తండ్రితో.. తనయుడితో..
నటనకు వయసుతో సంబంధం ఉండదు. ఉంటుందనే ఆలోచనతో నాయికానాయకులు నటిస్తే వెండితెరపై సన్నివేశం పండదు. అందుకే శ్రీదేవి, సావిత్రి.. వంటి అలనాటి అగ్ర కథానాయికలు తమకంటే పెద్దవారైనా ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లతో నటించి మెప్పించారు. కొందరు ఈతరం హీరోయిన్లు సైతం అటు ఆ తరం హీరోలతోనూ.. ఇటు ఈ తరం హీరోలతోనూ ఆడిపాడి అభిమానుల్ని ఫిదా చేశారు. తండ్రి, తనయులతో సినిమాలు చేస్తూ ఘన విజయం అందుకున్నారు. ఆ కథానాయికలెవరో చూద్దాం...

* కాజల్‌
- ‘లక్ష్మీకల్యాణం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమైంది కాజల్‌. ఇటీవలే వచ్చిన ‘సీత’ సినిమాతో ఏభై చిత్రాలు పూర్తి చేసుకుంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఈ భామ దాదాపు అందరి హీరోలతో నటించింది. ‘మగధీర’, ‘నాయక్‌’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ఆర్య 2’ చిత్రాల్లో యువ హీరోలు రామ్‌ చరణ్, అల్లు అర్జున్‌ సరసన నటించిన కాజల్, సీనియర్‌ నటుడు చిరంజీవి ‘ఖైదీ నంబరు 150’, పవన్‌ కల్యాణ్‌ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రాల్లో మెరిసింది.*
లావణ్య త్రిపాఠి


-‘అందాల రాక్షసి’ చిత్రంలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది లావణ్య. అవకాశాలు అందిపుచ్చుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. యువ హీరోల చిత్రాల్లోనే కాకుండా.. అగ్ర నటుడు నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్నినాయన’లో తన ప్రతిభ చూపించింది. నాగార్జునతో ఆడిపాడిన ఈ యువ కథానాయిక తనయుడు నాగచైనత్యతో ‘యుద్ధం శరణం’ చేసింది.

*
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌


- ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రంలో యువ హీరో నాగచైతన్యతో కలిసి నటించిన రకుల్‌ నాగార్జునతో ‘మన్మథుడు 2’ చేసి మెప్పిచింది.

* శ్రియ


-‘ఇష్టం’ సినిమాతో వెండితెరపైకి వచ్చిన శ్రియ దాదాపు తెలుగు హీరోలందరితోనూ నటించిందనే చెప్పాలి. అగ్ర నటుడు బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్‌’ చిత్రాల్లో నటించిన శ్రియ జూనియర్‌ ఎన్టీఆర్‌తో ‘నా అల్లుడు’ చిత్రంలో ఆడిపాడింది.

* నయనతార


- అగ్ర హీరోలతో, యువ కథానాయకులతో నటించిన జాబితాలో నయనతార పేరు వినిపిస్తుంది. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో బాలకృష్ణ సరసన నటించిన నయన్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌తో ‘అదుర్స్‌’లో జత కట్టింది. మరోవైపు వెంకటేష్‌ సరసన ‘లక్ష్మీ’, ‘తులసి’, ‘బాబు బంగారం’ చిత్రాల్లో నటించిన నయనతార యంగ్‌ హీరో రానాతో ‘కృష్ణం వందే జగద్గురుం’లో వైవిధ్య భరిత పాత్రలో మెరిసింది.


* తమన్నా


-‘హ్యాపీడేస్‌’ చిత్రంతో యువతను అమితంగా ఆకర్షించిన తమన్నా యంగ్‌ హీరోలతోనే కాకుండా కథ బావుంటే సీనియర్‌ కథానాయకులతోనూ పోటీపడింది. యువ కథానాయకులు అల్లు అర్జున్‌తో ‘బద్రీనాథ్‌’, రామ్‌ చరణ్‌తో ‘రచ్చ’ చేసిన ఈ మిల్క్‌ బ్యూటీ సీనియర్‌ నటుడు పవన్‌ కల్యాణ్‌తో ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’, చిరంజీవితో ‘సైరా’ చిత్రంలో నటించి అభిమానుల్ని అలరించింది.

* సమంత


- తొలి సినిమాతోనే యువతతో ‘ఏమాయ చేశావే’ అనిపించుకున్న సమంత కథానాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లోనూ నటించి ఔరా అనిపించింది. యంగ్‌ హీరో నాగచైతన్యతో మొదటి సినిమా ‘ఏమాయ చేశావే’, ‘ఆటోనగర్‌ సూర్య’, ‘మజిలీ’ చేసిన సామ్‌.. అగ్ర కథానాయకుడు నాగార్జుతో ‘మనం’ చిత్రంలో నటించింది. మరోవైపు పవన్‌ కల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’లో నటించి అల్లు అర్జున్‌తో ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, రామ్‌ చరణ్‌తో ‘రంగస్థలం’ చేసింది.

* శృతి హాసన్‌


-కమలహాసన్‌ తనయగా తెరంగ్రేటం చేసినా తన ప్రతిభతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది శృతి. అగ్ర నటుడు పవన్‌తో ‘గబ్బర్‌సింగ్‌’లో మెప్పించిన శృతి యంగ్‌ హీరోలు అల్లు అర్జున్‌తో ‘రేసుగుర్రం’, రామ్‌ చరణ్‌తో ‘ఎవడు’లో కనిపించి అలరించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.