కథానాయికలు కూడా ‘క్రౌడ్‌ పుల్లర్సే’
‘క్రౌడ్‌ పుల్లర్స్‌’...
- సినీ పరిశ్రమలో తరచూ వినిపించే మాట ఇది. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న కథానాయకుల్ని చిత్రసీమ ముద్దుగా పిలుచుకునే పేరు ఇదే. స్టార్‌ కథానాయకులు కచ్చితంగా క్రౌడ్‌పుల్లర్సే. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా, కేవలం తమ కథానాయకుణ్ని తెరపై చూసుకోవాలని ఆరాటపడుతూ థియేటర్లకు వచ్చే అభిమాన గణం వాళ్లకు అండగా ఉంటుంది. అగ్ర హీరోలు కొన్నిసార్లు అభిమానుల కోసమే కథలు ఎంచుకోవడానికి కారణం కూడా ఇదే. అందుకే స్టార్‌ హీరోల చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. అయితే ఈమధ్య కొంతమంది కథానాయికలు ‘మేం కూడా క్రౌడ్‌ పుల్లర్సే’ అని నిరూపించుకునే పనిలో ఉన్నారు. ప్రేక్షకుల్ని థియేటర్లకు తీసుకువచ్చే మ్యాజిక్‌ మాకూ తెలుసు అంటున్నారు. వాళ్ల ప్రయత్నం సఫలీకృతమైతే నిర్మాతలకు మరో ప్రత్యామ్నాయం లభించినట్టే.

కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. స్టార్‌డమ్‌ తెచ్చుకున్న నాయికలు అప్పుడప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు చేయాలనే చూస్తుంటారు. అయితే వాళ్లకంటూ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కథానాయికలకు అభిమానగణమంటూ ప్రత్యేకంగా ఉండదు. వాళ్లని చూసి థియేటర్లకు ప్రేక్షకులు వస్తారన్న భరోసా నిర్మాతలకు లేదు. సినిమా బాగుండి, జనాలకు చేరువైతే మెల్లమెల్లగా వసూళ్లు పెరుగుతుంటాయి. అంతే తప్ప... తొలి మూడు రోజుల్లో వసూళ్లు మొత్తం రాబట్టుకొనే శక్తిసామర్థ్యాలు నాయిక ప్రాధాన్య చిత్రాలకు లేదన్నది వాస్తవం. బడ్జెట్‌ పరిమితులు కూడా దృష్టిలో పెట్టుకునే సినిమా తీయాలి. ఈ పరిధుల్ని దాటుకుని రావడానికి కథానాయికలు కృషి చేస్తున్నారు.

స్వీటీ వేసిన దారిలో...
అనుష్క ప్రధాన పాత్రలో ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ లాంటి భారీ చిత్రాలు తెరకెక్కాయి. ‘అరుంధతి’ సమయానికి అనుష్క పెద్ద స్టారేం కాదు. కానీ ఓ పెద్ద హీరో సినిమా స్థాయిలోనే ఖర్చు పెట్టి తీశారు. దానికి తగిన ఫలితమూ పొందారు. అనుష్కతో సినిమా అంటే రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టడానికి కూడా నిర్మాతలు వెనుకడుగు వేయడం లేదు. ఇదంతా ఆమె సంపాదించుకున్న స్టార్‌డమ్‌ పుణ్యమే. ఇటీవల సమంత నటించిన ‘ఓ బేబీ’ విడుదలైంది. సమంత ఇమేజ్‌పైనే ఆధారపడి తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రం మంచి వసూళ్లని అందుకోవడమే కాకుండా, నిర్మాతలకు లాభాల్ని తెచ్చి పెట్టింది. తాప్సి ఈమధ్య అన్నీ నాయికా ప్రాధాన్యం ఉన్న కథలే చేస్తోంది. ఇటీవల ఆమె నుంచి వచ్చిన ‘గేమ్‌ ఓవర్‌’కి మంచి వసూళ్లే దక్కాయి. తాప్సికి తెలుగులోనే కాదు, తమిళ, హిందీ చిత్రసీమల్లోనూ మార్కెట్‌ ఉంది. తనతో పరిమిత బడ్జెట్‌లో సినిమా తీస్తే - విడుదలకు ముందే నిర్మాత లాభాల్ని తెచ్చుకోవచ్చు. అందుకే తాప్సికి డిమాండ్‌ పెరిగింది.

