సెట్‌ చూసి కర్నూలు వచ్చినట్టుందన్నారు!
హైదరాబాద్‌ నేపథ్యంలో సినిమా అంటే  చార్మినార్‌ ముందు ఓ ఫ్రేమ్‌ సెట్‌ చేయాల్సిందే.
అదే కథ దిల్లీకి షిఫ్ట్‌ అయితే ఎర్రకోటని చూపించాలి.
విశాఖపట్నం అంటే బీచూ... రాజమండ్రి అంటే బ్రిడ్జూ.
అలానే... కర్నూలు అంటే కొండారెడ్డి బురుజు.
‘ఒక్కడు’లో మహేష్‌బాబు కర్నూల్లో చూపించిన హీరోయిజం కొండారెడ్డి బురుజు అంత ఎత్తున కనిపిస్తుంది. అప్పట్నుంచి కర్నూలు కథలకు కొండారెడ్డి బురుజు చిరునామాగా నిలిచింది.


ఇప్పుడు అదే బురుజు.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో వెలసింది. ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం. మహేష్‌బాబు హీరోగా  నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకుడు.  14 రీల్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసమే ఫిలింసిటీలో కొండారెడ్డి బురుజు సెట్‌ని తీర్చిదిద్దారు. ఆ విశేషాలను కళా  దర్శకుడు ప్రకాష్‌ ‘ఈనాడు సినిమా- సితార’తో చెప్పుకొచ్చారిలా.

‘‘కర్నూలు నేపథ్యంలో సాగే కథ ‘సరిలేరు నీకెవ్వరు’. కర్నూలు అనగానే ఎవరికైనా కొండారెడ్డి బురుజు గుర్తొస్తుంది. దాన్ని చూపించకుండా కథ చెప్పలేం. పైగా ఈ సినిమాలో బురుజు నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాలి. అందుకోసం కొండారెడ్డి బురుజు లొకేషన్‌ను పరిశీలించడానికి కర్నూలు వెళ్లాం. మునుపటికన్నా అక్కడ రద్దీ పెరిగిపోయింది. అలాంటి చోట మహేష్‌బాబు లాంటి హీరోతో షూటింగ్‌ అంటే చాలా కష్టం. జనాన్ని అదుపు చేయలేం. పైగా 20 రోజుల పాటు అక్కడే ఉండి షూటింగ్‌ చేయాలి. నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర చిత్రబృందం వందల్లో ఉంటారు.. వీళ్లందరినీ వెంటబెట్టుకుని షూటింగ్‌ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే.. అదే సెట్‌ని రామోజీ ఫిలింసిటీలో వేయాలని నిర్ణయించుకున్నాం.


* లేని కట్టడానికి ఉన్నట్టుగా ఊహించుకుని సెట్‌ వేయడం ఓ పద్ధతి. కొన్ని చారిత్రక కట్టడాల్ని పునఃసృష్టి చేయడం మరో పద్ధతి. దేనికష్టం దానిదే. చరిత్రకి సాక్ష్యంగా నిలిచే సెట్స్‌ వేయాలంటే ఇంకాస్త జాగ్రత్త్ర  అవసరం. అందుకే నా టీమ్‌తో మరోసారి కర్నూలు వెళ్లాను. కొండారెడ్డి బురుజు నేపథ్యాన్ని, చరిత్రని క్షుణ్నంగా అధ్యయనం చేశాను. బురుజు ఎత్తు, వెడల్పు కొలతలు పక్కాగా తీసుకున్నాం. రాతితో నిర్మించిన కట్టడం అది. ఏయే మిశ్రమాలు కలిస్తే అలాంటి రంగుని సృష్టించగలమో ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకున్నాం. బురుజుతో పాటు ఆ చుట్టుపక్కల వాతావరణం కూడా సెట్లో ప్రతిబింబించాలి. అందుకే వీధుల్లో దుకాణాలు ఎలా ఉన్నాయి? బయట ఎలాంటి బోర్డులు పెట్టారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న డివైడర్‌ ఎలా ఉంది? అక్కడ ఎలాంటి విద్యుత్‌ స్తంభాలు అమర్చారు? ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నాం. ఇలాంటి  కట్టడాల్ని పునఃనిర్మించాలంటే రామోజీ ఫిలింసిటీకి మించిన వేదిక  దొరకదు. అక్కడ ‘మాయా’ బృందం మాకు అన్ని విధాలా సహకరించింది. రోజుకి మూడొందల మంది, రాత్రీ పగలూ కష్టపడి మూణ్నెల్ల వ్యవధిలో,   రూ.4.5 కోట్ల వ్యయంతో సెట్‌ని నిర్మించాం. ఫైబర్‌, కలప, సిమెంట్‌, ఇనుము లాంటివన్నీ వాడాం. ఈ సెట్‌ మరో ఐదేళ్ల పాటు అలానే ఉంటుంది. అంత దృఢంగా నిర్మించాం. ఈ సెట్లో కీలకమైన సన్నివేశాలు, పోరాట ఘట్టాలు తెరకెక్కించారు. మొదటిసారి ఈ సెట్‌ చూసిన మహేష్‌బాబు ‘కర్నూలులో అడుగుపెట్టినట్టుంది’ అన్నారు. ఈ సెట్‌ గురించి ఆయన చాలామందికి చెప్పారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి చాలా మెచ్చుకున్నారు.
         
                               

* ఈ సినిమా కోసం ఓ ట్రైన్‌ సెట్‌నీ,  ఓ ఇంటి సెట్‌నీ తీర్చిదిద్దాం. ఇంటి సెట్‌ కోసం హైదరాబాద్‌ శివారులో ముప్ఫై ఎకరాల స్థలం లీజుకు తీసుకున్నాం. జొన్న తోట మధ్యలో ఇంటి సెట్‌ వేశాం. అవసరం అనుకుంటే జొన్నతోటని గ్రాఫిక్స్‌లో చూపించుకోవచ్చు. కానీ అది సహజంగా కనిపించదు.  షూటింగ్‌కి సమయం ఉంది కాబట్టి, నిజంగానే జొన్నతోటని పెంచాం. తగిన సమయం,  దర్శకుడి ప్రోత్సాహం ఉంటే తప్పకుండా ఇలాంటి సెట్స్‌ని తీర్చిదిద్దవచ్చు. సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి’’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.