వ్యాపారానికి ఊపిరూదుతున్న చిన్న సినిమాలు
ఒకప్పుడు రంజాన్‌కు ఖాన్‌ల త్రయం నుంచి వచ్చే సినిమాల కోసం అభిమానుల కంటే ఎక్కువగా మల్టీప్లెక్స్‌లే ఎదురుచూసేవి.
అయితే ఇపుడు తమ గల్లాపెట్టెల్లో గలగలలు కొనసాగడానికి కంటెంట్‌ ఉన్న చిన్న సినిమాల కోసం ఎదురుచూస్తున్నాయి అవి.
అందుకు తగ్గట్లే బాలీవుడ్‌లో తక్కువ బడ్జెట్‌ సినిమాలు రాణిస్తుండడంతో వీరి ఆదాయానికి ఢోకా లేకుండా పోతోంది. తెరల సంఖ్యను సైతం పెంచుకుంటున్నాయి. ఫలితాల్లోనూ రాణిస్తున్నాయి. అయితే ప్రపంచకప్‌ ఫీవర్‌ వీటి ఆదాయాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి.


పీవీఆర్‌, ఐనాక్స్‌ వంటి మల్టీప్లెక్స్‌లకు చిన్న బడ్జెట్‌ సినిమాలే పెద్ద అండగా మారాయి. తద్వారా వ్యాపార నిర్వహణ సులువుగా మారుతోంది. ఒకప్పుడు చేతుల్లో డబ్బులాడక.. కార్యకలాపాలకు ఇబ్బందులు పడేవి. రంజాన్‌ మాసంలో వచ్చే సల్మాన్‌ ఖాన్‌ సినిమా కోసమో; దీపావళికి వచ్చే షారుక్‌ ఖాన్‌ చిత్రం కోసమో లేదంటే కొత్త ఏడాదికి వచ్చే ఆమిర్‌ ఖాన్‌ బ్లాక్‌బస్టర్‌ కోసమో ఎదురుచూస్తుండేవి. కానీ ఇపుడు పరిస్థితి మారింది. గట్టి కథనంతో, అంతగా పేరుప్రఖ్యాతులు లేని నటులతో వస్తున్న సినిమాల టికెట్లు కూడా గట్టిగానే తెగుతున్నాయి.

ఉదాహరణకు విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ‘యురి: ద సర్జికల్‌ స్ట్రైక్‌’ సినిమా 2019లోనే రెండో అత్యధిక గ్రాసర్‌గా నిలిచింది. దీని బడ్జెట్‌ రూ.50 కోట్ల కంటే తక్కువగానే ఉన్నా.. రూ.250 కోట్ల వరకు బాక్స్‌ ఆఫీస్‌ను బద్దలు కొట్టింది. విక్కీ 2015లోనే తెరంగేట్రం చేసినా.. వాణిజ్యపరమైన విజయం దక్కింది ఈ సినిమాతోనే. యురి సినిమాలో కథకు తోడు గట్టి స్క్రీన్‌ప్లే కూడా ఉండడంతో సినిమా ప్రేమికులను, విమర్శకులనూ ఆకర్షించగలిగింది. ఇదే తరహాలో కృతి సనన్‌, కార్తిక్‌ ఆర్యన్‌ జంట సందడి చేసిన ‘లుకా చుప్పి’ కూడా తక్కువ బడ్జెట్‌ సినిమానే. రూ.25 కోట్లతో చిత్రాన్ని తీయగా.. రూ.100 కోట్లను రాబట్టుకుంది. ఈ ఏడాదిలోనే కాదు.. గతేడాదిలోనూ ‘బరేలీ కి బర్ఫీ’, ‘బఢాయి హో’, ‘అంధాధున్‌’ వంటి చిన్న సినిమాలు వాణిజ్యపరంగా విజయాలను అందుకున్నాయి. ‘ఇపుడంతా స్టార్ల చుట్టూ కాకుండా.. కథ, కథనాల చుట్టూ పరిశ్రమ తిరుగుతుండడం మంచి పరిణామమ’ని నిర్మల్‌బంగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం.


హాలీవుడ్‌, ప్రాంతీయ చిత్రాలూ..
బాలీవుడ్‌ చిన్న సినిమాలతో పాటు హాలీవుడ్‌, ప్రాంతీయ చిత్రాల డబ్బింగ్‌ వర్షన్లు కూడా మల్టీప్లెక్సులు కళకళలాడడానికి దోహదం చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ అతిపెద్ద బాక్సాఫీసు విజయంగా ఉంది. ఇది భారత్‌లో విడుదలైన పది రోజుల్లోనే రూ.300 కోట్లను వసూలు చేసిన తొలి హాలీవుడ్‌ సినిమాగా నిలిచింది. దీని జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజా గణాంకాల ప్రకారం.. పదిహేను రోజుల కిందటే(మే 10) రూ.400 కోట్లను అధిగమించినట్లు తెలుస్తోంది. అంతక్రితం ఏడాది వచ్చిన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ భారత బాక్సాఫీసు చరిత్రలోనే అతిపెద్ద నాలుగో సినిమాగా నిలిచింది. ఇక 2017లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి2: ద కన్‌క్లూజన్‌’ కూడా తెలుగు, తమిళంతో పాటు హిందీ, ఇతర భాషల్లోకి డబ్‌ అయి వెళ్లి రికార్డులు కొల్లకొట్టింది.

