నా జీవితంలో తీరని కోరికలు చాలా ఉన్నాయి!
పాప్‌ పాటల్లో ఉన్న ధీమా.. పాపులర్‌ పాటల చిరునామా.. రీమిక్స్‌ పాటలంటే గుర్తుకొచ్చే భామ.. సింగర్‌ స్మిత. ‘హాయ్‌రబ్బా’ అంటూ పలకరించి.. ‘మసక మసక’ అంటూ యువతను మైమరపించి, ‘కిలికి’ భాషతో కవ్వించి శ్రోతల హృదయాలను కొల్లగొట్టిన ఆమె.. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులను పంచుకున్నారిలా..‘హాయ్‌రబ్బా’ స్మిత.. ఈ పాట ఎప్పుడు రిలీజ్‌ అయింది?
స్మిత: 1999 డిసెంబరు 25న ఎంటీవీలో మొదటిసారి ప్రసారం చేశారు. ఒక తెలుగమ్మాయి అందునా విజయవాడ అమ్మాయి పాడిన మ్యూజిక్‌ వీడియో.. నేషనల్‌ ఛానల్‌లో ప్రసారం కావడం నిజంగా సంతోషంగా అనిపించింది. ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను.


అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? ఆరేడేళ్లు ఉంటాయా?
స్మిత: (నవ్వులు) అంత ఏజ్‌ ఉంటే బాగుండేది. నా మ్యూజిక్‌ జర్నీ అనేది ఈటీవీతోనే ప్రారంభించాను. నేను ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ఉండగా, ‘పాడుతా తీయగా’లో పాడాను. అప్పుడు నాకు 15ఏళ్లు. మా సొంతూరు విజయవాడ అయినా, నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. అందుకే నాకు రెండు ప్రాంతాలతో అనుబంధం ఎక్కువ.

మీరు ఎందుకు సింగర్‌ కావాలని అనుకున్నారు?
స్మిత: నేను సింగర్‌ కావాలని అస్సలు అనుకోలేదు. నాకు తెలియకుండా మా అమ్మ సీక్రెట్‌గా నేను పాడిన పాటల టేప్‌ను ‘పాడుతా తీయగా’కు పంపారు. అమ్మ పాటలు బాగా పాడతారు. బహుశా తాను ఏమవ్వాలనుకున్నారో ఆ కలను నా ద్వారా నెరవేర్చుకుందామనుకున్నారేమో. చిన్నప్పుడు సరదాగా కూర్చొని పాటలు పాడుకునేవాళ్లం. అలా మూడో ఏట స్కూల్లో స్టేజ్‌పై పాడా. అలా 15ఏళ్లకే ‘హాయ్‌రబ్బా’ చేశా. అందులో నాతో పాటు చేసిన వాళ్లు మంచి పొజిషన్స్‌లో ఉన్నారు. ఒకామె బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రెమోను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు చూస్తే తనని అస్సలు గుర్తు పట్టరు. ‘మసక మసక’లో ముమైత్‌ఖాన్‌ కనిపిస్తుంది. కానీ, ఎవరూ గుర్తు పట్టలేరు.

స్మిత అసలు పేరా? లేక స్క్రీన్‌ కోసం పెట్టుకున్నారా?
స్మిత: నా అసలు పేరు స్మితనే. smita ‘H’ కూడా ఉండదు. ఎందుకంటే అమ్మ చదువంతా దిల్లీలోనే సాగింది. అమ్మమ్మ తేళ్ల లక్ష్మీకాంతమ్మ 20ఏళ్ల పాటు పార్లమెంట్‌లో చేశారు. దాదాపు 30ఏళ్లు రాజకీయాల్లో ఉన్నారు. దాంతో నార్త్‌ ఇండియాలో అందరూ స్మితను ‘హెచ్‌’ లేకుండా పలుకుతారు. కానీ, దక్షిణాదికి వచ్చేసరికి నా పేరులో హెచ్‌ యాడ్‌ చేశారు. దీని గురించి ప్రతి ఒక్కరికీ చెబుతూనే ఉంటా.

ఈ ఏజ్‌లో కూడా కాలేజ్‌కు వెళ్లి చదువుకుంటున్నారట!
స్మిత: నా కెరీర్‌ 15ఏళ్లకే ప్రారంభమైపోయింది. మంచి బిజినెస్‌ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ చేయడం నా కల. అప్పుడు నెరవేరలేదు. అయితే, అది 18ఏళ్ల వయసులో చేశామా? లేక 30ఏళ్ల వయసులో చేశామా? అన్నది లెక్క కాదు. నా జీవితంలో తీరని కోరికలు చాలా ఉన్నాయి. మున్ముందు చాలా చూస్తారు. కొంతకాలం పోతే, నేనూ మా అమ్మాయి ఒకే కాలేజ్‌కి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే కలిసి పాట పాడాం. అది కూడా జరగవచ్చు.

మీది విజయవాడ కదా! మరి హైదరాబాద్‌లో ఎందుకు సెటిల్‌ అయ్యారు?
స్మిత: నేను మ్యూజిక్‌ కెరీర్‌ ప్రారంభించిన సమయంలో ఏది చేయాలన్నా చెన్నైలో సౌకర్యాలు ఉండేవి. ఆ తర్వాత నెమ్మదిగా హైదరాబాద్‌లోనూ అన్ని చేయడం మొదలు పెట్టారు. అలా ఇక్కడ సెటిల్‌ అయ్యాం.

సాధారణంగా సింగర్లు అవకాశాల కోసం వెతుకుతారు. మీరేంటి ‘అవకాశాలే నా దగ్గరకు రావాలి’ అనుకున్నారట!
స్మిత: నా అదృష్టం ఏంటంటే ఇప్పటివరకూ నాకు నచ్చినట్లుగా నేను బతికా. అలా కుదిరిపోయింది. నాలుగైదు తరాల నుంచి మా కుటుంబంలో మహిళలు శక్తిమంతంగా ఉన్నారు. నాకు కూడా అదే అలవాటైంది. ఎప్పుడూ ఊరికే కూర్చోలేదు. ఏదో ఒకటి చేయాలని ఉండేది. 15ఏళ్లకే పాటలు పాడటం ప్రారంభించిన నేను, 24ఏళ్లకు ‘బబుల్స్‌’ సెలూన్ పెట్టి వ్యాపారం చేయడం మొదలు పెట్టా. ఇప్పుడు 13 బ్రాంచ్‌లు ఉన్నాయి. ‘హాయ్‌ రబ్బా’ చేసినప్పుడు క్యాసెట్స్‌ ఉండేవి. అప్పట్లో లక్షల్లో క్యాసెట్స్‌ అమ్మేవాళ్లం. ఆ తర్వాత ‘కోయిలమ్మ’ వచ్చినప్పుడు కూడా క్యాసెట్స్‌లోనే ఉండేది. ‘మసక మసక’ పాడే సమయానికి 50శాతం క్యాసెట్స్‌, ఇంకో 50శాతం సీడీల్లో ప్రింట్‌ చేసేవారు. ‘సన్నజాజి’ పాట వచ్చేసరికి, 80శాతం సీడీలు, 20శాతం క్యాసెట్స్‌ ఉన్నాయి. ఆ తర్వాత నుంచి అలా అలా క్యాసెట్స్‌ తగ్గిపోయాయి. అంతా ఆన్‌లైన్‌, పైరసీ అయిపోయింది. అప్పట్లో ఒక ప్రైవేట్‌ ఆల్బమ్‌ రైట్స్‌ కోసం రూ.70-80లక్షలకు విక్రయించామంటే నమ్ముతారా? పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కూడా అంత క్రేజ్‌ ఉండేది కాదు. మ్యూజిక్‌ చార్ట్‌ల్లో ‘మసక మసక’ ఏడాది పాటు టాప్‌లో ఉంది.


‘స్మితకు తల పొగరు.. అహంభావి’ అంటుంటారు! ఎంతవరకూ నిజం?
స్మిత: నాకు బాగా తెలిసిన వారైతే అలా అస్సలు అనుకోరు. కానీ, నన్ను అనవసరంగా ఇబ్బంది పెడితే మాత్రం ఎక్కడ లేని తిక్క వస్తుంది. ఎవరికైనా వాళ్ల ఏజ్‌ను బట్టి కాకుండా, ప్రవర్తన బట్టి గౌరవం ఇస్తాం. అందరితో నేను చాలా గౌరవంగా ఉంటా. ‘నాకు అవకాశం ఇవ్వండి’ అని అడగక పోవడం మీ ఉద్దేశంలో నాకు తల పొగరు అని మీకు అనిపిస్తే సరే! ఇక్కడ ఎవరికీ ఎవరూ తక్కువా కాదు.. ఎక్కువా కాదు. పరిస్థితిని బట్టి నేను మారుతుంటా.


