కరోనా కొట్టిన దెబ్బ చిత్రసీమను గట్టిగానే తాకింది. ఎన్నో వినోదాలతో ఈ ఏడాది సాగుతుందని ఊహించిన ప్రేక్షకుడికి నిరాశే మిగిలింది. ప్రేక్షకుల్ని అలరించలేకపోయాం అనే బాధ తారల్లోనూ కనిపిస్తోంది. అన్నింటిని మరిచి ఇప్పుడిప్పుడే చిత్రసీమ గాడిలో పడుతోంది. థియేటర్లు తెరచుకోవడానికి అనుమతులు వచ్చినా సరైన సినిమాలు లేకపోవడంతో చాలా చోట్ల థియేటర్లు తెరవలేదు. ఈ ఏడాది కోల్పోయిన వినోదాల్ని వచ్చే ఏడాదిలోనైనా పొందాలని ప్రేక్షకులు, రెట్టింపు ఎంటర్టైన్ చేయాలని తారలు ఎదురుచూస్తున్నారు. పలు కొత్త తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దీంతో పాటు పలు కొత్త జంటలు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జంటల్లో అగ్రతారలూ ఉన్నారు. యువతరం నటులు అలరించబోతున్నారు. వాటిల్లో అటు చిత్ర సీమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేపుతున్న జంటల గురించి ఓసారి చదివేద్దాం.

* జాన్వీకపూర్, రాజ్‌కుమార్‌రావ్ కొత్త తరహా కథల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి తొలిసారి నటించిన చిత్రం ‘రూహీ అఫ్జా’. కామెడీ హర్రర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడంతో విడుదల వచ్చే ఏడాది సెప్టెంబరుకు మారింది. హార్థిక్ మెహతా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ రెండు భిన్న పార్శ్వాలున్న పాత్రల్లో కనిపించనుంది. జాన్వీ కపూర్, కార్తిక్ ఆర్యన్ తొలిసారి సందడి చేయనున్న చిత్రం ‘దోస్తానా 2’. కొలిన్ డి కున్హా దర్శకత్వంలో కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
* ‘భరత్ అనే నేను’తో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన కియారాకు బాలీవుడ్లో అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న చిత్రాలన్నింటిలోనూ నటిస్తున్న హీరోలందరూ ఆమెతో తొలిసారి నటిస్తున్నవారే. అందులో అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన ‘లక్ష్మీ’ ఈ నెల 9న విడుదల కానుంది. ‘భూల్ భులయ్యా 2’ చిత్రంతో కార్తిక్ ఆర్యన్‌తో తొలిసారి ఆడిపాడనుంది కియారా. కామెడీ హర్రర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనీష్ భజ్మీ దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాది వచ్చే అవకాశాలు కనపడటం లేదు. సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి కియారా నటిస్తున్న చిత్రం ‘షేర్షా’. ఆర్మీ కెప్టెన్, కార్గిల్ వీరుడు విక్రమ్ భత్రా జీవిత కథతో వస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. విష్ణువర్థన్ దర్శకుడు. కొంత కాలంగా సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా మధ్య ప్రేమాయణం సాగుతుందంటూ బాలీవుడ్లో వార్తలు వస్తూనే ఉన్నాయి.

* వరుణ్‌ధావన్, సారా అలీఖాన్ తొలిసారి వెండితెరపై జంటగా కనిపించనున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం ‘కూలీ నెం.1’. 1995లో ఇదే పేరుతో వచ్చిన చిత్రానికి రీమేక్ ఇది. డేవిడ్ ధావన్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబరు 25న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కానుంది.
* ‘బాహుబలి’ ‘సాహో’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు ప్రభాస్. ఇప్పుడు ఆయనతో వైజయంతీ మూవీస్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ‘మహానటి’తో సత్తా చాటిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తోంది. ప్రభాస్ 21వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ హిందీలోనూ విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటించారు.

* ‘బ్రహ్మాస్త్ర’ లాంటి భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంతో తొలిసారి తెరపై జంటగా కనిపించనున్నారు రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తిరిగి త్వరలోనే మొదలుకానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ‘షమ్ షేరా’ చిత్రంలో రణ్‌బీర్, వాణీ కపూర్ జంట తొలిసారి మెరవబోతుంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కరణ్ మల్హోత్ర దర్శకుడు. ఈ చిత్రంలో రణ్‌బీర్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఇటీవలే ఆయన డబ్బింగ్‌ని కూడా పూర్తి చేశారు. ఇందులో వాణీ కపూర్ ఓ నర్తకిగా కనిపించనుంది.

* అర్జున్‌రెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నాయిక షాలినీ పాండే. ఆమె రణ్వీర్ కపూర్ సరసన నటిస్తున్న తొలి చిత్రం ‘జయేష్భాయి జోర్దార్’. మహిళల హక్కుల కోసం పోరాటం చేసే ఓ గుజరాతీ యువకుడి పాత్రలో రణ్వీర్ నటిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబరు 2న విడుదల కావాల్సి ఉన్నా కరోనా ప్రభావంతో ఆగిపోయింది. కొత్త విడుదల తేదీని చిత్రబృందం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. దివ్యాంగ్ టక్కర్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు.