కారు ఏదైనా.. నెంబరు అదే ఉండాలట!
చిత్రసీమలో సెంటిమెంట్లకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. సినిమాల విడుదల తేదీలు మొదలుకొని తాము వాడే కారు నెంబర్ల వరకూ ప్రతి విషయంలోనూ తమ సెంటిమెంట్లను బట్టే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. దీనికి అగ్రకథానాయకులు కూడా మినహాయింపు కాదు. కారు నెంబర్ల విషయంలో తమకు అచ్చొచ్చిన నెంబరు కోసం లక్షలు ఖర్చుపెట్టడం కూడా కొత్త విషయమేం కాదు. కారు నెంబర్ల విషయంలో కొందరు బాలీవుడ్‌ కథానాయకులకున్న సెంటిమెంట్లు, వాటి వెనకున్న కారణాలు తెలుసుకుంటే భలే విచిత్రంగా ఉంటుంది. కార్ల కన్నా వాటి నెంబర్లే ముఖ్యమేమో అనిపిస్తుంది.

ఒకటి ఒకటి కలిపితే రెండు..
అమితాబ్‌ గ్యారేజీలో ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లన్నీ కొలువుదీరి ఉంటాయి. అయితే ప్రతి కారు నెంబరులోనూ ‘2’ ఉండి తీరాల్సిందేనట. ఆ అంకె అంటే ఆయనకంత సెంటిమెంట్‌. ఎందుకంటే ఆయన పుట్టిన తేదీ అక్టోబరు 11. ఆ సంఖ్యను కలిపితే వచ్చేది 2. అందుకే తన ప్రతి కారు నెంబరు 2 ఉండేలా చూసుకుంటారు అమితాబ్‌.


ఎందుకంత ఇష్టమో తెలియదు..
షారుఖ్‌ ఎంత ముచ్చటపడి కారు కొంటాడో అంతే ముచ్చటతో కారు నెంబరులో ‘555’ ఉండేలా జాగ్రత్తపడతాడు. ఆ నెంబరంటే తనకు ఎంతిష్టమో చెప్పగలడు కానీ ఎందుకిష్టమో చెప్పలేడు షారుఖ్‌. ఎందుకంటే దానికి ప్రత్యేక కారణమంటూ లేదు కనుక. మరో ఆసక్తికర విషయమేంటంటే తన దగ్గర పనిచేసే సిబ్బంది ఫోన్‌ నెంబర్లలోనూ 555 ఉండాల్సిందేనట.

సంఖ్యాశాస్త్రం ప్రకారం..
సంజయ్‌దత్‌కు సంఖ్యాశాస్త్రం మీద గురి ఎక్కువే. తనకు తొమ్మిది అంకె బాగా కలిసొస్తుందని నమ్ముతారాయన. అందుకే తన ప్రతి కారు నెంబరు ప్లేట్ మీద ‘4545’ ఉంటుంది. అందులోని అంకెలను కలిపితే తొమ్మిది వస్తుంది. కవలలు పుట్టిన సందర్భంగా తన భార్య మాన్యతకు కానుకగా ఇచ్చిన రోల్స్‌ రాయిస్‌ కారు నెంబరులోనూ 4545 ఉందట.


కపూర్‌ 700..
జేమ్స్‌ బాండ్‌ 007 లాగా షాహిద్‌ కపూర్‌ 700 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రేంజ్‌ రోవర్‌ కారు, హ్యార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌ నెంబర్లు ‘700’ అనే ఉంటాయి. ఆయన పుట్టినరోజు ఫిబ్రవరి 25. దాన్ని కలిపితే 7 వస్తుంది. తనకు ఆ అంకె కలిసొస్తుందన్న నమ్మకంతో 700 నెంబరు ఎంపిక చేసుకుంటాడు షాహిద్‌.

అమ్మకు ప్రేమతో..
రణ్‌బీర్‌ కపూర్‌కు తన తల్లి నీతూ కపూర్‌ అంటే అమితమైన ప్రేమ. దాన్ని కారు నెంబర్ల రూపంలోనూ వ్యక్తపరస్తుంటాడు రణ్‌బీర్‌. నీతూ పుట్టినరోజు జులై 8. అందుకే తన కారు నెంబర్లన్నింటిలోనూ ‘8’ ఉంటుంది.

భర్తకు 7.. భార్యకు 3..
బాలీవుడ్‌ జంట సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌లు కూడా కారు నెంబర్ల విషయంలో సెంటిమెంట్లు పాటిస్తారు. సైఫ్‌ పుట్టినరోజు ఆగస్టు 16. కలిపితే 7 వస్తుంది. అందుకే తన కార్లకు ‘7’ నెంబరు వచ్చేలా చూసుకుంటాడు సైఫ్‌. కరీనాకు ‘3’ అంటే మక్కువ. అందుకే అది కారు నెంబరు ప్లేట్‌ మీద ఉండేలా జాగ్రత్తపడుతుంది కరీనా.రితేష్‌ నెంబర్‌ 1..
రితేష్‌ దేశ్‌ముఖ్‌కు నెంబర్‌ 1 కథానాయకుడు అనిపించుకోవడం అంటే ఇష్టమేమో. అందుకే తన కారు నెంబరు ‘1’ ఉండేలా చూసుకుంటాడు. ఉత్త ఒకటి కాదండోయ్‌. దాని ముందు ‘ఆర్‌’ కూడా ఉండాల్సిందేనట. ఆర్‌ ఫర్‌ రితేష్‌ అని అర్థమేమో. కార్లతో పాటు అతని వ్యానిటీ వ్యాన్‌ నెంబరు కూడా ‘ఆర్‌ 1’ అని ఉంటుందట.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.