ఏళ్లు గడుస్తున్నా క్రేజ్‌ తగ్గని కథానాయికలు

ఇలాంటి పాత్రలు ఇప్పుడు చేయగలిగేవాళ్లు ఎవరున్నారు? కథంతా మోయాలి, ఆ స్థాయి ఇప్పుడెవరికి ఉందనీ? - ఓ క్లిష్టమైన పాత్ర గురించి ప్రస్తావన వచ్చినా... నాయిక ప్రాధాన్యంతో కూడిన కథని తెరకెక్కించాలన్నా దర్శకనిర్మాతలకి ఇలా సందేహాలొచ్చేవి. సరైన కథానాయికే కనిపించేది కాదు. అందుకే అలాంటి ఆలోచనలున్నా సావిత్రి లాంటి కథానాయిక ఇప్పుడు ఎక్కడ? విజయశాంతిలా కథని మోసేవాళ్లు ఇప్పుడు ఎవరున్నారు? సౌందర్యని ఎవరిలో చూసుకోగలం? అంటూ వాటిని పక్కనపెట్టి అలవాటైన దారుల్లో వెళ్లేందుకు ప్రయత్నించేవాళ్లు. ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు దర్శకులకి అలాంటి ఆలోచన రావడమే ఆలస్యం.... ఆ పాత్రల్ని పండించడానికి, ఆ కథల్ని మోయడానికి తగిన కథానాయికలు కూడా కళ్ల ముందు కనిపిస్తున్నారు. మన కథానాయికలు అనుభవంలో పండిపోయారు. ఎలాంటి కథల్నయినా రక్తి కట్టించే స్థాయికి చేరారు. అందుకే కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు విరివిగా తెరకెక్కుతున్నాయి.

కథానాయికల వృత్తి పరమైన జీవితం చాలా చిన్నది. విజయాలు తగ్గినా, వయసు మీద పడినా ఇక వాళ్ల కెరీర్‌ ముగిసినట్టే పరిగణిస్తుంటారు. అందుకే ఐదు నుంచి పదేళ్లకి మించి నాయికలు రాణించేవాళ్లు కాదు. ఇప్పుడు ఆ వరస మారింది. హీరోలకి దీటుగా కెరీర్‌ని మలుచుకుంటున్నారు. పెళ్లయ్యాక కూడా జోరు చూపిస్తున్నారు. అనుభవాన్నంతా రంగరించి పాత్రల్ని రక్తి కట్టిస్తున్నారు. దాంతో కొత్త భామలతో సమానంగా వాళ్లకి అవకాశాలు అందుతున్నాయి. కెరీర్‌ ఆరంభించి పుష్కర కాలమైనా ఎవర్‌గ్రీన్‌ కథానాయికగా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంటారు. అలాంటివాళ్లు ఇప్పుడు తెలుగు చిత్రసీమలో చాలా మందే కనిపిస్తున్నారు.

సూపర్‌ జేజమ్మ

దక్షిణాదిలో కథానాయిక ప్రాధాన్యంతో కూడిన కథ అనగానే గుర్తుకొచ్చే కథానాయికల్లో అనుష్క ఒకరు. ఆమె చూస్తుండగానే పదిహేనేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఆ అనుభవానికి తగ్గట్టుగానే ఇప్పుడు సినిమాలు చేస్తోంది. హీరోల తరహాలోనే క్రౌడ్‌ పుల్లింగ్‌ యాక్టర్‌గా ఆమె గుర్తింపు సాధించింది. ‘సూపర్‌’తో ప్రయాణం మొదలుపెట్టిన ఆమె ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’, ‘సైజ్‌ జీరో’, ‘భాగమతి’ తదితర చిత్రాలతో సత్తా చాటింది. హీరోలకి సమానంగా మార్కెట్‌ని సంపాదించారు. ఇప్పుడు క్లిష్టమైన పాత్రలంటే మనకి జేజమ్మ ఉందిగా అంటూ అందరూ ఆమె వైపు చూస్తుంటారంటే ఆమె పరిశ్రమపై ఏ స్థాయిలో ప్రభావం చూపించారో అర్థం చేసుకోవచ్చు.

