తెలుగు నేర్చిన నాయికలు
వెండి తెరపై తమ అభినయంతో, హావాభావాలతో అభిమానులను సంపాదించుకుంటారు. గ్లామర్‌ పాత్రలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తారు. కానీ తెర వెనుక తమ పాత్రలకు సొంత గొంతు వినిపించమంటే మటుకు ముఖం చాటేస్తారు కథానాయికలు. చాలా కాలం పాటుగా అగ్ర కథానాయికలు సొంత గొంతు వినిపించటం లేదు. కానీ ఈ మధ్య వచ్చిన కొత్త భామలు మాత్రం చాలా వేగంగా తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్‌ చెపుకున్నారు. ఆ కథానాయికలు ఎవరు, వాళ్లు మొదటి సారి తెలుగులో డబ్బింగ్‌ చెప్పిన చిత్రాలేవో ఒక సారి చూద్దాం.


* సాయి పల్లవి
తెలుగు కథానాయిక కాకపోయినా మొదటి సినిమాతో సొంత గొంతు వినిపించి సినీ ప్రేక్షకులను ‘ఫిదా’ చేసింది సాయి పల్లవి. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతోనే తెలుగు మాట్లాడుతుంది సాయి పల్లవి.
* రాశీఖన్నా
తన రెండవ సినిమా ‘జోరు’ చిత్రం కోసం మొదటి సారి గొంతు సవరించుకుంది అందాల సుందరి రాశీఖన్నా. అయితే అందులో తన గొంతుని పాట వరకే పరిమితం చేసింది. సాధారణంగా అందరూ డబ్బింగ్‌ చెప్పటానికి ప్రయత్నాలు చేస్తుంటే రాశీ మాత్రం మొదటి సారి ‘మేలి పండు చూడు’ అనే గీతంతో తెలుగులో సొంత గొంతును వినిపించింది. మళ్లి విజయ్‌ దేవరకోండతో కలసి నటిస్తున్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలో పూర్తిగా తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెప్పనుంది.
* పూజా హెగ్డే
తెలుగులో అతి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయకులందరితో జత కట్టే అవకాశం పొందింది పూజ. ఆమె మొదటిసారిగా ‘అరవింద సమేత వీర రాఘవ’లో సంభాషణలన్నీ తెలుగులో పలికింది.
* రష్మిక
చేసింది కొన్నే సినిమాలైనా, తెలుగులో స్టార్‌ కథానాయిక హోదాను అందుకుంది రష్మిక మందన్న. ఈమె ‘డియర్‌ కామ్రెడ్‌’ చిత్రంతో తోలి సారి తన గొంతును సవరించుకుంది. ప్రస్తుతం ఈ భామ మహేష్‌ సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తోంది.
* మెహ్రిన్‌
తొలి సినిమా ‘కృష్ణ గాడి వీర ప్రేమకథ’ ో అచ్చమైన తెలుగు అమ్మాయిలా తెరంగ్రేటం చేసింది మెహ్రిన్, కానీ ఆమె సొంత గంతు వినటానికి ‘ఎఫ్‌2’ చిత్రం వరకు ఆగాల్సి వచ్చింది.
* కీర్తి సురేష్‌
ప్రస్తుతం గ్లామరస్‌ పాత్రలైనా, డీగ్లామరస్‌ పాత్రలకైనా సిద్ధం అయిపోతుంది కీర్తి సురేష్‌. ఈమె పవర్‌ స్టార్‌ సరసన నటించిన ‘అజ్ఞాతవాసి’లో తొలిసారి తెలుగు సంభాషణలు పలికింది.
* సమంత
తెలుగు కోడలు అక్కినేని సమంత సొంత గొంతు వినిపించటానికి చాలా కాలమే పట్టింది. ఆమె ప్రత్యేక పాత్రలో నటించిన ‘మహానటి’ చిత్రంలో తొలి సారి తన గొంతును పరిచయం చేసింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.