‘మహానటి’తో నటిగా మరో అడుగు ముందుకేసింది కీర్తి సురేష్‌. ఈ సినిమాకి మంచి వసూళ్లు దక్కాయి. విమర్శకుల ప్రశంసలూ లభించాయి. అందుకే కీర్తి ఇప్పుడు నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు చిరునామాగా మారుతోంది. ఆమె ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అలాంటి రెండు మూడు కథలు ఆమె కోసం సిద్ధంగా ఉన్నాయి. కీర్తికి తమిళంలోనూ క్రేజ్‌ ఉంది. రెండు చోట్లా ఆమె సినిమాలకు వ్యాపారం జరుగుతుందన్నది నిర్మాతల ఆశ. తమన్నా, కాజల్‌ కూడా ఈ తరహా పాత్రలవైపు దృష్టి పెడుతున్నారు. వీళ్లతో సినిమా లాభసాటిగానే ఉంటుందన్న విషయం నిర్మాతలకూ అర్థమవుతోంది. కనీసం డిజిటల్‌ మార్కెట్‌లో సినిమాని అమ్ముకున్నా, బొటాబొటీగా గట్టెక్కేయొచ్చన్న ధీమా కలుగుతోంది.

మర్షియల్‌ సినిమాలు చేసేటప్పుడు చాలా సౌలభ్యాలు ఉంటాయి. కథానాయకుల్ని చూసి జనాలు థియేటర్లకు వస్తారనే ధీమా ఉంటుంది. ప్రచారం విషయంలోనూ అంతగా కలగజేసుకునే అవసరం ఉండదు. ‘యూటర్న్‌’, ‘ఓ బేబీ’లతో ఆ బాధ్యతలు నాపై పడ్డాయి. ఇలాంటి సినిమాలకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం ఓ సవాల్‌. మంచి కథని ఎంచుకుని, ప్రచారం గట్టిగా చేస్తే తప్ప.. ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేం. ఎలాంటి సినిమా చేసినా అభిమానుల్ని థియేటర్లకు రప్పించుకోగల సత్తా కొంతమంది స్టార్లకే ఉంటుంది. ఈ విషయంలో కథానాయకులు నిజంగా గొప్పే.
- సమంత


సినిమాని అంతా ఒక్కరై నడిపించడం అంత సులభం కాదు. ఎంత కష్టపడితే.. కథానాయకులకు ఆ ఇమేజ్‌, అంత క్రేజ్‌ దక్కుతుందో ఊహించగలను. నాలుగు పాటలు, కొన్ని సన్నివేశాలకు పరిమితయ్యే చిత్రాల్లో నటించడం చాలా సులభం. కథానాయికలపై ఎలాంటి ఒత్తిడీ ఉండదు. నాయికా ప్రాధాన్యం ఉన్న కథలు అలా కాదు. కథానాయకుడు లేకుండా సినిమాని గట్టెక్కించడానికి చెమటోడ్చాల్సిందే. మమ్మల్ని నమ్మి రూ.కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాతల ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. వాళ్లే లేకపోతే ఇలాంటి చిత్రాలకు అంకురార్పణ జరగదు. అందుకే నాయికా ప్రాధాన్య చిత్రాలు ఎప్పుడు చేసినా భయం వేస్తుంటుంది. ఫలితం గురించి కంగారు వెంటాడుతుంది. అలాంటి చిత్రాలకు ఆదరణ లభిస్తే ఆ సంతృప్తే వేరుగా ఉంటుంది.

- అనుష్క


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.