వీరి చూపు.. కుటుంబ కథల వైపు
అనగనగా ఓ ఇల్లు. అందులో అమ్మా.. నాన్న.. ఇద్దరు పిల్లలు. - ఇలా కథ మొదలెడితే ఎంత బాగుంటుంది? ప్రతి ఒక్కరిలోనూ ఓ ‘ఫ్యామిలీ (వు)మెన్‌’ ఉంటారు. ఇలాంటి కథలు చెబుతున్నప్పుడు ఇట్టే లీనమైపోతారు. తమలో ఉన్న అమ్మో, నాన్నో, బాబాయో, అత్తమ్మో.. బయటకు వస్తారు. తమకు తెలిసిన పెదనాన్నో, మావయ్యో తెరపై తారస పడతారు. భావోద్వేగాల్ని సరిగా మేళవించగలిగితే ఇక అలాంటి చిత్రాలకు తిరుగుండదు. అందుకే కుటుంబ కథలు తెలుగు తెరపై వెల్లువలా వస్తుంటాయి. ఈ సీజన్‌లో ఆ తాకిడి కాస్త ఎక్కువగానే ఉండబోతోంది. మాస్‌, కమర్షియల్‌ చిత్రాలకు కాస్త బ్రేక్‌ ఇవ్వాలనుకున్న హీరోలు, హీరోయిన్లు ఈ తరహా చిత్రాలపై మొగ్గు చూపిస్తున్నారు.


విజయవంతమైన చిత్రాలకంటూ ఓ ఫార్ములా ఉండదు. ప్రేక్షకులు ఎప్పుడు ఏ కథకు పట్టం కడతారో, ఎప్పుడు ఏ చిత్రాన్ని తిరస్కరిస్తారో ఎవ్వరూ ఊహించలేరు. ఒక్కో సీజన్‌లో ఒక్కో తరహా కథలు ప్రేక్షకుల ముందుకొచ్చినా, దర్శక నిర్మాతలు ట్రెండ్‌కు పెద్ద పీట వేసినా - కొన్నింటికే హిట్టు కళ అబ్బుతుంది. అయితే కుటుంబ కథా చిత్రాలకు మాత్రం ఓ వెసులుబాటు ఉంటుంది. ఏ ట్రెండ్‌ నడుస్తున్నా, ఎలాంటి ఫార్ములాలు గారడీ చేస్తున్నా - ‘ఫ్యామిలీ’ టచ్‌ ఉన్న కథలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. పైగా అది ఎవర్‌ గ్రీన్‌ ఫార్ములా. అందుకే కథానాయకులు కుటుంబ కథలవైపు మొగ్గు చూపిస్తుంటారు. బంధాలూ, అనుబంధాలు పెనవేసుకున్న కథలు చేస్తే - అభిమాన గణాన్ని పెంచుకోవచ్చని, వసూళ్లకు ఢోకా ఉండదని నమ్మకం. అందుకే టాలీవుడ్‌కెప్పుడూ ఇలాంటి కథలకు కొదవ ఉండదు. అయితే ఈమధ్య కాన్సెప్ట్‌ కథలు, హారర్‌ సినిమాలు, యాక్షన్‌ డ్రామాలూ, థ్రిల్లర్లు ఎక్కువఅయ్యాయి. సందేశానికి వాణిజ్య సూత్రాల్ని మేళవించి చెప్పడం నేర్చుకున్నారు. వాటి మధ్య కుటుంబ కథలు ఎవ్వరికీ పట్టడం లేదు. ఈసారి మాత్రం ఆ కొరత కొంత వరకూ తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అగ్ర కథానాయకులతో పాటు యువ హీరోలూ కుటుంబ కథలపై దృష్టి సారించారు. దాంతో వెండి తెరకు కొత్త శోభ రాబోతున్నట్టు అనిపిస్తోంది.

