ఘంటసాల ‘రహస్యం’ వెనుక సంగీతరావు
ఘంటసాల తన గానం, సంగీతం ద్వారా భారతీయ సినీ సంగీతాన్నే ప్రభావితం చేశాడంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికి ఆయన ప్రభావం ఎంతోకొంత చిత్ర పరిశ్రమ మీద ఉంది. ఆయన దగ్గర రెండు దశాబ్దాల పాటు సహాయ సంగీత దర్శకుడిగా పని చేశారు ‘సంగీత భూషణ’ పట్రాయిని శ్రీ సంగీతరావు. నేటితో ఆయన వంద వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంగీత జీవిత విశేషాలు...


ఘంటసాల సంగీతంలో నేపథ్య సంగీతంకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ నేపథ్య సంగీతానికి అంతటి ప్రత్యేకత సతరించటంలో సంగీతరావుగారి పాత్ర గురించి ఒక ఉదాహరణ. ఘంటసాల ‘రహస్యం’ సినిమాలో బీల ‘లఖిత భావ విలయా’ అన్న సరస్వతి రాగంలోని రాగమాలికలో వీరి నేపథ్య వాద్య సహకారం చరిత్రలో నిలిచిపోయిందనటంలో అతిశయోక్తి లేదు. 1954 నుంచి 1974 వరకు ఘంటసాల వద్ద సహాయకుడిగా ఎన్నో మరపురాని చిత్రాలకు పనిచేశారు. 1971లో ఘంటసాల బృందంతో పాటుగా అమెరికా వెళ్లి సంగీత ప్రదర్శన ఇచ్చారు.


తల్లిదండ్రులు పెట్టిన పేరుకి సంగీతరావు సార్థక నామధేయం కలిగించారన్నది అక్షరసత్యం. వాళ్లది సంగీత నేపథ్య కుటుంబం. ఆయన చిన్నతనంలో తండ్రి వద్దనే సంగీత శిక్షణ పొందారు పట్రాయిని. 1953లో ‘ఆంధ్ర భారతీతీర్థ’, ‘సంగీత భూషణ’ బిరుదులు పొందారు. 1975 నుంచి కూచిపూడి ఆర్ట్స్‌ అకాడమి (చెనై) సంగీత ఉపాధ్యాయుడిగా, గాయకుడిగా, నృత్య నాటకాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. నృత్య నాటాకానికి సంగీత రచన చేయటంలో వీరి కృషి, అనుభవ సామర్థ్యం అర్థ శతాబ్దానికి పైగా బహుళ ప్రాచుర్యం పొందుతూ వచ్చాయి. 1986లో ఉత్తమ నృత్య నాటక సంగీత దర్శకుడిగా తెలుగు ఆకాడమీ పురస్కారం అందుకున్నారు. 1994లో తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ పురస్కారంతో సత్కరించింది.

శ్రీ సంగీతరావు నేటికి అంటే శతవర్షప్రాయంలోను సంగీత మర్మాలను శిష్యులకు వివరించటం, సాహిత్య పరులతో గోష్టుల్లో పాలుపంచుకోవటం విశేషం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.