చరిత్ర పుటలు తిరగేస్తున్న చిత్రసీమ
చిత్రసీమ దృష్టి ఎప్పుడూ కొత్త కథలపైనే. ప్రేక్షకుడికి సరికొత్త వినోదాలను అందిస్తేనే తమ సినిమాలకి ఆదరణ లభిస్తుందన్నది దర్శకనిర్మాతలు నమ్మే మూల సూత్రం. అందుకోసం ఆధునికత ఉట్టిపడే కథాంశాల్ని ఎంచుకొని కసరత్తులు చేస్తుంటారు. అలాంటి కథలు పొరుగు భాషల్లో కనిపించినా సరే వాటిని వెంటనే కొనేసి రీమేక్‌గా తెరకెక్కిస్తుంటారు. అయితే సరికొత్తగా వినోదం పంచడానికి కొత్త కథలే అవసరం లేదని, పాత కథల్ని కూడా కొత్తగా చెప్పి మెప్పించొచ్చని మన దర్శకులు నిరూపిస్తున్నారు. వర్తమానం, భవిష్యత్తు నుంచే కాకుండా... గతం నుంచీ కొత్తగా కథలు వండుతున్నారు. నిన్నటి కథలతో రూపు దిద్దుకొంటున్న చిత్రాలు ప్రస్తుతం సెట్స్‌పై చాలానే కనిపిస్తున్నాయి.


పురాణాలు వల్లించడం, చరిత్ర తిరగేయడం తెలుగు చిత్రసీమకి కొత్తేమీ కాదు. తొలినాళ్లలో సినిమాలకి కథా వస్తువులు మన పురాణాలే. ఆ తర్వాత చరిత్ర పని పట్టారు. రాజులు, రాజ్యాల కథలతో సినిమాలు చేశారు. క్రమంగా సినిమా కథ వర్తమానానికి అద్దం పట్టింది. నవతరం ప్రేక్షకుడిని మెప్పించాలంటే నేటి కథలు చెప్పాల్సిందే అనే పరిస్థితి వచ్చింది. దాంతో కథలు క్రమంగా మూస బాట పట్టాయి. ఇక తెరపైకి కొత్త కథలు రావా? మన దగ్గర కొత్త కథలు లేవా? అనే చర్చ జరిగిన ప్రతిసారీ దర్శకులు గతంలోకి తొంగి చూశారు. పాత కథల్ని కొత్తగా చెప్పి విజయాల్ని అందుకున్నారు. ‘అన్నమయ్య’, ‘శ్రీరామరాజ్యం’, ‘శ్రీరామదాసు’, ‘రాజన్న’, ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘రుద్రమదేవి’, ‘ఘాజీ’ తదితర చిత్రాలు ఆ కోవకి చెందినవే. ‘బాహుబలి’, ‘రంగస్థలం’ చిత్రాల తర్వాత దర్శకులు గతాన్ని చూసే కోణం మారిపోయింది. చారిత్రక గాథల్ని ఆధునిక సాంకేతిక హంగులతో భారీస్థాయిలో తీయడం... రెండు మూడు దశాబ్దాల కిందటి కథల్ని ఎంచుకొంటే... ఆ వాతావరణాన్ని పక్కాగా తెరపై ఆవిష్కరించి అందులోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లడం ఇప్పుడొక ట్రెండ్‌గా మారిపోయింది.


చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చారిత్రక గాథతో తెరకెక్కుతోంది. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ, బ్రిటిష్‌ కాలం నాటి వాతావరణాన్ని కళ్లకి కడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజువల్‌ ఎఫెక్ట్స్‌తో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిరు తనయుడు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కూడా చారిత్రక అంశాలతో ముడిపడిన కథతో తెరకెక్కుతున్నదే. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్‌, చరణ్‌ నటిస్తున్నారు. కథానాయకుడు రానా ‘హిరణ్యకశ్యప’ పేరుతో పురాణాన్ని వల్లెవేయబోతున్నారు. రూ.200 కోట్ల వ్యయంతో గుణశేఖర్‌ తెరకెక్కించనున్నారు. రానా కథా నాయకుడిగా తెరకెక్కబోతున్న ‘విరాటపర్వం’ కూడా గతాన్ని గుర్తు చేసేదే. ఎమర్జన్సీ కాలం నాటి కథతో వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న చిత్రమిది.


ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమకథ కూడా కొన్ని దశాబ్దాల కిందటి కథతో తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఆ సినిమాకి ‘జాన్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. రాజశేఖర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘కల్కి’ 1980ల నాటి కథతో తెరకెక్కింది. యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నవతరం దర్శకులు కూడా చారిత్రక కథలపై ఉత్సాహం ప్రదర్శిస్తుండడం విశేషం. అందుకోసం పరిశోధనలు చేయడానికీ వెనకాడటం లేదు. ఇదివరకు తెలుగు సినిమాల్లో గతం అంటే ఫ్లాష్‌బ్యాకే. అప్పట్లో ఇలా జరిగిందంటూ కొన్ని సన్నివేశాల్లో పాత కథని చెప్పేవారు. కానీ ఇప్పుడు సినిమా కథ మొత్తం గతం చుట్టూనే తిరుగుతోంది. నడిచొచ్చిన దారిని, మరిచిపోయిన రోజుల్ని మరోసారి గుర్తు చేస్తూ ప్రేక్షకులకూ కొత్త అనుభూతి పంచుతున్నారు. శుక్రవారం విడుదలైన ‘మల్లేశం’ కథ కూడా నిన్నటి తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.