మెరుపుల మిల్కీ

అనుష్క తరహాలోనే దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతున్న మరో నాయిక తమన్నా. ‘శ్రీ’తో తెలుగులో ప్రయాణం మొదలుపెట్టిందీమె. మిల్కీ బ్యూటీగా ప్రేక్షకుల హృదయాల్లో గూడు కట్టుకుని తిష్ట వేసింది. తమన్నాని ఎప్పుడు కెరీర్‌ గురించి అడిగినా నా ప్రయాణం ఇప్పుడే మొదలైందని చెబుతుంటుంది. అందుకేనేమో ఆమె ఎప్పుడూ చేతిలో రెండు మూడు సినిమాలతో బిజీగా గడపుతుంటుంది. కమర్షియల్‌ నాయిక అంటే ఇలానే ఉండాలేమో అన్నంతగా ఆ పాత్రల్లో ఒదిగిపోతుంటుందామె. నటనకి ప్రాధాన్యమున్న పాత్రలొచ్చాయంటే వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌ని మరింత అందంగా మలచుకుంటుంది. ‘హ్యాపీడేస్‌’, ‘100 % లవ్‌’, ‘ఊసరవెల్లి’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘బాహుబలి’, ‘ఊపిరి’, ‘అభినేత్రి’, ‘ఎఫ్‌2’, ‘సైరా నరసింహారెడ్డి’... ఇలా పలు చిత్రాల్లో ఆమె గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాలతోనూ మెరిసింది. త్వరలోనే ‘దటీజ్‌ మహాలక్ష్మి’, ‘సీటీమార్‌’ చిత్రాలతో సందడి చేయబోతోంది.

 పదేళ్లుగా మాయ చేస్తోంది

తన తొలి సినిమా ‘ఏమాయ చేసావె’తోనే మాయ చేసింది సమంత. పదేళ్లుగా ఆ మాయాజాలాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తొలి సినిమాలోనే జెస్సీగా తన నటనని ప్రదర్శించింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. కమర్షియల్‌ పాత్రలకే పరిమితం అవుతోందేంటి అనే విమర్శ వినిపించేలోపే ఆమె తన అనుభవాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. బలమైన పాత్రల్ని ఎంచుకుంటూ తన విశిష్టతని ప్రదర్శించింది. ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘అఆ’, ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘యు టర్న్‌’, ‘మజిలి’, ‘జాను’... ఇలా గుర్తుండిపోయే పలు చిత్రాలు చేసి తన నటనతో అలరించింది సమంత. ఆమె అనుభవం రీత్యా ఇటీవల నటనకి ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తోంది. ‘ఓ బేబి’లో సమంత నటన ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంది. ‘ఫ్యామిలీమేన్‌2’ వెబ్‌సిరీస్‌లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలోనూ ఆమె నటించినట్టు సమాచారం. సవాళ్లతో కూడిన పాత్రలనగానే ఇప్పుడు చిత్రసీమలో గుర్తుకొచ్చే నాయికల్లో సమంత ఒకరు. ఆమె నటనలో ఆరితేరిపోయింది. పెళ్లి తర్వాతా అదే జోరుని కొనసాగిస్తూ ఎంతోమంది నాయికలకి స్ఫూర్తిగా నిలుస్తోంది.

శ్రుతి హొయలు

హిందీ చిత్రం ‘లక్‌’తో కథానాయికగా కెరీర్‌ని ఆరంభించింది శ్రుతిహాసన్‌. తెలుగులో ఆమె చేసిన తొలి చిత్రం ‘అనగనగా ఓ ధీరుడు’ ప్రేక్షకుల ముందుకొచ్చి దాదాపుగా పదేళ్లవుతోంది. ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంతో ఆమె స్టార్‌గా ఎదిగింది. అప్పట్నుంచి విజయాలతో సంబంధం లేకుండా ఆమె అవకాశాల్ని అందుకొంటోంది. అనుభవం గడించిన కథానాయికల్లో శ్రుతి కూడా ఒకరు. ఆమె కమర్షియల్‌ పాత్రల్లో చక్కగా ఒదిగిపోతుంది. గ్లామర్‌తోనే కాదు, నటనతోనూ ఆకట్టుకోగలదని పలు చిత్రాలతో నిరూపించింది. ‘సెవెన్త్‌ సెన్స్‌’, ‘రేసుగుర్రం’, ‘శ్రీమంతుడు’, ‘ప్రేమమ్‌’ చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకులకి గుర్తుండిపోతుంది. ప్రస్తుతం రవితేజతో కలిసి ‘క్రాక్‌’ సినిమాలో నటిస్తోంది.


