మరలిరాని అద్భుతం.. చెదిరిపోని జ్ఞాపకం!
అద్భుతాలెప్పుడూ ఒకేసారి పుడతాయి. వాటికి మరు జననం లేదు. మరణమూ ఉండదు.కళ్ల ముందు లేకపోయినా స్మరించుకుంటాం. ఆ జ్ఞాపకాలు పంచుకుంటాం. వాటిపై ప్రేమని అలా అలా పెంచుకుంటాం. శ్రీదేవీ అంతే! ఓ మరలిరాని అద్భుతం.. చెదిరిపోని జ్ఞాపకం!!


అందం, అమాయకత్వం.. అందం, అణకువ అందం, అభినయం... చాలా అరుదైన కలయిక.ఇవన్నీ కలిసి ఒడబోసిన రూపం... శ్రీదేవి. వెండి తెర చాలామంది కథానాయికల్ని చూసుంటుంది. వాళ్లలో గొప్ప అందగత్తెలున్నారు. అద్భుతమైన అభినయాన్ని పలికించినవాళ్లున్నారు. ఆ రెండింటినీ మేళవించిన శ్రీదేవి మాత్రం చాలా పత్యేకం. కథానాయికల అందం గురించి ప్రస్తావించుకున్నప్పుడల్లా శ్రీదేవి కళ్ల ముందు మెదులుతుంది. అందం కాస్త అంటుకుంటే అందగత్తెలంటాం. అలాంటి అందాన్నే శ్రీదేవి తాకి ఉంటుంది. అందుకే అందం.. అంద అందంగా మారిపోయుంటుంది.

కొన్ని పూల రెక్కలు.. వేల తేనె చుక్కలు లక్షల మెరుపులు.. కోట్ల తళుకులు
ఇవన్నీ శ్రీదేవి ముందు చిన్నవే. వెండి తరగలాంటి ఆమె నవ్వు, చిలిపి చూపులు, చలాకీ అభినయం.. ఇవన్నీ శ్రీదేవికి వెలకట్టలేని ఆభరణాలయ్యాయి. అలాంటి శ్రీదేవి ఇప్పుడు గత వైభవంగా మారిపోవడం విషాదం. ఆమె  తొలి వర్ధంతి జరుపుకోవడం చేదెక్కిన కఠిన నిజం.
 కానీ, ఆమె స్మృతులు మిగిల్చిన కంటి చెమ్మ మాత్రం అలానే వెచ్చగా ఉంది. శ్రీదేవి మరణం ఆమె అభిమానులు ఇంకా జీర్ణించుకోనేలేదు. ఆమె గురించి కలవరించిన హృదయాల అలసట ఇంకా తీరనే లేదు. ఆమె మరణం చుట్టూ అల్లుకున్న ప్రశ్నలకూ సమాధానాలు దొరకనేలేదు.


మరపుని మించిన మందులేదు. కాలానికి మించిన వైద్యుడు లేడు.
కానీ ఇవి కూడా శ్రీదేవిని సినీ అభిమానికి దూరం చేయలేవు. కారణం... సినిమా స్టార్లనీ, వాళ్లపై అభిమానాన్నీ కేవలం సినిమాలకే పరిమితం చేయరు. ఆ ప్రేమని థియేటర్‌ నుంచి సరాసరి ఇంటికి తీసుకొస్తారు. హృదయాల్లో దాచుకుంటారు. శ్రీదేవి కూడా అలా హృదయాల్లో నిలిచిపోయింది. శ్రీదేవి సినిమాలెప్పుడు చూసినా ‘అరె... ఇప్పుడు.. ఈ క్షణంలో శ్రీదేవి మన మధ్య లేదే..’ అని వెలితి.. ఆమె గురించి మాట్లాడుకుంటున్నప్పుడల్లా.. ‘ఇంకా కొన్నాళ్లు ఉండాల్సింది కదా’ అనే నిట్టూర్పులు.
వసంతం ఎప్పుడూ ఉండిపోదు.. అలాగని మళ్లీ రావడం మర్చిపోదు.. శ్రీదేవి కూడా వచ్చి వెళ్లిపోయిన వసంతం..మళ్లీ వస్తుందని నమ్మడమే.. అభిమానం.
అభిమానుల కోసం ఎన్నో కొత్త పాత్రలు ధరించి మురిపించిన శ్రీదేవి.. తాను పోషించిన ‘శ్రీదేవి’ పాత్రనే మరోసారి పోషించడానికైనా మళ్లీ పుట్టాలి.. మళ్లీ రావాలి!


(ఈరోజు శ్రీదేవి  తొలి వర్ధంతి సందర్భంగా)Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.