ఎలా ఎలా తెలుపను... ఎదలోని ప్రేమను!
* తారల ‘ప్రపోజల్‌’ జ్ఞాపకాలు

ప్రేమలో పడటం ఈజీయే... కానీ ఆ ప్రేమను తమ మనసు దోచినవారికి చెప్పడం మాత్రం అంత వీజీ కాదు. ఎంతటి మగానుభావులకైనా ఆ మూడు మాటలు చెప్పాలంటే ముచ్చెమటలు పట్టేస్తాయి. మూడు చెరువుల నీళ్లు తాగినా గుండె దడ మాత్రం తగ్గదు. ముహూర్తాలు మంచి రోజుల సంగతేమో కానీ ఒకటికి రెండు సార్లు మనసులో ప్రపోజల్‌ సీన్‌ రిహార్సల్‌ చేసుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు. సింపుల్‌గా ఊరి చివర రివర్‌ దగ్గర ఫ్లవర్‌ ఇచ్చి ‘ఐ లవ్‌ యూ’ చెబుదామా లేదా గ్రాండ్‌గా బీజింగ్‌లో రింగ్‌ తొడిగి ‘విల్‌ యూ మ్యారీ మీ’ అని అడుగుదామా అని బోలెడన్ని ప్లాన్లు గీసేస్తుంటారు. తీరా నెచ్చెలి ముందుకెళ్లి నిల్చోగానే, ఆమె కళ్లలోకి కళ్లుపెట్టి చూడంగానే ఆ ప్లాన్లన్నీ క్రాష్‌ అయిపోయిన ప్లేన్లలా గంగలో కలసిపోతాయి. అప్పుడు వారి పరిస్థితిని అర్థం చేసుకోవడం ఆ వాలెంటైన్‌కూ సాధ్యం కాదేమో. మాటలు కూడబలుక్కుంటూ, ఊపిరి ఉగ్గబట్టుకుంటూ ఏదోలా అసలు విషయం చెప్పేయగానే ప్రేమలో గెలిచేశామన్నంత రిలీఫ్‌ వచ్చేస్తుంది. ఆ తర్వాత అమ్మాయి నోటి నుంచి ‘ఎస్‌’ అనే మాట వచ్చిందంటే ఇంక చెప్పలేని ఆనందంతో ముఖం హార్ట్‌ సింబల్‌లా వెలిగిపోతుంది. అయితే ప్రపోజ్‌ చేసేటప్పుడు అంత టెన్షన్‌ పడినా ఆ తర్వాతి రోజుల్లో ఆ జ్ఞాపకాలను తలచుకుంటే ఓ మధురానుభూతి కలుగుతుంది. సెలబ్రిటీలు కూడా ఇలాంటి అనుభూతులకు అతీతులు కాదు. ప్రేమికుల రోజు సందర్భంగా సినీ తారల ప్రపోజల్‌ జ్ఞాపకాలు మీకోసం.


* ఆయన వెండితెరపై ‘కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌’ అయ్యిండొచ్చు. చేతులు బార్లా చాపి ఒక్క చిరునవ్వు నవ్వితే కథానాయికలు పరిగెత్తుతూ వచ్చి వాటేసుకోవచ్చు. కానీ నిజజీవితంలో మాత్రం షారుఖ్‌ ప్రపోజల్‌ అలా జరగలేదు. అందరు ప్రేమికుల్లాగే ఆయనా ఆ విషయంలో టెన్షన్‌ పడ్డారట. టీనేజీ రోజుల్లోనే ఆయనకు గౌరీతో పరిచయమేర్పడి ప్రేమగా మారింది. ఇద్దరం పెళ్లి చేసుకుందామని గౌరీకి ప్రపోజ్‌ చేసిన సందర్భం గురించి షారుఖ్‌ ఓ టీవీ షోలో పంచుకున్నారు. ‘‘ఓరోజు నా కార్లో గౌరీని తనింటి దగ్గర దిగబెట్టాను. కార్‌ ఇంజిన్‌ ఆన్‌లోనే పెట్టి గౌరీతో ‘నిన్నో విషయం అడగాలి’ అన్నాను. ‘ఏంటి’ అన్నట్లు చూసింది. ‘మనం పెళ్లి చేసుకుందామా’ అని అడిగేసి ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా అక్కణ్నుంచి స్పీడుగా వెళ్లిపోయాను. బహుశా ఆమె ‘ఎస్‌’ అనే చెప్పి ఉంటుంది. అందుకే మేం పెళ్లి చేసుకున్నాం కదా’’ అని చెప్పారు షారుఖ్‌.


*
అభిషేక్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లది కాస్త విచిత్రమైన కథ. ‘గురు’లో జంటగా నటించిన వారిద్దరూ ఆ సినిమా చిత్రీకరణ కోసం న్యూయార్క్‌లో ఉన్నప్పుడు ఒకే హోటల్‌లో ఉండేవారు. ఆ సమయంలో ఐశ్వర్య హుందాతనం, ప్రవర్తన అభిషేక్‌కు నచ్చేశాయి. ఓరోజు ఆయన హోటల్‌ బాల్కనీలో ఒంటరిగా నిల్చున్నప్పుడు ఐశ్వర్యను చూసి ఇలాంటి పరిపూర్ణమైన స్త్రీని పెళ్లి చేసుకుని ఇదే బాల్కనీలో జంటగా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నారట. ఆ తర్వాత ఐశ్వర్యను అదే బాల్కనీ దగ్గరకు పిలుచుకెళ్లి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగారట. ముందు ఐశ్వర్య షాక్‌ అయినా తర్వాత ఓకే చెప్పేసింది. అలా ప్రపంచ సుందరిని తన భార్యగా చేసుకున్నారు అభిషేక్‌.


