30 సంవత్సరాల క్రితం...
డిసెంబర్ 7, 1990న హిందీలో విడుదలై నేటికీ 29 సంవత్సరాలు అయ్యింది.

ఈ సందర్భంగా 'శివ' గురించి ..అది 1989 అక్టోబర్‌ 5వ తేది. తెలుగు తెరపై అక్కినేని వారసుడు నాగార్జున, ఒక నూతన దర్శకుడితో కలసి రూపొందించిన సినిమా విడుదల అయిన రోజు. ఆ చిత్రం పేరే ‘శివ’. అప్పటి వరకూ తెలుగులో హిట్‌ సినిమాలున్నాయి. సూపర్‌హిట్‌ మూవీలున్నాయి. కానీ వెండీ తెరపై ట్రెండ్‌ సెట్‌ చేసిన తొలి సినిమా ‘శివ’. మొత్తం భారతీయ సినీ పరిశ్రమ అంతా టాలీవుడ్‌ గురించి మాట్లాడుకునేట్లు చేసిన చిత్రం అది. సినిమాలో టెక్నిషియన్‌ అనే పదాన్ని వాడటం మొదలుపెట్టింది కూడా అప్పటినుంచే. ఆ చిత్ర దర్శకుడే రామ్‌ గోపాల్‌ వర్మ. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు ఆయన. ఒక తరాన్ని విపరీతంగా ప్రభావితం చేసింది ఈ సినిమా. ‘శివ’ సినిమా చూసి డైరక్టర్‌ అయిపోదామని హైదరాబాద్‌ వచ్చేసిన వాళ్లు కోకొల్లలు. సినిమా విడుదల అయిన మూడు దశాబ్దాల తరువాత కూడా చిత్ర సీమలో ఇంకా ‘శివ’ ప్రభావం ఉంది అంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి, వి.వి.వినాయక్, పూరి జగన్నాథ్, వంటి టాప్‌ దర్శకుల్ని ఎందర్నో ప్రభావితం చేసిన మూవీ అది. అంత వరకూ తెలుగు తెరపై చూడని రీరికార్డింగ్, నేపథ్య సంగీతం, ఫైట్‌లు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. షాట్‌ డివిజన్, టేకింగ్‌ అనే పదాలకి అర్థాన్ని చెప్పింది చిత్రం. కళాశాల నేపథ్యంలోని గీతం ‘బోటనీ పాఠముంది’, సైకిల్‌ చైన్‌ తెంపే సీన్, కుర్రకారుపై ఎనలేని ప్రభావాన్ని చూపాయి. యువతలో కళాశాల గ్రూపు రాజకీయాలకు అద్దం పట్టిందీ ఈ చిత్రం.


‘శివ’ సినిమాకు 30 సంవత్సరాలు పూర్తెన అయిన సందర్భంగా ‘‘ నాగార్జునా, ఇవాళ మన ప్రియమైన బిడ్డకు 30వ పుట్టినరోజు’’ అంటూ ట్వీట్‌ చేశారు వర్మ.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.