స్కూల్లో మీకు మెనూ కార్డు ఇచ్చి అవి తీసుకురా.. ఇవి తీసుకురా.. అనేవారట!
స్మిత: నేను వంటలు బాగా చేసేదాన్ని. నాతో పాటు నా ఫ్రెండ్స్‌ కూడా మా ఇంట్లో ఎక్కువగా ఉండేవారు. అర్ధరాత్రి ఆకలి వేస్తే వంటింట్లోకి వెళ్లి ఏది కావాలనుకుంటే అది చేసుకుని తినేదాన్ని. అలా నా ఫ్రెండ్స్‌ ‘చాక్లెట్‌ కేక్‌ కావాలి’, ‘ప్రైడ్‌రైస్‌ కావాలి’అని అడుగుతుండేవారు. దాంతో అవన్నీ చేసి వాళ్ల కోసం తీసుకెళ్లేదాన్ని. అది ఏ స్థాయిలోకి వెళ్లిందంటే, వడియాలు, పచ్చళ్లు, పిండి వంటలు చేసేదాకా వెళ్లింది.

మీరు కొత్త పాటలు పాడకుండా.. పాత వాటిని రీమిక్స్‌ చేయడంలో అర్థం ఏంటి?
స్మిత: నిజం చెప్పాలంటే ‘మసక మసక’ పాట రీమిక్స్‌ చేయాలన్న ఆలోచన అమ్మది. ఆ పాట వచ్చినప్పుడు నేను పుట్టలేదు. ‘హాయ్‌రబ్బా’ మొదట హిందీలో చేశా. అయితే, ఆంధ్రప్రదేశ్‌ వరకూ రైట్స్‌ మా దగ్గరే ఉంచుకున్నాం. అప్పుడే ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చింది. ‘మీరు తెలుగువారు అయి ఉండి, హిందీలో పాట పాడారు. మా కోసం కూడా తెలుగులో పాడవచ్చు కదా’ అని ఈ-మెయిల్స్‌ పంపేవారు. దాంతో చంద్రబోస్‌గారితో ఆ పాటలన్నీ తెలుగులో రాయించి, మళ్లీ పాడి డబ్‌ చేశాం. తెలుగు ఆడియన్స్‌ వల్లే నేను రీమిక్స్‌ చేశా. అప్పట్లో హిందీలో కొన్ని పాటలు బాగా పాపులర్‌ అయ్యాయి. దీంతో ‘తెలుగులో కూడా మంచి పాటలు ఉన్నాయి. వాటిని చేద్దాం’ అని అమ్మ చెప్పడంతో తొలిసారి తెలుగులో చేశా.


‘మసక మసక’ విడుదలైన తర్వాత మీ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది?
స్మిత: 2003 డిసెంబరు 7న ‘మసక మసక’ ఆల్బమ్‌ విడుదలైంది. అంతకుముందు డిసెంబరు 4న ‘బబుల్స్‌’ తొలి బ్రాంచ్‌ ప్రారంభించాం. ఆ ఏడాది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ‘బబుల్స్‌’ ఈ స్థాయికి తీసుకెళ్దాం, నాలుగైదు వందల మందికి ఉపాధి కల్పిద్దాం, అనుకోలేదు. అప్పటికి నాకు 22ఏళ్లు. అయితే, జీవితం మలుపు తిరిగిందా? లేదా? అనేది తెలిసేలోపే అన్నీ జరిగిపోయాయి. ఆ వయసులో సక్సెస్‌, ఫెయిల్యూర్‌ల గురించి పెద్దగా తెలియదు. ఏది చేయాలనుకుంటే అది 100శాతం చేయడమే. ఫలితంతో నాకు సంబంధం లేదు.

ఇప్పటి వరకూ ఎన్ని ఆల్బమ్స్‌ చేశారు?
స్మిత: దాదాపు 15 ఆల్బమ్స్‌ వరకూ చేశా. కొన్ని రెండు మూడు భాషల్లో చేశా.


