పాన్‌ ఇండియా చిత్రాలకు బాలీవుడ్‌ భామలు
కథానాయిక కావాలా? ముంబయి వెళ్దాం! హీరోయిన్‌ కోసం వెదుకుతున్నారా? బాలీవుడ్‌ ఉందిగా..! పాన్‌ ఇండియా సినిమా అంటే మరి ఆ మాత్రం కావద్దూ?...

ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌. తెలుగులో స్టార్‌ హోదా దక్కించుకున్న కథానాయికలు బోలెడుమంది. కొత్త భామలకీ కొదవలేదు. అయినా సరే... స్టార్‌ హీరో నటించనున్న సినిమాలో హీరోయిన్‌ కావాలనగానే బాలీవుడ్‌వైపు చూస్తుంటారు దర్శకనిర్మాతలు. కియారా డేట్లు ఖాళీగా ఉన్నాయా? అలియాని సంప్రదిస్తే ఎలా ఉంటుంది? దీపికా మాటేమిటి? అనన్య పాండే మన హీరో పక్కన బాగానే ఉంటుందా? అంటూ ఆరాలు తీస్తుంటారు. కొత్తందాన్ని చూపించాలనే తపన, మార్కెట్‌ లెక్కలు... ఇలా పలు కారణాలు దీనివెనుక కనిపిస్తున్నాయి.

ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కలయికలో తెరకెక్కనున్న సినిమా కోసం ఇప్పటికే దీపికా పదుకొణెను ఎంపిక చేసేశారు. ఎన్టీఆర్‌- త్రివిక్రమ్‌ సినిమా కోసమూ అటువైపే చూస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్‌బాబుకు జోడీ విషయంలోనూ మొదట బాలీవుడ్‌ భామల పేర్లే వినిపించాయి. ఇలా అగ్ర హీరోల సినిమాల కోసం ఎక్కువగా హిందీలోనే కథానాయికల అన్వేషణ జరుగుతుంటుంది. మొన్నటిదాకా మలయాళమో, తమిళమో, లేదంటే బెంగళూరు అమ్మాయిలు తెలుగు తెరపై ఎక్కువగా మెరిసేవారు. ఇప్పుడు సీన్‌ ముంబయికి మారింది. పారితోషికం ఎంతైనా పర్వాలేదు, ఖర్చులు కొంచెం ఎక్కువే అయినా భరించేద్దాం.. అంటూ బాలీవుడ్‌ బాట పడుతున్నారు దర్శకనిర్మాతలు.
పాన్‌ ఇండియా ప్రభావం

ప్రభాస్‌ ‘సాహో’లో శ్రద్ధాకపూర్‌ మెరిసింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో విద్యాబాలన్‌ నటించారు. అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో అలియాభట్‌ నటిస్తోంది. విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కలిసి చేస్తున్న ప్రాజెక్టులో అనన్య పాండే కన్పించనుంది. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సయీ మంజ్రేకర్‌ నటిస్తోంది. సల్మాన్‌ఖాన్‌ ‘దబంగ్‌3’తో పరిచయమైన కథానాయిక ఈమె. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ఎంపికైందని సమాచారం.


ఇలా చిత్రసీమలో కథానాయికల ఎంపిక ప్రక్రియని గమనిస్తే భవిష్యత్తులో బాలీవుడ్‌ హీరోయిన్లే తెలుగు తెరపై మెరవబోతున్నారనే విషయం స్పష్టమవుతోంది. పాన్‌ ఇండియా సినిమాల ప్రభావంతోనే హిందీ భామల ఎంపిక ఎక్కువగా జరుగుతోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న కథానాయికలైతే మరింత మేలు జరుగుతుందనేది చిత్రబృందాల అభిప్రాయం. ‘ప్రేక్షకుల దృష్టిని సులభంగా ఆకర్షించవచ్చు. వ్యాపారపరంగా కలిసొస్తుంది. మార్కెట్‌ను పెంచుకోవచ్చు. అందుకే కథానాయికని బాలీవుడ్‌ నుంచి, ప్రతినాయకుల్ని తమిళం నుంచి... ఇలా సినిమాల్లోని ప్రధాన పాత్రల కోసం ఒకొక్క పాత్రధారిని ఒక్కో భాష నుంచి ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని ఓ నిర్మాత తెలిపారు. సినిమాలో అన్ని భాషలకి చెందిన నటులు కనిపిస్తే, అందరూ సొంతం చేసుకునేందుకు వీలుంటుందని వారి నమ్మకం.తారలూ రెడీ

ఇదివరకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గితేనో లేదంటే, ఎక్కువ పారితోషికం లభిస్తుందంటేనో ప్రాంతీయ భాషా చిత్రాలవైపు చూసేవాళ్లు హిందీ కథానాయికలు. ఇప్పుడు అవేవీ చూడడం లేదు. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్‌’లాంటి చిత్రాలు భాషల మధ్య హద్దులు చెరిపేశాయి. నాణ్యమైన సినిమా అయితే భాషతో సంబంధం లేకుండా ఆదరణ దక్కుతుందని ఆయా సినిమాలు నిరూపించాయి. దాంతో తారలు కథ, పాత్రలు నచ్చిందంటే సై అనేస్తున్నారు. శ్రద్ధాకపూర్, అలియాభట్‌లాంటి భామలు తెలుగులో సినిమాలు చేయడానికి కారణం అదే. ఇక కియారా అడ్వాణీ అయితే మొదట్నుంచీ తెలుగులో యేడాదికో సినిమా అయినా చేస్తానంటోంది. పూజా హెగ్డే అయితే హిందీలో వరుసగా అవకాశాలు దక్కుతున్నా తెలుగు సినిమాల్ని వదలడంలేదు. తెలుగులో ఇటీవల పాన్‌ ఇండియా సినిమాల జోరు మరింతగా పెరిగింది. దాంతో బాలీవుడ్‌ భామలు ప్రత్యేకమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. డేట్లు కుదరక చాలామంది నటించడం లేదు కానీ, లేదంటే ఇక్కడ్నుంచి వాళ్లకి అవకాశాలు చాలానే ఉన్నాయి.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.