ఆయన చెప్పినట్లు చూడలేదని ఒక్కటి పీకారు
ఒకరు హాస్యానికి మేల్‌ వెర్షన్‌..
మరొకరు కామెడీకి ఫిమేల్‌ వెర్షన్‌..
ఏది ఏమైనా నవ్వుల వర్షాన్ని కురిపించడంలో వారిది సరికొత్త వెర్షన్‌..
ఇప్పటికీ తాము అప్‌డేటెడ్‌ వెర్షన్‌.. అంటూ సందడి చేశారు హాస్యనటులు ‘అల్లరి’ సుభాషిణి, సుమన్‌శెట్టి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు.


ఇంతవరకూ సినిమాల్లో తప్ప టీవీ ఛానల్‌లో కనిపించలేదు కదా!

సుమన్‌శెట్టి: అవును! ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే టీవీ ముందుకు వచ్చి ఏ మాట్లాడతానో.. ఏం మాట్లాడితే ఏమవుతుందోనని భయం(నవ్వులు). ఏమీ మాట్లాడకపోతేనే ఎన్నో వివాదాలు వస్తున్నాయి. ఇక మాట్లాడితే ఊరుకుంటారా?

14ఏళ్ల వయసులో స్టేజ్‌ని గడగడలాడించారట! మీ సొంతూరు ఏది?
సుభాషిణి: అవునండీ! మాది భీమవరం. మీ(ఆలీ) నాన్నగారు డ్రెస్‌ కుట్టి ఇచ్చేవారు. ఆయనను అన్నయ్యా అంటూ పిలిచేదాన్ని. అప్పట్లో చాలామంది డ్రామా ఆర్టిస్ట్‌లకు మీ(ఆలీ) నాన్నగారే దుస్తులు కుట్టేవారు! ఏవీఎంకు వెళ్లి అక్కడి నుంచి మోడల్స్‌ తెచ్చి కుట్టేవారు.

నాటక రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది?
సుభాషిణి: అప్పట్లో మాకు సినిమాల గురించి పెద్దగా తెలియదు. అయితే, పండగల సమయంలో ఊళ్లో నాటకాలు వేసేవాళ్లు. అవి చూడటానికి ఎగబడి వెళ్లేవాళ్లం. అలా నాకు నాటకాలపై ఆసక్తి ఏర్పడింది. మేం చదువుకునే సమయానికి వాణిశ్రీగారు పెద్ద హీరోయిన్‌ అయ్యారు. ఆవిడలాగే ఉండాలని.. అలా తయారవ్వాలనే కోరిక బాగా ఏర్పడింది. అప్పట్లో నన్ను అందరూ ఆంధ్రా వాణిశ్రీ అనేవారు. రంగనాథ్‌గారికి నేనంటే చాలా ఇష్టం.

మీరు వేసిన మొదటి నాటకం ఏది?
సుభాషిణి: ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’. జయచిత్రగారు ప్రధాన పాత్రలో సినిమాగా తీస్తే కూడా విపరీతరంగా ఆడింది.

మరి ఏ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు?
సుభాషిణి: ‘అల్లరి’ సినిమాతోనే వెండితెరకు పరిచయం అయ్యా. మద్రాసులో ‘చింతామణి’ నాటకం ఆడుతుంటే అక్కడకు చలపతిగారు, రాళ్లపల్లిగారు సహా పలువురు తెలుగు నటులు వచ్చారు. అప్పుడు చలపతిరావుగారు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అదే నాటకాన్ని రవీంద్రభారతిలో వేస్తుంటే, అక్కడకు ఆయన వచ్చి ‘సుభాషిణి.. మన రవి సినిమా తీస్తున్నాడు. వేషం ఉంటే ఇస్తాడు. వెళ్లి కలువు’ అన్నారు. అప్పుడు నేను వెళ్లకుండా భీమవరం వెళ్లిపోయా. సినిమాలో అవకాశం ఇవ్వడానికి నన్ను కలుద్దామంటే నా అడ్రస్‌ కనుక్కోవడం కష్టమైపోయింది. దీంతో చలపతిరావుగారు పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసి ‘మీ భీమవరంలో సుభాషిణి అని స్టేజ్‌ ఆర్టిస్ట్‌ ఉంటారు. కొంచెం ఆమె వివరాలు కావాలి’ అని అడిగారట. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నన్ను పోలీసులు తీసుకెళ్లిపోతున్నారని మా వీధిలోని వాళ్లందరూ వచ్చారు. ‘వేరే ఉద్దేశంతో కాదమ్మా! మీ కోసం చలపతిరావుగారు ఇలా మాకు ఫోన్‌ చేశారు’ అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత నేను హైదరాబాద్‌ వచ్చేశా. బట్టలు కూడా తీసుకెళ్లలేదు. దాంతో సినిమాలో నేను ఎక్కువగా నైటీతో కనిపిస్తా(నవ్వులు)


మిమ్మల్ని సుమన్‌ అని పిలవాలా.. లేక ఆలీబాబా పిలవాలా?

