మండుటెండల్లో.. సెట్లో చెమటలు చిందిస్తూ!!
సూర్యుడు ఉగ్రతాండవం చేస్తున్నాడు. పగలు సెగలు కక్కుతోంది. ఎండలో కాసేపు నిల్చోవాలన్నా అగ్ని పరీక్షే. కానీ తప్పదు. ఆఫీసులు, పనులు వాయిదా వేసుకోలేం. పొట్టకూటి కోసం ఇవన్నీ భరించాల్సిందే. కానీ కథానాయకులకు అలా ఉండదు. ‘ఈరోజు షూటింగ్‌ లేదు’ అంటే పేకప్‌ చెప్పేయాల్సిందే. వాన పడినా, ఎండ మండినా ‘షూటింగులకు సెలవు’ ఇచ్చేసినట్టే. వేసవిలో మన కథానాయకులు విహార యాత్రల ప్రణాళికల్లో ఉంటారు. రెండు మూడు వారాలు చల్లని ప్రదేశాల్లో సేద తీరుదామనుకుంటారు. గ్లామర్‌ కాపాడుకోవాలంటే అవన్నీ తప్పనిసరి కూడా. అందుకే హీరోల వేసవి షెడ్యూల్‌ ముందే ఫిక్సయిపోతుంది. మే, జూన్‌లలో ‘వీళ్లు దొరకరు’ అని దర్శకులు, నిర్మాతలు కూడా గట్టిగా ఫిక్సపోయితుంటారు. కానీ ఈసారి అలా లేదు. మన కథానాయకులు మండుటెండల్నీ లెక్క చేయడం లేదు. అభిమానులకు వినోదం పంచాలన్న లక్ష్యంతో.. సెలవలు తీసుకోకుండా పని చేస్తున్నారు. సెట్లోనే చెమటలు కక్కుతున్నారు.


నాగార్జునకి కుటుంబంతో గడపడం అంటే మహా సరదా. వీలున్నప్పుడల్లా ఫ్యామిలీ ట్రిప్‌ వేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఆయన సినిమాకే ప్రాధాన్యం ఇచ్చారు. మండుటెండల్లో ఆయన ‘మన్మథ’ బాణాల్ని సంధిస్తున్నారు. ‘మన్మథుడు 2’ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తవుతుంది. అందుకే సెలవుల్ని త్యాగం చేసి, పనిపై శ్రద్ధ పెట్టారు. ఈ విషయంలో వెంకటేష్‌ కాస్త తెలివితేటల్ని చూపించారు. ఇటు పని, అటు చల్లదనం రెండూ ఉండేలా చూసుకున్నారు. అందుకే ‘వెంకీ మామ’ షూటింగ్‌ని కశ్మీర్‌లో ప్లాన్‌ చేశారు. ప్రస్తుతం అక్కడే చిత్రీకరణ జరుగుతోంది. చిరంజీవికి మాత్రం ఆ అవకాశం లేదు. ‘సైరా’ కోసం ఆయన శ్రమిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అక్టోబరులో ‘సైరా’ని విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. జూన్‌ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలెట్టాలని చూస్తున్నారు. అందుకే వేసవి విడిదికి వెళ్లడం కుదరడం లేదు.


అల్లు అర్జున్‌ మాత్రం కాస్త ముందుగానే వేసవి విడిదికి వెళ్లొచ్చేశారు. త్రివిక్రమ్‌ సినిమాకి కాస్త విరామం దొరకడంతో ఆయన తన కుటుంబంతో సహా విహార యాత్రకు వెళ్లొచ్చేశారు. ఇప్పుడు తన దృష్టంతా సినిమాపైనే. ఈవారంలోనే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలు కానుంది. అక్కడి నుంచి ఓ నెల రోజుల పాటు ఈ సినిమా కోసం శ్రమించాల్సిందే. ప్రభాస్‌ ‘సాహో’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అందుకే.. పనులు మరింత వేగవంతంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ అయితే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’తో కుస్తీ పడుతున్నారు. చరణ్‌ అనుకోకుండా గాయపడడం వల్ల రాజమౌళి సినిమాకి బ్రేక్‌ పడింది. గాయం నుంచి కోలుకోవడంతో చిత్రీకరణ తిరిగి మొదలెట్టారు. ఇటు చరణ్‌కీ, ఇటు ఎన్టీఆర్‌కి సెలవలు దొరకడం కష్టం.


కథానాయకుల క్యాలెండర్‌ బాగా బిజీగా ఉంది. కాల్షీట్లన్నీ ముందే ఇచ్చేశారు. మరోవైపు దర్శకులు కొత్త కథలు వినిపించడానికి రెడీ అయిపోతున్నారు. ఇలాంటి తరుణంలో.. వేసవి విడుదలకు, విరామాలకూ చోటు లేదు. పైగా ఏడాదికి ఒక్క సినిమాతోనే సరిపెట్టేసే రోజులు కావివి. కనీసం రెండు సినిమాలైనా చేయాల్సిందే. అందుకే పనిలోనే విశ్రాంతి వెదుక్కుంటూ ‘సెలవు’కు సెలవు ప్రకటిస్తున్నారు. చిత్రసీమకూ అది మంచిదే కదా!


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.