తెలుగు సినిమాలూ..
ఈ ఏడాది విడుదలైన ఎఫ్‌2, 118, మజిలీ, చిత్రలహరి, జెర్సీ, మహర్షి వంటి సినిమాలు కూడా మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చిన ఎఫ్‌2 అటు థియేటర్లలో.. ఇటు మల్టీప్లెక్స్‌లలో సందడి చేసింది. ఇటీవల విడుదలైన మహర్షి కూడా మల్టీప్లెక్స్‌లలో కలెక్షన్లను బాగానే అందుకుంటోంది. ఇక అంతక్రితం ఏడాది భరత్‌ అనే నేను, రంగస్థలం, అరవింద సమేత, గీతా గోవిందం, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, మహానటి, భాగమతి, హలో గురూ ప్రేమ కోసమే, తొలి ప్రేమలు అత్యధిక వసూళ్లు అందించాయి.

సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు
అప్పుడప్పుడు వచ్చే పెద్ద స్టార్ల సినిమాలతో పాటు.. కథనంతో కట్టిపడేసే చిన్న బడ్జెట్‌ సినిమాలూ మల్టీప్లెక్స్‌లకు కాసులు కురిపిస్తున్నాయి. మరో పక్క, ఆయా సంస్థలు 4డీఎక్స్‌, ఐమాక్స్‌, స్క్రీన్‌ఎక్స్‌ వంటి సాంకేతికతలను అందిపుచ్చుకోవడం కోసం పెట్టుబడులు భారీగానే పెడుతున్నాయని నిర్మల్‌బంగ్‌ చెబుతోంది. ఇక సినిమాల కోసం వచ్చిన ప్రేక్షకులు ఇంటర్వెల్‌ సమయంలో తీసుకునే ఆహార, పానీయాల విక్రయాలు కూడా మల్టీప్లెక్స్‌ ఆపరేటర్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే మల్లీప్టెక్సుల్లో ఉండే ఆహార ధరలు అధికంగా ఉంటున్నాయన్న కారణంతో మహారాష్ట్ర ప్రభుత్వం బయటి ఆహారాన్ని అనుమతించడం గమనార్హం. దీంతో ఆయా కంపెనీలు భారీ డిస్కౌంట్లు లేదా ధరల్లో కోత వేశాయి. పాప్‌కార్న్‌, ఇతరత్రా ఆహార ధరలు తగ్గాయి. అయితే ఆ వివాదం సద్దుమణిగిన కారణంగా విక్రయాలు పెరుగుతాయనే విశ్లేషకులు భావిస్తున్నారు.

తెరల సంఖ్య పెరుగుతోంది..
పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌లు రెండూ ఈ ఏడాది 80-100 తెరలను అదనంగా జత చేయాలని భావిస్తున్నాయి. 2018-19లో పీవీఆర్‌ 90 తెరలను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. 66కే పరిమితమైంది. ఇక ఐనాక్స్‌ లీజర్‌ మాత్రం 85 తెరలను అదనంగా తీసుకురాగలిగింది. ప్రేక్షకులు భారీగా తరలివస్తుండడంతో జనవరి-మార్చిలో ఈ రెండు కంపెనీల ఫలితాలు గట్టిగానే వినిపించాయి. పీవీఆర్‌ ఏకీకృత నికర లాభం 77% వృద్ధి చెందింది. ఇందుకు ప్రేక్షకులు సంఖ్యలో 44% వృద్ధి కారణమైంది. ఐనాక్స్‌ లీజర్‌ లాభం మాత్రం అధిక పన్ను చెల్లింపుల కారణంగా 17% తగ్గినప్పటికీ.. మల్టీప్లెక్స్‌ కార్యకలాపాల పనితీరు బలంగానే ఉంది. ఏప్రిల్‌-జూన్‌లో మాత్రం ఇప్పటికే ఐపీఎల్‌ ప్రభావం కాస్త కనిపించగా.. ఇక ప్రపంచకప్‌ ప్రభావం కూడా తోడుకానుందని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ అంచనా కడుతోంది. అయితే ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ విజయం వల్ల ప్రస్తుత త్రైమాసికంలో మెరుగైన ఫలితాలే వస్తాయని ఇతర విశ్లేషకులు అంటున్నారు. వేసవి సెలవుల్లో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఇందుకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.