‘కిలి కిలి’ ఎందుకు చేయాల్సి వచ్చింది?
స్మిత: ‘మాహివే’ తర్వాత ఆన్‌లైన్‌లో ఫ్రీ డౌన్‌లోడ్‌, పైరసీ ఎక్కువైపోవడంతో, సీడీ క్యాసెట్స్‌ సేల్‌ కూడా లేదు. దీంతో రెవెన్యూ ఎలా వస్తుందో తెలియలేదు. నేను కూడా లైవ్‌ పెర్ఫామెన్స్‌లు చేయడం తగ్గించేశా. దీంతో కొంచెం బ్రేక్‌ తీసుకున్నా. ఆ తర్వాత ఆధ్యాత్మిక ఆల్బమ్స్‌ చేశా. అది కేవలం దేవుడి కోసమే చేశా. మళ్లీ ఎలా తిరిగి పుంజుకోవాలో అర్థం చేసుకోవడానికి నాలుగైదేళ్లు పట్టింది. నేను ఆ సాంగ్‌ చేసే సమయానికి ‘కిలికి’ భాష తెలియదు. ‘బాహుబలి’ కూడా విడుదల కాలేదు. అచ్చు ట్యూన్‌ ఇచ్చేశారు. అది నచ్చింది. అదే సమయంలో ‘బాహుబలి’ రిలీజ్‌ అయింది. సినిమా చూసిన కొద్దిసేపటికే ‘కిలికి’ భాషలో పాట పాడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ‘కిలికి’ భాషను కనిపెట్టిన మదన్‌కార్కీ అనే లిరిక్‌ రైటర్‌కు ఫోన్‌ చేసి విషయం చెబితే ఆయన రాయడానికి ఒప్పుకొన్నారు. అందరికీ నేర్చుకునే ఆసక్తి కలిగేలా పాట రాస్తే బాగుంటుందని నేను సలహా ఇచ్చా. మా పాట కోసం కిలికి భాషలో అంకెలను కూడా రాశారు. కేవలం నాలుగు రోజుల్లో పాట పూర్తి చేశారు. ఆ తర్వాత అంతా మీకు తెలిసిందే. ఇక రెవెన్యూ కోసం దాన్ని యూట్యూబ్‌లో పెట్టాం.

స్మిత పెద్ద సింగర్‌.. ఆమె కూతురిని కూడా అలా చూడవచ్చా?
స్మిత: తన ఇష్టాన్ని బట్టి. నేనేమీ ఒత్తిడి చేయను.

పాటలు, ఆల్బమ్స్‌ చేసే మీరు ‘మల్లీశ్వరీ’లో విలన్‌ పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది?
స్మిత: అదొక్కటే అడగకుండా ఉంటారని నేను కోరుకున్నా. కానీ, అడిగేశారు.(నవ్వులు) ఆ చిత్ర బృందమంతా చాలా మంచివాళ్లు. కానీ, నేనే కొంచెం భయపడ్డా. షూటింగ్‌కు వెళ్లిన మొదటి రోజు నుంచి ‘అయ్యో.. ఎందుకు ఒప్పుకొన్నానా?’ అనుకుంటూ చేశా. ఎందుకంటే అప్పటివరకూ నన్ను సినిమాల్లో నటించమని చాలా మంది అడిగారు. చాలా మంచి మంచి పాత్రలు కూడా వచ్చాయి. కానీ చేయలేదు. అయితే, తొలిసారి నెగిటివ్‌ పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందా? అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. నాకు తెలిసిన వాళ్లు కూడా ‘మంచి పాత్ర నువ్వు తప్పకుండా చెయ్‌’ అని సలహా ఇచ్చారు. కానీ, నాకే లోపల భయం ఉండిపోయింది. అందుకే ఒప్పుకొన్నా. కెమెరామెన్‌ సమీర్‌ అన్న నాకు అక్కడే పరిచయం అయ్యారు. ‘బహుశా మీరు పరిచయం కావడానికే ఆ సినిమా చేశానేమో’ అని అన్నతో ఎప్పుడూ చెబుతుంటా. ఎందుకంటే నేను చేసిన పలు ఆల్బమ్స్‌కు ఆయన కెమెరామెన్‌గా చేశారు.

హీరోయిన్‌గా ఎప్పుడైనా అవకాశం వచ్చిందా?
స్మిత: నేను ఆల్బమ్స్‌ చేసిన తొలినాళ్లలో వచ్చింది. కానీ, నేను మానసికంగా సిద్ధంగా లేను. అందుకే చేయలేదు.

