తొలి పాత్రతో మది దోచుకున్నారు
ట్టుమని పది చిత్రాల్లో కనిపించినా.. వంద సినిమాల మైలురాయి దాటినా.. నటీనటులందరికీ తొలి చిత్రం ఓ మధుర జ్ఞాపకం. తొలిసారి వేసిన వేషం సుస్థిరం. ‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ ది బెస్ట్‌ ఇంప్రెషన్‌’ అన్న చందంగా మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటారు నటులంతా. అయితే, అందరూ ఒకే మార్గంలో నడిచినా ఒకేసారి గమ్యం చేరుకోలేరు కదా! అలానే నాయికలందరూ తొలి చిత్రంతోనే విజయం అందుకోలేదు. అలా అని వాళ్లు ప్రేక్షకుల్ని మెప్పించలేదని కాదు. అగ్ర నాయికలుగా కొనసాగుతున్న వారు తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోవచ్చు. తొలి చిత్రంతో మంచి నటిగా గుర్తింపు పొందిన వారు కాస్త వెనక ఉండొచ్చు. ఏది ఏమైనా.. ‘అరే! భలే చేసిందిరా, ఆ పాత్రకు ప్రాణం పోసింది’ అనిపించేలా తొలిసారి తెరపై కనిపించి ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న కొందరు కథానాయికల్ని ఓ సారి గుర్తుచేసుకుందాం...


* సమంత
‘జెస్సీ’గా తెలుగు ప్రేక్షకుల్ని తన ప్రేమలో పడేసింది సమంత. యువకులందరితో ‘ఏమాయ చేశావే’ అనిపించుకుంది. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో నాగ చైతన్య సరసన కనిపించి ప్రేమికులరాలంటే ఇలా ఉండాలనుకునేలా మాయ చేసింది. ఎవ్వరూ సామ్‌కు ఇది మొదటి చిత్రం అని భావించరేమో! ఎందుకంటే నటనలో అంత పరిణితి చూపింది. ఇప్పటికి ఎన్ని విభిన్న పాత్రలు పోషించినా జెస్సీ ప్రత్యేకంగా నిలుస్తుంది.


* షాలిని పాండే
షాలిని పాండే అంటే ప్రీతి. ప్రీతి అంటే షాలిని పాండే అనేంతగా మారిపోయింది. తొలి చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’లో ప్రీతిగా పరిచయమై యువత గుండెల్లో గూడు కట్టుకుంది షాలిని. విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిందీ చిత్రం. తొలి చూపులోనే అందరిని ఆకట్టుకుంది.


* సాయి పల్లవి
‘భానుమతి’ ఒక్కటే పీస్‌ అంటూ ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాలా! వరుణ్‌ తేజ్‌ కథానాయకుడుగా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది సాయి పల్లవి. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ యాసతో ఓ ఊపు ఊపింది.


* రాశీఖన్నా
‘శ్రీ సాయి శిరీష ప్రభావతి’ ఉంటే శిరీష అయినా ఉండాలి లేకపోతే ప్రభావతి అయినా ఉండాలి. ఈ శిరీష ప్రభావతి ఎంటి? అంటూ ప్రశ్నిస్తూనే వినోదం పంచింది రాశిఖన్నా. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలోని రాశీ పాత్ర పేరిది. తొలి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించింది.


* రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
‘ప్రార్థన’ ఇక్కడ ప్రతిదీ కౌంట్‌ అంటూ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ పాత్ర ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. సందీప్‌ కిషన్‌ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రమిది.


* పాయల్‌ రాజ్‌పుత్‌
‘ఇందు’ ఈ పేరు, పాత్ర ప్రతి యువకుణ్ని కదిలించింది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంలో పాయల్‌ పోషించిన పాత్ర పేరే ఇందు. ఓ అబ్బాయిని మోసం చేసిన అమ్మాయిగా కనిపిస్తుంది పాయల్‌. తన నటన, అందచందాలతో తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంది.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.