సుమన్‌శెట్టి: నాకు బ్రేక్‌ ఇచ్చిన సినిమా ‘జయం’. అప్పుడు నేను ఇంటర్మీడియట్‌ చదువుతున్నా. వైజాగ్‌లో మా నాన్నగారికి రైస్‌ అండ్‌ ఆయిల్‌ షాపు ఉంది. ఒకరోజు షాపులో కూర్చుంటే సినిమా మ్యాగజైన్‌ ఒకటి కనపడింది. అందులో ‘జూనియర్‌ ఆర్టిస్ట్‌లు కావాలి’ అని ఉంది. అది చూసి తేజగారికి ఫొటోలు పంపా. తర్వాత ఆడిషన్‌కు రమ్మని నాకు టెలిగ్రాం వచ్చింది.

‘జయం’ చేస్తున్నప్పుడు డైరెక్టర్‌ చేతిలో దెబ్బలు పడ్డాయా?
సుమన్‌శెట్టి: (నవ్వులు) అవును! దెబ్బలు పడ్డాయి. సినిమాలో షకీలాగారికి నాకూ ర్యాగింగ్‌ సీన్‌ ఒకటి ఉంటుంది. అక్కడ ఆయన చెప్పిన లుక్‌లో చూడలేదని ఒక్కటి పీకారు. ఆ దెబ్బకు వచ్చేసింది.


‘స్వర్గం-నరకం’ సినిమాకు మీ ఆయనకూ సంబంధం ఏంటి?

సుభాషిణి: నాటకాలు వేసే సమయంలో గురువుగారు దాసరి నారాయణరావు మా వారికి స్నేహితులు. అందులో మా ఆయన మంచి పాత్ర వేశారు. ఆ తర్వాత ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’లో కూడా మంచి పాత్ర ఇస్తే, చేయలేదు.

మీరు ఎన్ని సినిమాల్లో నటించారు?
సుభాషిణి: నేను చాలా సినిమాల్లో నటించాను. బహుశా 200 సినిమాలకు పైగా చేసి ఉంటానేమో. కానీ, ఎప్పుడూ లెక్కపెట్టుకోలేదు. మా అక్క తన డైరీలో ‘ఇన్ని హరికథలు చెప్పాను. సీరియల్స్‌లో నటించాను’ అని రాసుకుంది. ఒక రోజు ఆదాయపన్ను శాఖ వాళ్లు పట్టుకున్నారు. ‘నీ సంపాదన ఏమీ పుస్తకాల్లో రాయకు’ అని మా అక్క చెప్పడంతో అసలు సినిమాల వివరాలు కూడా రాయలేదు. (నవ్వులు) చాలా మంది దర్శకుల వద్ద పనిచేశా. ఏదో ఒక సినిమాలో చిన్న వేషమైనా ఇచ్చేవారు. తేజగారైతే స్వయంగా ఫోన్‌చేసి చెబుతారు. కొంతకాలం కిందట నేను క్యాన్సర్‌తో బాధపడ్డా. దానికి ట్రీట్‌మెంట్‌ తీసుకున్న తర్వాత కూడా తేజగారు పిలిచి ‘నేనే రాజు నేనే మంత్రి’లో అవకాశం ఇచ్చారు.
నాకు ఆస్మా, రమణి అనే స్నేహితురాళ్లు ఉన్నారు. ఒక రోజు నాకు నీరసంగా ఉంటోందని చెప్పడంతో రమణి ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించింది. అప్పుడే నాకు క్యాన్సర్‌ ఉందని తెలిసింది. అయితే, ఐదారు లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే స్థోమత లేదు. బసవతారకం ఆస్పత్రికి వెళ్లా. ఈ విషయం బాలకృష్ణగారికి తెలియదు. ఆ తర్వాత ఒక సందర్భంలో నేను రాగిణికి ఫోన్‌ చేసి విషయం చెబితే, ‘అయ్యో! బాలయ్యబాబు దగ్గరకి నేను తీసుకెళ్తా’ అని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మనోహర్‌రాజుగారు అనే వ్యక్తి కలిశారు. ఆయన సూచన మేరకు ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రికి వెళ్లాం. అక్కడకు వెళ్లిన రోజే ఆస్పత్రిలో చేర్చుకున్నారు. టెస్టులు చేసి, ట్రీట్‌మెంట్‌కు ఐదారు లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పా. నేను ఒక అప్లికేషన్‌ ఇస్తాను సీఎం క్యాంపు ఆఫీస్‌కు వెళ్లండని అన్నారు. దాన్ని తీసుకుని నేను నేరుగా సీఎం కేసీఆర్‌ ఆఫీస్‌కు వెళ్తే, ఎంతో ఆదరించి వెంటనే సంతకం పెట్టి డబ్బులు శాంక్షన్‌ చేశారు. ఆ ఆస్పత్రిలో డాక్టర్లు కూడా చాలా బాగా చూసుకునేవారు.