*
అక్షయ్‌ కుమార్, ట్వింకిల్‌ ఖన్నాకు ఓ ఫొటోషూట్‌ సమయంలో ఇష్టం ఏర్పడిందట. ఆ తర్వాత వారిద్దరూ డేటింగ్‌ చేశారు. ప్రాక్టికల్‌ జోక్స్‌ వేయడంలో దిట్ట అయిన అక్షయ్‌ ఓసారి ట్వింకిల్‌ పుట్టినరోజు కానుకగా డైమండ్‌ అని చెప్పి క్రిస్టల్‌ పేపర్‌ వెయిట్‌ను కానుకగా ఇచ్చారట. అప్పుడు ట్వింకిల్‌ ‘ఏదో రోజు నాకు ఇదే సైజ్‌లో ఉండే వజ్రం కొని తీరతావు’ అని అక్షయ్‌తో ఛాలెంజ్‌ చేశారట. ఆ తర్వాత కొన్నాళ్లకు ట్వింకిల్‌తో అక్షయ్‌ పెళ్లి ప్రతిపాదన తెచ్చారట. ప్రపోజ్‌ చేయడమైతే సులువుగానే చేశారు కానీ ట్వింకిల్‌ పెట్టిన షరతు విని అక్షయ్‌ ఆశ్చర్యపోయారు. ట్వింకిల్‌ ఆ సమయంలో ‘మేలా’ అనే చిత్రంలో నటించేది. ఒక వేళ అది ఫ్లాప్‌ అయితే పెళ్లికి సిద్ధమని లేకపోతే సినిమాలు కొనసాగిస్తానని చెప్పిందట. అయితే అక్షయ్‌ అదృష్టం కొద్దీ ఆ సినిమా ఫ్లాప్‌ కావడంతో ట్వింకిల్‌ అతని జీవితంలోకి వచ్చింది. ఆ సినిమా హిట్‌ అయ్యింటే నా పరిస్థితి ఎలా ఉండేదో అని చమత్కరిస్తుంటారు అక్షయ్‌.


* నవాబుల వంశానికి వారసుడు, అగ్ర కథానాయకుల్లో ఒకరైన సైఫ్‌ అలీఖాన్‌ స్వయంగా పెళ్లి చేసుకుందామని అడిగితే ఎవరైనా వద్దంటారా? కానీ కరీనా కపూర్‌ వద్దంది. ఆశ్చర్యంగా ఉన్నా అది నిజం. విహార యాత్ర కోసం ప్యారిస్‌ వెళ్లిన వాళ్లిద్దరూ అనుకోకుండా అక్కడ కలుసుకున్నారట. అక్కడున్నప్పుడే ఓరోజు పెళ్లి చేసుకుందామని కరీనాను సైఫ్‌ అడిగారట. కానీ ఆమె నో చెప్పేసింది. అయినా పట్టు విడవని సైఫ్‌ కొన్ని రోజుల తర్వాత మళ్లీ పెళ్లి ప్రతిపాదన తెచ్చారట. అప్పుడు ‘నేను కెరీర్‌ మీదే దృష్టిపెట్టాను. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం లేద’ని చెప్పిందట. కానీ తనకు తెలియకుండానే సైఫ్‌పై ప్రేమ పుట్టిందేమో, రెండ్రోజుల తర్వాత తనే పెళ్లికి ఓకే చెప్పేసిందట. అన్నట్లు సైఫ్‌ తండ్రి, ప్రముఖ క్రికెటర్‌ పటౌడీ అలీఖాన్‌ కూడా ప్యారిస్‌లోనే అప్పటి కథానాయిక షర్మిలా టాగోర్‌కు ప్రపోజ్‌ చేసి ప్రేమను గెలుచుకున్నారట. అలా తండ్రీతనయులిద్దరికీ ప్యారిస్‌తో మధుర జ్ఞాపకాలున్నాయి.


*
‘ఆ 45 సెకెన్ల నిశ్శబ్దాన్ని భరించలేకపోయాను బాబోయ్‌’ అంటున్నాడు నిక్‌ జొనాస్‌. ప్రియాంక చోప్రాకు తాను ప్రపోజ్‌ చేసిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటూ. ప్రియాంక జన్మదిన వేడుకల్లో ఆమె ముందు మోకాలిపై కూర్చొని రింగ్‌ చూపిస్తూ ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఈ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా మారుస్తావా’ అని అడిగాడట. అప్పుడు ప్రియాంక సుమారు 45 సెకెన్ల పాటు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయిందట. ఆమె ఏమని స్పందిస్తుందా అని నిక్‌ తీవ్ర ఉత్కంఠకు లోనైయ్యాడట. మళ్లీ వెంటనే ‘ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడుగుతాను. నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతేనే’ అని అన్నాడట. ఉంగరం తొడుగుతున్నప్పుడు ప్రియాంక నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. ఇంకేముంది ప్రియానిక్‌ ప్రేమకథ సుఖాంతమైంది.


- సిహెచ్‌.నాగార్జున


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.