* అగ్ర హీరోలు నాగార్జున, వెంకటేష్‌ ఎప్పుడూ కుటుంబ కథలకు అగ్రతాంబూలం ఇస్తుంటారు. వీళ్ల అభిమానుల్లోనూ కుటుంబ ప్రేక్షకులే ఎక్కువ. ‘ఎఫ్‌ 2’తో వాళ్లందరినీ అలరించిన వెంకీ... ఇప్పుడు ‘వెంకీ మామ’ అయిపోయారు. నాగచైతన్యతో కలసి నటిస్తున్న చిత్రమిది. ఇద్దరూ నిజ జీవితంలో మామా అల్లుళ్లే. తెరపైనా అవే పాత్రలు పోషిస్తున్నారు. టైటిల్‌ చూస్తుంటే ఇదో కుటుంబ కథాచిత్రమని ఇట్టే అర్థమైపోతోంది. మరి వెంకీ మామ, చైతూ అల్లుడు కలసి ఎంత సందడి చేస్తారో తెరపైనే చూడాలి. నాగార్జున ‘మన్మథుడు 2’లోనూ కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలుంటాయి. ఫ్రేము నిండా నటీనటులే కనిపించే చిత్రాల్లో ఇదొకటి. అయితే దాంతో పాటు నాగ్‌ నుంచి ఆశించే రొమాన్స్‌ కూడా ఎక్కువ పాళ్లలోనే ఉండబోతోంది. అయితే ఆ తరవాత నాగ్‌ చేయబోయే ‘బంగార్రాజు’ మాత్రం నూటికి నూరుశాతం కుటుంబ కథా చిత్రమే. ఇందులోనూ చైతూ కనిపించబోతున్నాడు. సాయిధరమ్‌ తేజ్‌ కూడా ఇప్పుడు కుటుంబ కథల బాట పట్టాడు. దర్శకుడు మారుతితో కలసి చేస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ ఈ జోనర్‌ కథే. ‘‘డబ్బు సంపాదన మీద ధ్యాస ఎక్కువై... యాంత్రికంగా బతికేస్తున్నాం. ప్రేమ, పెద్దలమీద గౌరవం కూడా కలుషితమైపోయింది. మనిషి కంటే యంత్రాలకే ఎక్కువ విలువ ఇస్తున్నాం. వాటి మధ్య ఏం కోల్పోతున్నామో చెప్పే సినిమా ఇది. తండ్రి, కొడుకు, మనవడి మధ్య అనుబంధాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాం’’ అన్నారు మారుతి. మాస్‌ కథలు చేస్తున్న కల్యాణ్‌ రామ్‌ ఇప్పుడు వాటికి కాస్త బ్రేక్‌ ఇచ్చారు. ఆయన కూడా కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కల్యాణ్‌రామ్‌ - సతీష్‌ వేగేశ్నల కలయికలో ఓ చిత్రం ఇటీవలే పట్టాలెక్కింది. ‘శతమానంభవతి’తో కుటుంబ ప్రేక్షకుల పల్స్‌ పట్టుకున్న సతీష్‌ ఈసారి కల్యాణ్‌రామ్‌ కోసం అలాంటికథే రాసుకున్నారట.

* కీర్తి సురేష్‌ కథానాయికగా ఈస్ట్‌కోస్ట్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. నరేంద్రనాథ్‌ దర్శకుడు. ఇది కూడా ఫ్యామిలీ డ్రామానే. ‘‘ఓ అమ్మాయి జీవితంలోని వివిధ దశల్ని ఆవిష్కరించే చిత్రమిది. కుటుంబ బంధాలకు పెద్దపీట వేశాం. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలంటే మనకు హారర్‌, థ్రిల్లర్‌ చిత్రాలే గుర్తొస్తాయి. అయితే వాటికి భిన్నమైన ప్రయత్నం చేస్తున్నాం’’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.

*
సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన ‘ఓ బేబీ’ ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకొంది. ఈ చిత్రం కూడా అనుబంధాల పొదరిల్లే. 70 ఏళ్ల బామ్మ అనుకోకుండా పాతికేళ్ల పడుచుగా మారిన కథ. ఆసక్తికరంగా మలిచారు. ‘‘మన దేశం ఆధునికతవైపు ఎంత పరుగులు పెడుతున్నా మూలాల్ని మర్చిపోలేదు. మర్చిపోకూడదు కూడా. పెద్దవాళ్లని వృద్ధాశ్రమాలలో విడిచిపెట్టే అలవాటు విదేశాల్లో ఉంది. అది అక్కడ తప్పు కాదు. ఇక్కడ మాత్రం ఆ ఆలోచన వస్తేనే తప్పు చేసినట్టు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాలు, వాళ్ల మధ్య గౌరవాలూ అలానే ఉన్నాయి. వాటి విలువెంతో ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు నందినిరెడ్డి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.