ప్రేక్షకులు మారారు.. దర్శక నిర్మాతలూ మారారు
కథనే నమ్మి చేశారా?
అయితే కచ్చితంగా అది మెదడుకు పదును పెట్టే సినిమా అయ్యుంటుంది!
జీవిత కథా చిత్రమా...
అంటే అది ఆర్ట్‌ సినిమా అన్నమాట!
కాన్సెప్ట్‌ సినిమాలా?
వాటిని చూడటానికి ప్రత్యేకంగా ఓ వర్గం ఉంటుందిలే!


- ఇలా కొంతకాలంగా విడుదలకి ముందే మన సినిమాపై ఓ ముద్ర పడిపోయింది. అందుకు తగ్గట్టుగా ప్రేక్షకులు కూడా విడిపోయారు. అది చూసి దర్శకనిర్మాతలు కూడా మా సినిమాకి ‘టార్గెట్‌ ఆడియెన్స్‌ వీళ్లే.. వాళ్లకి నచ్చితే చాలు’ అంటూ పరిమితుల మధ్య సినిమాలు తీయడం అలవాటు చేసుకున్నారు. జోనర్‌ ఏదైనా కావొచ్చు... వాటికి ఎలాంటి పేరైనా ఉండొచ్చు. కానీ ప్రతి సినిమా లక్ష్యం ప్రేక్షకుడికి వినోదం పంచడమే. కానీ వినోదం ఉన్న సినిమాలన్నీ విజయం సాధిస్తాయనుకోవడానికి వీలు లేదు. కారణం ముందే వాటిపై ఒక ముద్ర వేయడం, ఒకొక్క సినిమాని ఒక్కో వర్గం ప్రేక్షకులకే పరిమితం చేయడం. దాంతో మాస్‌ సినిమాలు తప్ప మిగతావి అంతగా ఆదరణకి నోచుకొనేవి కావు. వీటి మధ్యలో కొన్ని మంచి చిత్రాలు వచ్చినా అవి మరుగున పడిపోయేవి తప్ప, వాటికి కనీసం గుర్తింపు కూడా దక్కేది కాదు. అది గమనించే సినీ పండితులు ‘తెలుగు ప్రేక్షకుల్ని ఒక రకమైన సినిమాలకి అలవాటు చేశారు’ అంటూ వాపోయేవారు. కానీ క్రమంగా ఆ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకొంటోంది. ‘వినోదం పంచితే చాలు... అది ఏ తరహా సినిమా అయినా చూసేస్తాం’ అంటున్నారు ప్రేక్షకులు. ఇటీవల వచ్చిన సినిమాలు, వాటికి దక్కిన ఆదరణని చూస్తే అదే నిజమనిపిస్తోంది.

ఎన్ని రకాలో...

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’... అదొక డిటెక్టివ్‌ సినిమా.
‘మల్లేశం’... ఓ జీవిత కథ.
‘బ్రోచేవారెవరురా’... వినూత్నమైన ఓ కాన్సెప్ట్‌.
‘కల్కి’... ఓ థ్రిల్లర్‌ కథ.
‘ఓ బేబీ’.. భావోద్వేగాల ప్రయాణం..


 
ఇలా నెల రోజుల వ్యవధిలో తెలుగు ప్రేక్షకులు పలు రకాల రుచుల్ని ఆస్వాదించారు. అగ్ర తారలు ఉన్నారా లేరా? ఏ జోనర్‌ సినిమా? అని ఆలోచించకుండా ప్రచార చిత్రాలు నచ్చగానే వినోదం పంచుతాయనే భరోసా లభించగానే టిక్కెట్టు కొనేశారు. వసూళ్లలో తేడాలు ఉండొచ్చు కానీ... ఇటీవల విడుదలైన ‘దొరసాని’, ‘నిను వీడని నీడని నేనే’ వరకు ప్రతి సినిమా కూడా ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేసింది. వీటి తర్వాత వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ప్రేక్షకులకు చాలా రోజుల తర్వాత మళ్లీ మాస్‌ రుచిని చూపించింది. అలా ఇక్కడ అన్ని రకాల సినిమాలకీ ఆదరణ దక్కుతుందనే ఓ బలమైన సంకేతం ప్రేక్షకుల నుంచి పరిశ్రమకి వెళ్లినట్టైంది. ఇదివరకు ఓ కొత్త ప్రయత్నం గురించి ఆలోచన రాగానే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు దర్శకులు ధైర్యంగా కొత్త కథల్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రేక్షకుల నుంచీ ఆదరణ లభిస్తోంది.

ఇద్దరూ మారారు
తెలుగు సినిమాలో కొత్తదనం ఎక్కడ? అనే ప్రశ్న వచ్చినప్పుడు ‘ప్రేక్షకులు ఇలాంటి సినిమాల్నే చూస్తున్నారు కాబట్టి, మేం అవే తీస్తున్నాం’ అనేవారు దర్శక నిర్మాతలు. ప్రేక్షకులేమో ‘మీరు అవే తీస్తున్నారు కాబట్టి, మేం వాటినే చూస్తున్నాం’ అనేవారు. చిత్రసీమలో కొత్తదనం, కొత్త రకమైన చిత్రాలంటే కోడి ముందా? గుడ్డు ముందా? అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు దర్శకుల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తరచుగా కొత్త కథలు తెరపైకొస్తున్నాయి. ‘‘అగ్ర కథానాయకులు కూడా ఇటీవల కంటెంట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. కథా బలమున్న చిత్రాలే చేస్తున్నారు. దాంతో ప్రేక్షకులు ఆ తరహా చిత్రాలకి అలవాటు పడిపోయారు. మొదట్నుంచీ వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్న మాలాంటి కథానాయకులకి అది చాలా మేలు చేసింది. ఇప్పుడు మా సినిమాలకీ మంచి ప్రారంభ వసూళ్లు వస్తున్నాయి. ఇదివరకు మా సినిమాలకు ‘బాగుంది’ అనే మాట వినిపించాకే ప్రేక్షకులు థియేటర్లకి వచ్చేవాళ్లు. ఇప్పుడు ముందే సిద్ధమైపోతున్నార’’న్నారు యువ కథానాయకుడు శ్రీవిష్ణు. ‘‘కాన్సెప్ట్‌ సినిమాలకి మంచి రోజులొచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులూ చూడటానికి ఇష్టపడుతున్నారు. దానివల్ల మా అందరిలోనూ ధైర్యం వచ్చింది’’ అంటున్నారు కథానాయిక సమంత.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.