‘దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి’ అంటారు కదా! మరి జీవితంలో అది ఎందుకు పాటించలేకపోయారు?
సుభాషిణి: నాన్నగారు పోయిన తర్వాత అమ్మే మమ్మల్ని పెంచి పోషించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే అమ్మ కూడా చనిపోయారు. ఆ తర్వాత అక్క కూడా చనిపోయింది. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ నాపైనే పడ్డాయి. ఆర్థిక ఇబ్బందులు పడలేక నా బాధలన్నీ వీడియోలుగా మార్చి యూట్యూబ్‌లో పెడితే, సహాయం చేస్తానని అమెరికా నుంచి రజిత ఫోన్‌ చేశారు. ఆ తర్వాత నాగబాబుగారు కూడా ఫోన్‌ చేసి రూ.లక్ష సాయం చేశారు. చిరంజీవిగారు రెండు లక్షలు ఇచ్చారు. బ్రహ్మానందంగారు, వెన్నెల కిషోర్‌, సురేఖ, ప్రేమ ఇలా చాలామంది సహాయం చేశారు. శివాజీరాజాగారు ‘మా’ తరఫు నుంచి చాలా హెల్ప్‌ చేశారు.

షాట్‌ అయిపోయిన తర్వాత దూరంగా చెట్టు కిందకు వెళ్లి కూర్చుంటావు. దాని వల్ల సుమన్‌శెట్టికి బాగా బలుపు అని అందరూ అనుకున్నారట? ఎంతవరకూ నిజం?
సుమన్‌శెట్టి: అవును! అందరూ నాకు పొగరు అనుకున్నారు. అందరితోనూ కలవడం నాకు భయం. కలిస్తే మాత్రం బాగా మాట్లాడతా!


ఒక ప్రముఖ హీరో నిన్ను సన్నబడమని చెప్పారట ఎవరది?

సుమన్‌శెట్టి: ‘పవర్‌స్టార్‌’ పవన్‌కల్యాణ్‌. ఆయనతో ‘అన్నవరం’లో నటించా. ఆ తర్వాత ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లో చేస్తుండగా, ‘అప్పటితో పోలిస్తే, ఇప్పుడు బాగా లావు అయిపోయావు. అందుకే నీకు అవకాశాలు కూడా తగ్గాయి’
అని చెప్పారు. ఈ మధ్యలో నాన్నగారు చనిపోవడం కూడా నన్ను బాగా కుంగదీసింది.

ఒక సినిమాలో లోపల బాధపెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ చేశారట ఏం సినిమా?
సుమన్‌శెట్టి: సినిమా పేరు గుర్తులేదు. అందులో జూనియర్‌ రేలంగిగారు కూడా ఉన్నారు. ఆయనను ఆటపట్టించే సీన్‌ అది. అది చేసే సమయంలో అమ్మమ్మ చనిపోయిందని ఫోన్‌ వచ్చింది. నేను చేసే సన్నివేశం.. నేను విన్న వార్తకు అస్సలు సంబంధం లేదు. రెండూ వేర్వేరు.

ఇండస్ట్రీకి రాకముందు ఏమవుదామని అనుకున్నావు?
సుమన్‌శెట్టి: మానాన్నగారికి షాపు ఉంది కదా! దాన్ని చూసుకుంటూ ఉండేవాడిని. అప్పటికే షాపునకు సంబంధించిన పనుల్లో ఆయనకు హెల్ప్‌ చేస్తుండేవాడిని.

