‘సాహో’ ట్రైలర్‌ చెప్తోన్న కథలు ఇవేనా!!
‘సాహో’ కథ ఏంటి? ప్రభాస్‌ పాత్ర ఎలా ఉండబోతుంది? అన్నది ట్రైలర్‌తోనే క్లుప్తంగా చెప్పేశాడు దర్శకుడు సుజీత్‌. అయితే అందరూ ఊహించిన దానికి భిన్నంగా ‘సాహో’లోని ఓ సర్‌ప్రైజ్‌ స్టోరీ ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతుందట. తాజాగా దీనికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఇందులో ప్రభాస్‌ దొంగగా, పోలీస్‌గా కనిపించనున్నాడని చెప్తోంటే.. మరికొందరు శ్రద్ధా కపూర్‌ కూడా ద్విపాతాభినయం చేస్తోందని వార్తలు రాసేస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్‌ను ద్విపాతాభినయం విషయమై ప్రశ్నించగా.. ఓ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. ‘‘ద్విపాతాభినయం కాకపోవచ్చు. కానీ, ట్రైలర్‌లోనే కథకు సంబంధించిన క్లూస్‌ ఇచ్చేసినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సినీప్రియులంతా ట్రైలర్‌ చెప్తోన్న కథ కోసం క్లూలను వెతికే పనిలో పడ్డారు. అయితే ఇందులో దాగి ఉన్న క్లూల ప్రకారం చూస్తుంటే రెండు కథలు నిజమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


స్టోరీ: 1
ట్రైలర్‌లో కనిపిస్తున్న ప్రభాస్‌ లుక్స్‌ను బట్టీ చూస్తుంటే ఆయన ఇందులో రెండు భిన్నమైన షేడ్స్‌లో దర్శనమివ్వబోతున్నట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌లో కొన్ని షాట్లలో ప్రభాస్‌ ఉంగరాలు తిరిగిన ఫుల్‌ హెయిర్‌తో కనిపించగా.. వెన్నెల కిషోర్‌తో మాట్లాడుతున్న సన్నివేశంలో పోలీస్‌ హెయిర్‌ కట్‌తో చాలా సింపుల్‌గా కనపడ్డాడు. అంతేకాదు.. ఇప్పటి వరకు విడుదలైన పాటల్లో ‘సైకో సయాన్‌’’ పాటలో డార్లింగ్‌ లుక్‌ ఒక విధంగా ఉండగా.. ‘‘బ్యాడ్‌ బాయ్‌’’ గీతంలో ఒకరకమైన లుక్‌లో దర్శనమిచ్చాడు. దీనికి తోడు ప్రభాస్‌ తనది ద్విపాత్రాభినయమా? కాదా? అన్నది సూటిగా ఒక్క మాటలో తేల్చేయకుండా.. ‘ద్విపాతాభినయం’’ కాకపోవచ్చు అంటూ ఆసక్తికరంగా బదులిచ్చాడు. వీటిని బట్టీ చూస్తుంటే ‘సాహో’లో ప్రభాస్‌ది డ్యూయల్‌లో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది.


స్టోరీ: 2
 ఈ చిత్రంలో ఓ అనూహ్యమైన ట్విస్ట్‌తో ప్రభాస్‌ పాత్ర ఓ సరికొత్త కోణంలో దర్శనమివ్వబోతుందట. దీనికి ట్రైలర్‌లో చూపించిన కొన్ని సీన్లే బలాన్ని చేకూరుస్తున్నాయి. ముంబయిలో రూ.2 వేల కోట్ల భారీ మొత్తం చోరీ జరగడం, ఆ తర్వాత దాని వెనకున్న ముఠాను పట్టుకునేందుకు అండర్‌ కవర్‌ కాప్‌ అశోక్‌ చక్రవర్తిగా ప్రభాస్‌ రంగంలోకి దిగడం వంటి అంశాలు అందరికీ తెలిసినవే. అయితే అసలు కథేంటంటే.. ప్రభాసే ఆ భారీ చోరీకి పాల్పడతాడని, ఆ ట్విస్ట్‌ సినిమా చివరిలో అందరికీ తెలుస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రైలర్‌ చివర్లో ప్రభాస్‌ను పోలీసులు అరెస్టు చేయడం, శ్రద్ధా.. ప్రభాస్‌ తలకు గన్‌ గురిపెడుతూ ‘‘ఇక్కడ కాల్చడానికి ఏం లేదు.. మొత్తం ఇక్కడే ఉంది’’ అని చెప్పడం వెనుక అసలు రహస్యమదేని తెలుస్తోంది. అంతేకాదు.. ‘‘మనం డే అండ్‌ నైట్‌ లాగా.. ఒకటి వస్తే మరొకటి వెళ్లిపోవాలి’’ అని ట్రైలర్‌లో శ్రద్ధా మరో డైలాగ్‌ చెప్పడం వెనుకా అసలు కారణం ఇదేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ‘సాహో’ను ‘కిక్‌’కు ప్రీక్వెల్‌ అనో సీక్వెల్‌ అనో చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ‘కిక్‌’లో రవితేజ కూడా ఓ మంచి పని కోసం దొంగతనం చేసి, ఆఖరికి తెలివిగా పోలీస్‌ ఆఫీసర్‌ అవతారమెత్తుతాడు. ఇప్పుడిదే అంశం ‘సాహో’లో అటు ఇటుగా ఉన్నట్లు అవుతుంది. మరి ఈ రెండు కథలు వాస్తవమా? కాదా? అన్నది ఆగస్టు 30న తేలిపోనుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.