకుడు రమేష్‌ బాలా తెలిపారు. తమిళనాడు సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి చిత్రమిది.

* రజనీకి భారత్‌లోనే కాదు... విదేశాల్లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ‘2.ఓ’పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని సుమారు పది వేల తెరల్లో విడుదల చేస్తున్నారు. ఇండియాలోనే సుమారు 6800 తెరల్లో విడుదలవుతోందట. ఈ స్థాయిలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది ‘2.ఓ’.

* ఒక్క రోజులో దేశవ్యాప్తంగా ‘2.ఓ’ చిత్రాన్ని 31 వేలకు పైగా ఆటలు ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. ఈ విషయంలోనూ రికార్డు సాధించిందీ చిత్రం.


* సాంకేతిక విలువల పరంగా ఏమాత్రం రాజీపడకుండా అత్యున్నత స్థాయిలో తెరకెక్కించిన చిత్రమిది. వీఎఫ్‌ఎక్స్‌ పనుల కోసమే విడుదలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ‘‘రోబో’ కన్నా ‘2.ఓ’ విజువల్‌ పరంగా అత్యద్భుతంగా ఉంటుంది. 2.ఓ’తో పోలిస్తే ‘రోబో’ ఓ టీజర్‌లా ఉంటుంద’’ని వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస మోహన్‌ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 25 ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలు ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచు కున్నాయి. 2150 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ రూపొందించాల్సి వచ్చింది. అందులో సుమారు వెయ్యి అత్యంత క్లిష్టమైన షాట్స్‌ ఉన్నాయట. వాటి కోసమే 1300 ప్రీ విజువలైజేషన్‌ షాట్స్‌ రూపొందించారట. యానిమట్రానిక్స్‌, వీక్యామ్‌ టెక్నాలజీ, స్పైడర్‌ క్యామ్‌ సిస్టమ్స్‌, లాడార్‌ స్కానింగ్‌ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ చిత్రం కోసం వినియోగించారు. వెయ్యి మంది వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్టులు, 25 మంది త్రీడీ డిజైనర్స్‌, పది మంది కాన్సెప్ట్‌ ఆర్టిస్టులు, 500 మంది క్రాఫ్ట్స్‌మెన్‌, మొత్తంగా మూడు వేల మంది సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం శ్రమించారు. అందులో హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన వారు సైతం ఉన్నారు.

* ఇందులోని ప్రతి పాత్రను, ప్రతి వస్తువును మొదట కాన్సెప్ట్‌ ఆర్టిస్టులతో డిజైన్లు గీయించి, వాటిలో దర్శకుడి ఊహకు దగ్గరగా ఉన్న వాటినే ఎంపిక చేసుకుని, వాటికి త్రీడీ నమూనాలు తయారు చేశారట. ఆ తర్వాత వాటి సాయంతో ప్రీ విజువలైజేషన్‌ వీడియోలు రూపొందించారట. వాటి ఆధారంగా సన్నివేశాలు తెరకెక్కించి అనంతరం వీఎఫ్‌ఎక్స్‌ హంగులు అద్దామని శంకర్‌ తెలిపారు. ఈ చిత్రంలో రజనీ పోషించిన చిట్టి పాత్రకు దీటుగా అక్షయ్‌ పోషించిన క్రోమ్యాన్‌ పాత్ర ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందని చిత్రబృందం చెబుతోంది. కాకిని పోలి ఉండే దుష్ట పాత్ర కోసం అక్షయ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మేకప్‌ కోసమే ప్రతి రోజూ మూడున్నర గంటలు పట్టేదట. మేకప్‌ తీసేయడానికి గంటన్నర పట్టేదని అక్షయ్‌ వెల్లడించారు. తన 28 ఏళ్ల కెరీర్‌లో ఏనాడూ ఇంత కష్టపడలేదని ఆయన అన్నారు.


* ఈ సినిమా కోసం తమిళనాడులోని కొన్ని మల్టీప్లెక్స్‌లు, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లను త్రీడీ వెర్షన్‌కు అనుగుణంగా మార్చుకుంటున్నారట.

* రజనీకి, అక్షయ్‌కి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఇప్పటి వరకూ భారతీయ చిత్రాల్లో చూడని స్థాయిలో ఉంటాయట. హాలీవుడ్‌ చిత్రాలు ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’, ‘బ్యాట్‌ మ్యాన్‌ వర్సెస్‌ సూపర్‌మ్యాన్‌’ చిత్రాలకు పనిచేసిన యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు కెన్నీ బేట్స్‌, ఆరొన్‌ క్రిప్పిన్‌, స్టీవ్‌ గ్రిఫిన్‌, నిక్‌ పొవెల్‌ ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలను రూపొందించారు.


* రజనీ మరోసారి వశీకరణ్‌, చిట్టి పాత్రల్లో అలరించబోతున్నారు. అయితే ఈసారి చిట్టి అప్‌డేటెడ్‌ వెర్షన్‌తో సరికొత్త మ్యానరిజమ్స్‌తో గిలిగింతలు పెట్టబోతున్నాడట.

* ‘2.ఓ’లో ఐశ్వర్య రాయ్‌ స్థానంలో అమీ జాక్సన్‌ నాయికగా నటించింది. ఆమె పాత్ర కూడా సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. కొన్ని ప్రచార చిత్రాల్లో ఆమె హ్యూమనాయిడ్‌గా కనిపిస్తోంది. సినిమా మొత్తం అలాగే కనిపిస్తుందా అన్న విషయంలో ఆసక్తి నెలకొంది.

పూర్తిస్థాయిలో త్రీడీలో తెరకెక్కించిన తొలి భారతీయ చిత్రమిది. ఈ చిత్రం ప్రత్యేకత ఏంటంటే వీడియో త్రీడీలో, ఆడియో 4డీలో కొత్త అనుభూతులను పంచనుంది. 4డీ కోసం థియేటర్లలో సీట్ల కింద కూడా స్పీకర్లు అమర్చుతారు. మామూలుగా ఇలాంటి చిత్రాలను 2డీ కెమెరాతో చిత్రీకరించి ఆ తర్వాత త్రీడీ ఫార్మాట్‌లోకి మారుస్తుంటారు. కానీ ఈ చిత్రాన్ని మాత్రం నేరుగా త్రీడీ కెమెరాతోనే షూట్‌ చేశారు. ప్రతి షాట్‌ తీసిన తర్వాత హైటెక్‌ త్రీడీ గ్లాసెస్‌తో చెక్‌ చేశారట.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.