కృష్ణభగవాన్‌తో గొడవైందా?
సుమన్‌శెట్టి: ఆయనతో కలిసి ‘బొమ్మన బ్రదర్స్‌.. చందనా సిస్టర్స్‌’లో చేశా. ఆయన కాలికి దెబ్బ తగలడంతో ఎక్కువ సేపు నిలబడలేరు. ఏదో సీన్‌ నేను చేయడం ఆలస్యమవడంతో ఆయన కాస్త చిరాకు పడ్డారు. ‘ఎక్కడి నుంచి తీసుకొచ్చారయ్యా! ఈ యాక్టర్‌ని’ అంటూ కోప్పడ్డారు. దానికి మీడియా కథలు కథలుగా రాసింది.
పెద్ద ఆర్టిస్ట్‌లతో నటిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది?
సుభాషిణి: నేను సెట్‌కు రాగానే, అందరికీ నమస్కారం చేస్తాను. అందరికీ గౌరవం ఇస్తాను. అయితే, ఎవరికీ భయపడేదాన్ని కాదు. కానీ, ఒక్క రవిబాబుని చూస్తే మాత్రం భయం వేసేది. ఆయన నాకు యముడిలా కనపడతారు(నవ్వులు). ఆయన వచ్చి డైలాగ్‌ చెప్పమంటే భయం వేసేది. ఒక రోజు కొట్టబోయారు కూడా. ఆయనకు తను ఒక డైరెక్టర్‌ అన్న అహం ఉండదు. అందరితోనూ కలిసిపోతారు. అయినా కూడా ఆయనంటే నాకు భయం. అయితే చలపతిరావుగారిని చూస్తే భయం వేయదు.

పెద్ద బొట్టుపెట్టుకునేవారట దాని వెనుక కథ ఏంటి?
సుభాషిణి: రవిబాబు దర్శకత్వంలో ‘అమ్మాయిలు అబ్బాయిలు’ చేస్తున్నా. అందులో ఆ పాత్రకు చిన్న బొట్టు పెట్టుకుంటే కనిపించదు. అందుకే పెద్దగా పెట్టుకున్నా. అప్పుడే కృష్ణవంశీ ‘ఖడ్గం’ సినిమా తీస్తుంటే అక్కడకు వెళ్లా. ఆయన నన్ను చూసి ‘సుభాషిణిగారు మీకు పెద్ద బొట్టు బాగుంది. ఇలాగే కొనసాగించండి’ అన్నారు. అప్పటి నుంచి అలాగే బొట్టు పెట్టుకుంటున్నా.


‘ఎవడిగోల వాడిది’ కోసం బ్యాంకాక్‌ ఎందుకు వెళ్లలేదు?

సుభాషిణి: నాకు విమానం అంటే భయం. అందుకే నేను రానని చెబితే ఈవీవీ సత్యనారాయణగారు తిట్టారు. వైజాగ్‌ నుంచి హైదరాబాదే రాను. నేను ఎక్కడికి వెళ్లినా రైలుకే వెళ్తా. ‘పరమవీరచక్ర’కు అందరూ ఫ్లైట్‌లో వేళ్తే, నేను ఒక్కదాన్నే రైలులో వెళ్లా.

మీరూ-బాలకృష్ణ కలిస్తే, పద్యాలు పాడతారట!
సుభాషిణి: పౌరాణికం అంటే ఆయనకు బాగా ఇష్టం. అందరూ భయపడేవారు. కానీ, ఆయన నన్ను పిలిచి పద్యాలు పాడమని అడిగేవారు.

‘జయం’ సినిమా తర్వాత మీ ఊరికి వెళ్తే మీకు ఏమనిపించింది?
సుమన్‌శెట్టి: ఆ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. మా నాన్న షాపులో కూర్చొంటే, అందరూ నన్ను చూడటానికి వచ్చేవాళ్లు. అప్పుడు మా నాన్న ‘అరేయ్‌! షాపునకు వచ్చేవాళ్లు కొనడానికి రావడం లేదు. నిన్ను చూడటానికి వస్తున్నారు. దయచేసి షాపులో కూర్చొవద్దు’ అని అన్నారు.

తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటించినట్లు ఉన్నారు కదా!
సుమన్‌శెట్టి: అవును! ‘జయం’ చూసి అక్కడ దర్శక-నిర్మాతలు అవకాశాలు ఇచ్చారు. తెలుగులో నేను చేసిన పాత్రకు చాలామందిని పరిశీలించారు. కానీ, ఎవరూ కుదరక తేజగారికి ఫోన్‌ చేసి, ‘మీ సినిమాలో చేసిన కుర్రాడిని పంపుతారా’ అని అడిగారు. అలా అక్కడ కూడా ఆలీబాబా పాత్రలో చేశా. తమిళ సంభాషణలు తెలుగులో రాసి చెప్పేవాడిని. కొన్నిసార్లు తెలుగు డైలాగ్‌లు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి(నవ్వులు) ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు వచ్చింది. ‘7/జీ బృందావన కాలనీ’ డబ్బింగ్‌ సినిమా కావడం, పదిరోజులు ఆలస్యంగా తెలుగులో విడుదల కావడంతో ఆ సినిమాకు అవార్డు రాలేదు. ఇప్పటివరకూ దాదాపు 350 సినిమాల్లో నటించా.

మీ ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?

సుమన్‌శెట్టి: నాకు ప్రేమ ఏంటండీ! (నవ్వులు)
ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పాప నాలుగో తరగతి చదువుతోంది. బాబు 1వ తరగతి చదువుతున్నాడు.


ఇటీవల మీ నాన్న చనిపోయారట కదా!

సుమన్‌శెట్టి: అవును! నేను ఆర్థికంగా కాస్త మంచిగా ఉన్నానంటే మా తండ్రిగారే కారణం. ఎందుకంటే నా వయసుకు నాకు వచ్చే సంపాదనకు దాన్ని ఎలా మేనేజ్‌ చేసుకోవాలో తెలియదు. జల్సా చేయడానికే అందరూ ఇష్టపడతారు. అది సహజం. కానీ, మా నాన్నగారి వల్లే ఇలా ఉన్నా.

మీకు ఏ వయసులో వివాహం అయింది?
సుభాషిణి: నాకు 14వ ఏటనే పెళ్లి చేశారు. నాకు అక్క, ఒక తమ్ముడు. అక్క తిరుపతి దేవస్థానంలో హరికథలు చెప్పేవారు. చాలా ఫేమస్‌. రావుగోపాలరావుగారి సతీమణి అక్కకు గురువు. మైసూరారెడ్డిగారు, చంద్రబాబునాయుడిగారి ఇంట్లో భారతం చెప్పేది. నాకు హరికథలు నేర్పించాలని చాలా తాపత్రయపడేది. నాకేమో నచ్చేది కాదు. ఒక ప్రమాదంలో ఆమె చనిపోయారు. ఆ తర్వాతే నేను సినిమాల్లోకి వచ్చా. అసలు నా భర్త మా అక్కను చేసుకోవాల్సింది. కానీ, ఆమెకు ఇష్టం లేకపోవడంతో నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన వ్యవసాయం చేస్తూ ఉండేవారు. తెదేపా భీమవరం ప్రెసిడెంట్‌గా చేసేవారు. నాటకాలంటే పిచ్చి. అలా ఇద్దరం కొన్నాళ్లు నాటకాలు కూడా వేశాం.

మీ జీవితంలో అమ్మ, అక్కల స్థానం ఏంటి?
సుభాషిణి: మా అమ్మ నాకు జన్మనిస్తే, అక్క పునర్జన్మ ఇచ్చింది. ఆమె దేవుడి కంటే ఎక్కువ. మానాన్న చనిపోతే అక్కే మమ్మల్ని పోషించింది. ప్రస్తుతం ఆమె ఇక్కడ లేరు. మా కోసం చాలా రోజులు పెళ్లి చేసుకోలేదు.

ఇప్పటికీ దర్శకుడు తేజను కలుస్తారా?
సుమన్‌శెట్టి: ఆయన పుట్టినరోజుకి తప్పకుండా ఫోన్‌ చేస్తా. ఇప్పటికీ ఆయనంటే నాకు భయమే. తమిళ ‘జయం’కు కూడా నాకు మంచిపేరు వచ్చింది. అందరూ ‘సెంథిల్‌’ అని పిలిచేవారు.

నీకూ-గీతాసింగ్‌కు మధ్య ఏదో ఉందని రూమర్‌ విన్నాం!
సుమన్‌శెట్టి: అది మీరే చెప్పారు కదా రూమర్‌ అని. తను నాకు అక్క అవుతుంది. మేమిద్దరం కలిసి సినిమాలు, ఈవెంట్లు ఎక్కువ చేసేవాళ్లం. దాంతో అలా రాసిపారేశారు. నాకు యాక్టింగ్‌ తప్ప ఏదీ రాదు. మేము కళామతల్లిని నమ్ముకున్నాం. అవకాశాలు ఇస్తే తప్పకుండా ఇంకా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.