సావిత్రి అందుకే.. ‘మహానటి’ అయ్యింది!
భారతదేశం మొత్తం మీద ఎంతో మంది గొప్ప నటీమణులుండొచ్చు. కానీ మహానటి అని పిలిపించుకునే అర్హత ఒక్క సావిత్రికే ఉందంటే అతిశయోక్తి కాదు. తిరుగులేని అభినయంతో ఓ తరాన్ని మొత్తం ఏలేసింది సావిత్రి. నిజానికి ఇప్పటి తరానికి సావిత్రితోనూ, ఆమె సినిమాలతోనూ అంతగా పరిచయం లేదు. కానీ ఆమె జీవితకథతో వస్తున్న ‘మహానటి’పై యువతరం చూపిస్తున్న ఆసక్తి చూస్తుంటే సావిత్రి కీర్తి పతాకం తరాల తారతమ్యాలు చేరిపేసి మరీ రెపరెపలాడుతోందని అర్థమవుతోంది. సావిత్రి మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవడానికి ఓ నటిగా ఆమెకున్న ఐదు గొప్ప లక్షణాలే కారణమని ఆమెతో కలసి పనిచేసినవారు చెబుతుంటారు. అవేంటో చదివేయండి.

1. సందర్భమేదైనా అట్టే అల్లుకుపోతుంది..
దర్శకులు షాట్‌లో సన్నివేశం చెప్పడం ఆలస్యం సావిత్రి క్షణాల్లో తన పాత్రలోకి ఒదిగిపోతుందట. సంతోషం, బాధ, కోపం.. ఏ భావానై¬్ననా సరే చిటికెలో ఆ మూడ్‌లోకి వెళ్లిపోయి పలికిస్తుందట. సావిత్రి స్పాంటేనిటీ గురించి బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఓసారి గొప్పగా చెప్పారు. ‘‘అద్భుతమైన స్పాంటేనిటీ ఉన్న తొలి తరం నటీనటుల్లో సావిత్రి ముందుంటుంది. ఏ మాత్రం సమయం తీసుకోకుండా అప్పటికప్పుడే పాత్రకు కావాల్సిన మూడ్‌లోకి వెళ్లిపోతుంద’’ని ప్రశంసించారు అమితాబ్‌.

2. ఆమె జ్ఞాపకశక్తి అమోఘం..
సావిత్రికున్న మరో గొప్ప లక్షణం అమోఘమైన జ్ఞాపకశక్తి. ఎంతటి భారీ డైలాగులున్నా సరే.. అవలీలగా కంఠస్తం పట్టేస్తుందట. సంభాషణలకు అనుగుణంగా కెమెరా ముందు ఎలా నటించాలో కూడా ముందే పక్కాగా సిద్ధమైపోతుందట. ఆమెకు రిహార్సల్స్‌ కూడా చాలా తక్కువ సందర్భాల్లోనే అవసరమౌతుందని ఆమెతో పనిచేసిన సీనియర్‌ దర్శకులు చెబుతుంటారు. సాధ్యమైనంతవరకూ సింగిల్‌ టేక్‌లోనే సీన్లు రక్తికట్టిస్తుందట.


3. నటనలో సమతూకం..
నటించడం అందరు నటులు చేసేదే. కానీ వంక పెట్టడానికి ఏమాత్రం వీలు లేనంత ఒద్దికగా, చాలా పద్ధతిగా నటించడం సావిత్రికే చెల్లు. నటనలో ఓ రిథమ్, డైలాగులు చెప్పడంలో ఓ టైమింగ్, ఆహార్యంలో ఒక తేజస్సు ఇవన్నీ సమతూకంలో కలిపి మహానటి అనే పేరుకు గౌరవాన్ని తీసుకొచ్చింది సావిత్రి. ఆమె కెమెరా ముందుకొచ్చి అలా ఫ్రేమ్‌లో నిలబడేసరికి సెట్లో ఓ సమ్మోహనం ఆవిష్కృతమయ్యేది.

4. సహజత్వానికి చిరునామా..
పాత్రకు సహజత్వాన్ని అద్ది ప్రాణప్రతిష్ఠ చేయడంలో సావిత్రి తర్వాతే ఎవరైనా. కనుపాపల కదలికల నుంచి కాలి అందెల సవ్వడి వరకూ ప్రతి మూమెంట్‌ను పర్‌ఫెక్ట్‌గా ఆవిష్కరిస్తూ, సన్నివేశంలోని సారమంతా తన ముఖంలోనే కనిపించేలా చేయడంలో ఆమె దిట్ట. సావిత్రి తన అభినయంతో జీవం పోసిన పాత్రలెన్నో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అందులో ‘మాయాబజార్‌’లోని శశిరేఖ పాత్ర ఐకానిక్‌గా నిలిచింది.


5. వృత్తిధర్మం తెలిసిన నటి..
సావిత్రికి తన వృత్తి పట్ల ఎంతో గౌరవం. ఎంత మహానటిగా నీరాజనాలందుకుంటున్నప్పటికీ నటన విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయాలకన్నా దర్శకుల సూచనలకే ఎక్కువ విలువిచ్చేది. దీంతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆటుపోట్లున్నా వాటి ప్రభావం వృత్తిపై ఏమాత్రం పడనీయలేదు. అందుకే ఆమె నుంచి మాయాబజార్, మిస్సమ్మ, అర్ధాంగి లాంటి మరపురాని చిత్రాలెన్నో వచ్చాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.