2021 వేసవి వేడి ఇప్పుడే మొదలైంది!
సంక్రాంతి సీజన్‌ నిన్న మొన్నే పూర్తయినట్టుంది. పెద్ద పండగకొచ్చిన సినిమాలు... అవి సాధించిన వసూళ్ల గురించి అభిమానులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అప్పుడే వచ్చే సంక్రాంతి సినీ సందడి గురించి చర్చ మొదలైంది.కారణం 2021 సంక్రాంతి బరిలో రాజమౌళి, శంకర్‌ల సినిమాలు దిగుతుండడమే. పక్కా టార్గెట్‌తో ఆ రెండు చిత్రబృందాలు శ్రమిస్తున్నాయి.


ఇక వేసవికొచ్చేద్దాం....
ఇప్పుడిప్పుడే వేడి మొదలైంది. రాబోయే మండే ఎండల్ని ఎలా ఎదుర్కోవాలా అనే ఆలోచనలు మొదలైపోయాయి. కానీ చిత్ర పరిశ్రమలో మాత్రం 2021 వేసవి వినోదాల గురించి చర్చ మొదలైంది. అగ్ర కథానాయకుల చిత్రాలన్నీ ఆ సీజన్‌నే లక్ష్యంగా చేసుకుని విడుదల తేదీల్ని ప్రకటించడమే అందుకు కారణం. చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్‌బాబు చిత్రాలు వేసవే లక్ష్యంగా ముస్తాబవుతున్నాయి. ఇదే వరసలో కథానాయకులు వస్తే వచ్చే ఏడాది ఆరంభం నుంచే బాక్సాఫీసు హోరెత్తిపోవడం ఖాయం.


ఎన్టీఆర్‌
కథానాయకుడిగా నటిస్తున్న 30వ సినిమాని ఇటీవలే ప్రకటించారు. వచ్చే వేసవికి అంటూ ప్రకటనతో పాటే విడుదల తేదీని కూడా చెప్పేశారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ‘అరవింద సమేత’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న రెండో సినిమా. ప్రస్తుతం స్క్రిప్టుకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సెట్‌ నుంచి బయటికి రాగానే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇతర తారల ఎంపికపై కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.


ప్రభాస్‌
కథానాయకుడిగా..రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా వచ్చే ఏడాది వేసవిలోనే రాబోతోంది. ఆ విషయాన్ని నిర్మాత కృష్ణంరాజు ఇదివరకే ప్రకటించారు. ఈ ఏడాది చివరికి చిత్రీకరణ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన సెట్స్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇది ప్రేమకథతో రూపొందుతున్న చిత్రమని సమాచారం. ఒక ప్రత్యేకమైన ప్రపంచంలో జరిగే కథ అని ప్రచారం సాగుతోంది.


చిరంజీవి
- కొరటాల శివ కలయికలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావల్సిన సినిమా ఇది. చిత్రబృందం లక్ష్యం కూడా అదే. అయితే ఇందులో రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఆయన ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రీకరణ పూర్తి చేసుకుని, ఈ సినిమా కోసం ఎప్పుడు రంగంలోకి దిగుతారనే విషయంపైనే విడుదల తేదీ ఆధారపడి ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘ఆచార్య’ అనే టైటిల్‌ అనుకుంటున్న ఈ సినిమా వచ్చే వేసవిలోనే విడుదల కావొచ్చనేది పరిశ్రమ వర్గాల మాట. చిత్రీకరణలో మరింత వేగం పెరిగితే మాత్రం ఈ ఏడాదే రావొచ్చు. మహేష్‌బాబు కూడా వచ్చే ఏడాది వేసవిలోనే పలకరించే అవకాశాలున్నాయి. ఆయన తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుంది. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే ఈ వేసవిలోనే చిత్రాన్ని మొదలుపెడతారు. మొత్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో అగ్ర హీరోల సినిమాలతో... తెలుగు సినిమా బాక్సాఫీసు దగ్గర సందడి నెలకొనడం ఖాయం. అగ్ర హీరోల సినిమాల విడుదలంటే కచ్చితంగా ఒకదానికొకటి విరామం ఉండాల్సిందే. లేదంటే వసూళ్లపై ప్రభావం పడుతుంది. అయితే వేసవి అంతా సీజనే ఉంటుంది కాబట్టి దర్శకనిర్మాతలు, హీరోలు ధైర్యంగా తమ సినిమాల్ని విడుదల చేస్తుంటారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.