‘ఏ స్టేజ్‌మీద పడితే ఆ స్టేజ్‌మీద పాటలు పాడను’ అని అన్నారా?
స్మిత: ఒకసారి టీవీలో కీరవాణిగారి ఇంటర్వ్యూ చూస్తున్నా. ‘ప్రైవేటు ఫంక్షన్స్‌లో పాటలు పాడటం నేను ఇష్టపడను. ఎందుకంటే అందరి దృష్టి వచ్చిన వాళ్లపైనా, ఆ ఫంక్షన్‌పైనా ఉంటుంది. ఒక మ్యూజిషియన్‌ మీద ఉండదు. నాకు గౌరవంగా అనిపించదు’ అని చెప్పారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత చాలా మంది పాటలు పాడమని అడిగారు. చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఆఫర్‌ చేశారు. కానీ చేయలేదు. మా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో తప్ప బయట ఎక్కడా పాడను. అంతే తప్ప అహంకారంతో కాదు.

సినిమాల్లో పాడే అవకాశం ఎలా వచ్చింది?
స్మిత: ‘మసక మసక’ షూట్‌ జరుగుతున్న సమయంలో కాల్స్‌ వచ్చాయి. త్రివిక్రమ్‌గారు, సురేశ్‌బాబుగారు చాలా మంది ఫోన్లు చేశారు. అలా అవకాశాలు వచ్చాయి. పాప్‌ ఆల్బమ్స్‌ అనే ఆలోచన మా నాన్నకు వచ్చింది. మా అమ్మానాన్న ఇంగ్లీష్‌ పాప్‌ ఆల్బమ్స్‌ బాగా వినేవారు. ‘తెర వెనుకే కాదు. తెర ముందు కూడా ప్రదర్శన ఇస్తే బాగుంటుంది’ అని సలహా ఇవ్వడంతో ‘హాయ్‌రబ్బా’ చేశా. అప్పుడు మా నాన్నగారికి కామన్‌ ఫ్రెండ్‌ అయిన అక్కినేని వెంకట్‌గారు నన్ను బాగా మెచ్చుకుని ముందుకు తీసుకెళ్లారు. నా కెరీర్‌ ప్రారంభంలో నాగార్జునగారు చాలా ప్రోత్సహించేవారు. నా ప్రతి ఆల్బమ్‌ ఓపెనింగ్‌కు వచ్చేవారు.

అసలు ‘మసక మసక’ పాట ఎల్‌ఆర్‌ ఈశ్వరి పాడారు. ఆమెను ఎప్పుడైనా కలిశారా?
స్మిత: ఒకసారి కలిశాను. మా ఇద్దరిని ఓ ఈవెంట్‌కు పిలిచారు. అయితే, జనం బాగా ఉండటంతో ఎక్కువ సేపు మాట్లాడుకునే సమయం లేకుండా పోయింది.

మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?
స్మిత: శశాంక్‌ నాకు ముందే పరిచయం. నా ఫ్రెండ్‌కు బావ అవుతారు. అందుకే అందరం ఆయనను ‘బావ.. బావ’ అని పిలిచేవాళ్లం. మా పెళ్లి గురించి మా తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసింది అక్కినేని వెంకట్‌గారు. శశాంక్‌ తన వ్యాపారాలతో పాటు నా బిజినెస్‌ కూడా చూస్తారు. ఆలోచన నాదైతే.. ఆయన అమలు చేస్తారు.ఏ పాటకు ఫిలింఫేర్‌ వచ్చింది?
స్మిత: ‘అనుకోకుండా ఒకరోజు’లో ‘ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని’ పాటకు వచ్చింది.

ఇంకా సినిమా పాటలు పాడుతున్నారా?
స్మిత: అప్పుడప్పుడు పాడుతున్నా. చాలా తక్కువ. మంచి పాట పాడటానికి నేనెప్పుడూ సిద్ధమే.

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం

హాయ్‌రబ్బా
: చిన్ననాటి తీపి జ్ఞాపకం

విజయవాడ
: నా ఊరు

పాడుతా తీయగా
: అమాయకత్వం

అమ్మ
: ప్రేమ

పాప్‌ మ్యూజిక్‌
: బ్యూటిఫుల్‌ జర్నీ

క్లాసికల్‌ మ్యూజిక్‌
: అమిత గౌరవం

పెళ్లి
: అద్భుతంగా సహకరించే జీవిత భాగస్వామి

శివి
: నా జీవితంలో అద్భుతం

మల్లీశ్వరి
: ఒక మిత్‌ ఫీలింగ్‌

బిజినెస్‌
: నా రక్తంలోనే ఉంది

రీమిక్స్‌
: లవ్లీ ఎక్స్‌పీరియన్స్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.