ఇక్కడ కూడా అదే పోటీ!

శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీసుకు పండగే పండగ. ఎంతలేదన్నా వారానికో కొత్త చిత్రమైనా థియేటర్‌లో సందడి చేసేది. ఒక్కోసారి నాలుగైదు సినిమాలు, ఒక్కోసారి అగ్ర కథానాయకుల చిత్రాలూ పోటీ పడుతుండేవి. ఇప్పుడు కరోనా దెబ్బకు థియేటర్లు మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు ప్రేక్షకులతో కళకళలాడతాయో చెప్పలేని పరిస్థితి. ఈ తరుణంలో దర్శకనిర్మాతలకు కాస్తకూస్తో ఓదార్పు ఓటీటీలు. ఇప్పుడు చిన్న చిత్రాల నుంచి స్టార్‌ల సినిమాలు వరకూ వాటిలోనే విడుదలవుతున్నాయి. దీంతో ఓటీటీ ఛానెళ్లు ఎగబడి మరీ సినిమాలను కొంటున్నాయి. ముందుగానే విడుదల తేదీలు ప్రకటిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేలా ట్రైలర్‌లను విడుదల చేస్తున్నాయి. ఇప్పటివరకూ థియేటర్లో విడుదలయ్యే చిత్రాల మధ్యే పోటీ ఉండేది. ఇప్పుడు ఓటీటీల్లోనూ ఒకేరోజు నాలుగైదు చిత్రాలు విడుదలఅవుతున్నాయి. దీంతో పోటీ నెలకొంది. ఈ నెల ఆఖరి శుక్రవారం జులై 31న నాలుగు బాలీవుడ్‌ చిత్రాలు నాలుగు వేర్వేరు ఓటీటీ వేదికల్లో విడుదల కానున్నాయి. ఇలా జరగడం ఇదే తొలిసారి.


బయోపిక్కుల్లో అవలీలగా నటించగల ప్రతిభ విద్యాబాలన్‌ది. దేశం గర్వించే గణిత శాస్త్రవేత్త, హ్యుమన్‌ కంప్యూటర్‌గా పేరుగాంచిన శకుంతలాదేవి జీవిత కథతో వస్తోన్న ‘శకుంతలా దేవి’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నెల 31న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం రానుంది.




విద్యుత్‌ జమ్వాల్, శ్రుతిహాసన్ విజయ్‌వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యారా’. తిగ్మన్షు దులియా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఫ్రెంచ్‌ చిత్రం ‘ఎ గ్యాంగ్‌ స్టోరీ’కి రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు జీ5లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. నలుగురు స్నేహితుల కథగా నేపాల్‌ - ఇండియా సరిహద్దు ప్రాంతాల్లో నడిచే చిత్రమిది. ఇదీ శుక్రవారమే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.


ఓ రాజకీయ హత్య నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రాత్‌ అఖేలీ హై’. నవాజుద్దీన్‌ సిద్దిఖీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేలా ఉందంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఈ సినిమా కూడా 31నే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవనుంది.




నిండా డబ్బుతో ఉన్న ఓ సూట్‌కేస్‌ నేపథ్యంగా సాగే కథతో సాగే వినోద్మాక చిత్రం ‘లూట్‌కేస్‌’. కునాల్‌ ఖీము కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని రాజేష్‌ కృష్ణన్‌ తెరకెక్కించారు. ఇది డిస్నీ హాట్‌స్టార్‌లో 31న ప్రేక్షకుల ముందుకురానుంది.




ప్రేక్షకులు తమకు నచ్చిన చిత్రాన్ని చూసే అవకాశంతో పాటు వీలైన సమయంలో చూసే వెసులుబాటు ఓటీటీల ద్వారా కలిగింది. ‘‘ఇదంతా బాగానే ఉంది. కానీ ఎంతమంది ఇన్ని ఓటీటీలకు సబ్‌స్రైబ్‌ చేసి అన్ని సినిమాలు చూస్తారు. ఎంతమందికి ఆ అవకాశం ఉంటుందో చెప్పలేం’’అంటున్నారు ఓ బాలీవుడ్‌ రచయిత. ఈ నెలాఖరున ఓటీటీ యుద్ధానికి విద్యాబాలన్, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, విద్యుత్‌ జమ్వాల్, కునాల్‌ ఖీము సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాలన్నీ ఒకేరోజు విడుదల కావడం చూస్తుంటే వసూళ్ల హంగామా గుర్తుకురాక మానదు. థియేటర్లో ఒకేసారి విడుదలయ్యే సినిమాల వసూళ్ల గురించి ఆసక్తి ఉండేది. కానీ ఓటీటీలో విడుదలయ్యే చిత్రాల విషయంలో ఇది మరో రూపం సంతరించుకోనుంది. ఏ సినిమాను ఎంత మంది చూశారనేది ప్రాతిపదికగా పోటీ ఉండనుంది. ఇదో కొత్త రకమైన పోటీ అంటున్నారు సినీ విశ్లేషకులు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.