సినీ సాహిత్యంలో గాంధీతత్వం..
మహాత్మా గాంధీ గురించి, ఆయన 70వ జన్మదిన సందర్భంగా.. ‘ఇలాంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో ఈ నేలమీద నడిచారు అనే విషయాన్ని ముందుతరాలవారు విశ్వసించటం కూడా కష్టమే!’ అన్నారు శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌. నిజమే ఒక వ్యక్తి కులమతాలకు అతీతంగా దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం, ఏ ఆయుధం లేకుండా అహింస, సత్యం అనే మార్గంతో భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం.. కల్పనలాగే అనిపిస్తుంది. గాంధీ మహనీయుని గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘నా జీవితమే నా సందేశమ’న్న గొప్ప వ్యక్తి. అందుకే ఆయన భారతీయులకే కాదు ఇతర దేశాల వారికి స్ఫూర్తి. మహాత్ముని గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు పుస్తకాలతో సినిమాలు పోటీపడ్డాయి. గాంధీ బాట ఇది అని తెలుగు ప్రజలకు చూపించి వారిని చైతన్యం చేసేందుకు ఎందరో తెలుగు దర్శక, నిర్మాతలు ముందుకొచ్చారు. సామాజిక స్పృహ ఉన్న సినిమాల్లో గాంధీ గురించి ఓ పాట ఉండాల్సిందే. ఎందరో తెలుగు రచయితలు గాంధీ గొప్పతనాన్ని పాటల ద్వారా తెలిపే ప్రయత్నం చేశారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా.. వెండితెరపై బాపూజీ గురించి వచ్చిన తెలుగు చిత్రాల్లోని కొన్ని పాటల్ని స్మరించుకుందాం...


*
కొంతమంది సొంత పేరు కాదురా గాంధీ
  (మహాత్మ)
- శ్రీకాంత్‌ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘మహాత్మ’. ఈ సినిమాతో ప్రేక్షకుల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఇందులోని ‘కొంతమంది సొంత పేరు కాదురా గాంధీ’ అనే సాగే ప్రతి భారతీయుడ్ని ఆలోచింపజేస్తుంది. గాంధీ గొప్పతనాన్ని చూటి చెప్పే చక్కని గీతమిది. తరతరాలకు నిలిచేపోయే అద్భుతగేయమిది. ‘ఇలాంటి నరుడొకడిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి.. నమ్మరానిదని నమ్మక ముందే ముందు తరాలకు చెప్పండి’ అనే చరణం ముందుతరాలకు గాంధీ అనుసరించిన విధానం గురించి తెలియజేయమనని చెప్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంతో, బాల సుబ్రహ్మణ్యం తన గాత్రంతో ప్రేక్షకుల్లో దేశభక్తి నింపారు.


*
ఓ బాపూ నువ్వే రావాలి.. నీ సాయం మళ్లీ కావాలి 
(శంకర్‌ దాదా జిందాబాద్‌)
- ప్రభుదేవా దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం ‘శంకర్‌దాదా జిందాబాద్‌’. గాంధీ మార్గాన్ని అనుసరించే వ్యక్తిగా చిరంజీవి కనిపించి అందరిలోనూ స్ఫూర్తినింపారు. ఇందులో ‘ఓ బాపూ నువ్వే రావాలి.. నీ సాయం మళ్లీ కావాలి’ అంటూ సాగే పాట ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విధ్వంసాలను ఆపడం ఎవరి తరం కాదు అందుకే నువ్వే రావాలి, హింసను నువ్వు మాత్రమే ఆపగలవు.. అందుకే నీ సాయం మళ్లీ కావాలి అని రచయిత సుద్దాల అశోక్‌తేజ చైతన్యవంతమైన సాహిత్యం అందించారు. అదే స్థాయిలో ఈ పాటను ఆలపించి గాంధీపై ప్రేమను పంచుకున్నారు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, గాయకుడు సాగర్‌.


*
జరుపుతోంది జరుపుతోంది భారతజాతి  (నేటి గాంధీ)
- ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రాజశేఖర్‌ కధానాయకుడుగా వచ్చిన చిత్రం ‘నేటి గాంధీ’. గాంధీ జయంతి గురించి చెప్పే పాట అపూరమైంది. దేశంలో జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ‘కళ్లను మూయక.. కాళ్లను కదపక.. వీధి వీధిన నిలిచి చూడమంటోంది జాతిపితని.. తను సాధించిన ప్రగతి..మన స్వర్ణ స్వతంత్ర భారతి’, ‘పడతి ఒంటరిగ కనపడితే పగలే నడిరేయవుతుంది.. పశువాంఛలతో బుసకొడుతుంది’ చరణాలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలకు ప్రతిబింబాలు. ఈ పాటలో గాంధీ జయంతి చెప్తూనే మన మధ్య ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. గ్రహించమని రచయిత తన సాహిత్యంతో ప్రేక్షకుల్ని చైతన్యం చేశారు.
శంకర్‌దాదా జిందాబాద్,నేటి గాంధీ,మహాత్మCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.