వేసవిలో..వేడి..వేడిగా
వినోదం అంటే వేసవి...
వేసవి అంటే వినోదం!

సెలవుల్ని ఆస్వాదించడానికే అన్నట్టుగా కొత్త సినిమాలు వరుస కడుతుంటాయి. కొన్నేళ్లుగా ఐపీఎల్‌ క్రికెట్‌ కూడా వేసవి వినోదంలో ఓ భాగమైపోయింది. క్రికెట్‌ ప్రియులకి కావల్సినంత కాలక్షేపాన్నిస్తోంది. యువతరం వేసవి వచ్చిందంటే పగలంతా సినిమాల కబుర్లతోనూ... సాయంత్రం కాగానే ఐపీఎల్‌ మ్యాచ్‌ల హంగామాతోనూ గడుపుతుంటారు. మొదట్లో ఐపీఎల్‌ జోరు చూసి సినిమా పరిశ్రమ భయపడింది. కానీ తర్వాత అటు క్రికెట్టు... ఇటు సినిమా రెండూ పోటీపడి ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏటా ఐపీఎల్‌ కంటే ముందే వేసవి సినిమాల హంగామా మొదలయ్యేది. స్టార్‌ కథానాయకులు ఒకరి వెంట మరొకరు బాక్సాఫీసు ముందుకొచ్చేవారు. ఈసారి మాత్రం వేసవి సినిమాలు ఊపందుకోవడానికి కాస్త సమయం పట్టేలాగే కనిపిస్తోంది. కల్యాణ్‌రామ్‌ తన ‘118’తో వేసవి హంగామాకి తెరలేపినప్పటికీ... ఆ హుషారు అట్టే కొనసాగలేదు. రెండు మూడు వారాలుగా చిన్న సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈలోగా ఐపీఎల్‌ మొదలై ప్రేక్షకుల్ని బుల్లితెరకు కట్టేసుకుంది. మరికొద్దిమందేమో ఎన్నికల సిత్రాల్ని చూస్తూ గడుపుతున్నారు. అందుకే సినిమా పరిశ్రమ కూడా వేసవి సందడికి వేగంగా సన్నద్ధమవుతోంది.

ఈసారి అగ్ర కథానాయకుల చిత్రాలు తక్కువే కావొచ్చేమో కానీ... అంచనాల మధ్య విడుదలయ్యే సినిమాలకి మాత్రం కొదవేం లేదు. నిహారిక కొణిదెల ప్రధాన పాత్రధారిగా నటించిన ‘సూర్యకాంతం’ శుక్రవారం విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కూడా శుక్రవారమే విడుదలవుతోంది. ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే కావల్సినంత ప్రచారాన్ని మూటగట్టుకొంది. ఈ రెండు చిత్రాల కంటే ఒక రోజు ముందే నయనతార ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన ‘ఐరా’ విడుదలవుతోంది.వేసవి అంటే వారం వారం కొత్త సినిమాల సందడే. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మరుసటి వారమే ‘మజిలీ’ విడుదలవుతోంది. పెళ్లి తర్వాత నాగచైతన్య - సమంత కలిసి నటించిన తొలి చిత్రమిది. సినిమాలో కూడా భార్యాభర్తలుగానే నటించారు. శివ నిర్వాణ దర్శకుడు. మొదట ఈ చిత్రం ఏప్రిల్‌ 5న విడుదలవుతుందో లేదో అనుకొన్నారు. కానీ చిత్రబృందం మాత్రం విడుదల తేదీ పక్కా అని ప్రకటించింది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్ని కూడా మొదలుపెట్టింది. ‘మజిలీ’ వచ్చిన మరుసటి రోజే సుమంత్‌ అశ్విన్‌, నందిత శ్వేత నటించిన ‘ప్రేమకథా చిత్రమ్‌ 2’ విడుదలవుతోంది.

వారం వ్యవధిలో నాని... తేజ్‌: సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘చిత్రలహరి’ ఏప్రిల్‌ 12న విడుదలవుతోంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. నాని ‘జెర్సీ’ ఏప్రిల్‌ 19న విడుదలవుతోంది. నాని క్రికెటర్‌గా నటించిన చిత్రమిది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. కథా నేపథ్యం, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఏప్రిల్‌ 19నే లారెన్స్‌ ‘కాంచన 3’ కూడా విడుదలవుతోంది.

మేలో మరిన్ని
సినీ వేసవికి కీలకమైన నెల మే. ఏప్రిల్‌లో పరీక్షల హడావుడి ఉంటుంది కానీ.. మే నెలలో పూర్తిగా సెలవుల్ని ఆస్వాదించే అవకాశం విద్యార్థులకి దొరుకుతుంది. అందుకే ఆ నెలలో అగ్ర కథానాయకుల చిత్రాలు పెద్దఎత్తున విడుదలవుతుంటాయి. మహేష్‌ బాబు చిత్రం ‘మహర్షి’ మే 9న విడుదలవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. అశ్వనీదత్‌, దిల్‌రాజు, పీవీపీ కలిసి నిర్మించారు. నా కెరీర్‌లోనే పెద్ద సినిమా అవుతుందని మహేష్‌ ఇటీవలే ప్రకటించారు. సూర్య కథానాయకుడిగా నటించిన ‘ఎన్‌.జి.కె’ మే 31న విడుదలవుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. అదే రోజు విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. మే 1న నిఖిల్‌ ‘అర్జున్‌ సురవరం’, శ్రీవిష్ణు ‘బ్రోచేవారెవరురా’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. విడుదలయ్యే సినిమాల ఫలితాల్నిబట్టి మరికొన్ని పరిమిత వ్యయంతో తెరకెక్కిన చిత్రాలు ఈ నెలలో వచ్చే అవకాశాలున్నాయి. ఎన్నికల హడావుడి, ఐపీఎల్‌ సందడి కొనసాగే అవకాశాలున్నప్పటికీ చిత్ర పరిశ్రమ ఎప్పట్లాగే ఉత్సాహంగా వేసవి సినిమాల్ని ముస్తాబు చేస్తోంది. ఆయా చిత్రబృందాలు ప్రచార కార్య క్రమాలను ముమ్మరం చేశాయి. పాటల్ని, ప్రచార చిత్రాల్ని వరుసగా విడుదల చేస్తున్నాయి. మరి వేసవి సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.