ర+కూల్‌ కెరీర్‌

కన్నడ చిత్రం ‘గిల్లీ’తో 2009లో రకుల్‌ ప్రయాణం మొదలైంది. ఆ లెక్కన ఆమె కెరీర్‌కి పదేళ్లు పూర్తయ్యాయి. తెలుగులో ‘కెరటం’ ఆమె తొలి చిత్రం. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తొలి విజయాన్ని అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్‌ అనిపించుకుంది. ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘జయ జానకి నాయక’ తదితర చిత్రాలతో ఆమె ఆకట్టుకుంది. తెలుగులో స్టార్‌ హీరోల సినిమా కోసం నాయిక ఎంపిక అనగానే రకుల్‌ పేరు తప్పక ప్రస్తావనకొస్తుంటుంది. ఆమె ప్రస్తుతం నితిన్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. కమర్షియల్‌ నాయికగా అనుభవాన్ని మూటగట్టుకుని కెరీర్‌ని కొనసాగిస్తోంది రకుల్‌.

వన్నె తరగని చందమామ

కాజల్‌ ప్రయాణం మొదలై 13 ఏళ్లయింది. ‘లక్ష్మీకళ్యాణం’, ‘చందమామ’ చిత్రాలతో ప్రభావం చూపించడం మొదలుపెట్టిన ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఎక్కువగా వాణిజ్య ప్రధానమైన చిత్రాల్లోనే నటించింది. హీరోల పక్కన ఆడిపాడుతూనే తన ప్రత్యేకతని చాటుతూ వచ్చింది. కమర్షియల్‌ పాత్రలు చేస్తూ కెరీర్‌ని ఇంత సుదీర్ఘకాలంగా సాగించడం అరుదైన విషయం. ‘చందమామ’లో మహాలక్ష్మి, ‘మగధీర’లో మిత్ర వింద పాత్రలు మొదలుకుని మొన్నటి ‘నేనే రాజు నేనే మంత్రి’ వరకు పలు చిత్రాల్లో మంచి నటనని ప్రదర్శించింది. ఆమె అనుభవం ఇటీవల కాలంలో ఆమెకి నాయికా ప్రధాన చిత్రాల్ని చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ‘ప్యారిస్‌ ప్యారిస్‌’తో పాటు ‘అ’ సినిమాలోనూ ఆమె బలమైన పాత్రల్ని చేసింది. అందుకే ఇప్పుడు కూడా ఆమె జోరు తగ్గలేదు. పలు భాషల్లో ఐదు సినిమాలు చేస్తోంది.

వీళ్లూ ఉన్నారు

శ్రియ, ప్రియమణి, నిత్యమేనన్‌.. ఈ పేర్లు చూస్తే అనుభవం రాశిపోసినట్టే అనిపిస్తుంది. బలమైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చిన ప్రతిసారీ సత్తా చాటుతుంటారు ఈ కథానాయికలు. అందుకే ఇప్పటికీ అవకాశాలు అందుకుంటున్నారు. ‘ఇష్టం’తో మొదలైన శ్రియ ప్రయాణం 20 ఏళ్లకు చేరువవుతోంది. ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలెన్నో ఉన్నాయి. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. పెళ్లి తర్వాత కూడా ఆమె కెరీర్‌ని విజయవంతంగా కొనసాగిస్తోంది. మరో కథానాయిక ప్రియమణి కూడా అంతే. ఆమె 17 ఏళ్లుగా తెలుగు చిత్రసీమలో కొనసాగుతోంది. ప్రస్తుతం ‘విరాటపర్వం’తోపాటు ‘నారప్ప’లో నటిస్తోంది. నిత్యమేనన్‌ తెలుగు సినిమా ప్రయాణం ‘అలా మొదలైంది’తో ఆరంభమైంది. ‘ఇష్క్‌’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘ఓకే బంగారం’, ‘24’, ‘అ’, ‘రుద్రమదేవి’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మురిపించింది. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాల్లో నటించేందుకు అంగీకారం తెలిపింది. వీళ్లతోపాటు కీర్తిసురేష్, నివేదా థామస్, సాయి పల్లవి తదితర భామలు కూడా నటన పరంగా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. సినిమా సినిమాకీ అనుభవాన్ని గడిస్తూ తమ ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నయనతార, త్రిష కూడా చిత్రసీమలో ఎంతో అనుభవం గడించారు. ఈ భామలు కూడా అప్పుడప్పుడు తెలుగు తెరపై మెరుస్తూ సందడి చేస్తుంటారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.