కరోనా ప్రభావం.. రూ.కోట్లలో నష్టం!

సినిమా వ్యాపారానికి అతి పెద్ద సీజన్‌ వేసవి. మార్చి మొదలు మే ఆఖరు వరకు అగ్ర హీరోల సినిమాలు వరుస కడుతుంటాయి. సెలవుల సమయం కావడంతో పిల్లలు, పెద్దలు వినోదం కోసం సినిమాను ఆశ్రయిస్తుంటారు. దీంతో బాక్సాఫీసు సందడిగా మారేది. సుమారు 40 సినిమాల వరకు వేసవిలో వస్తుంటాయి. ఇంతటి కీలకసీజన్‌కి కరోనా గండికొట్టింది. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పట్లో తెరిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఓ 20 సినిమాలు ఈ వేసవి విడుదలకు సిద్ధమైనా.. కరోనా ప్రభావంతో ప్రేక్షకులు వేసవి వినోదానికి దూరమయ్యారు.వేసవి వినోదాల బరిలో నిలవడానికి పెద్ద చిత్రాలతో పాటు కొన్ని చిన్న సినిమాలూ సిద్ధమైనా కరోనా ప్రభావంతో ఆగిపోయాయి. నాని - సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘వి’, అనుష్క ‘నిశ్శబ్దం’, రానా.. ‘అరణ్య’, రామ్‌ చిత్రం ‘రెడ్‌’తో పాటు రాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’, ప్రదీప్‌ - అమృత అయ్యర్‌ జంటగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’, వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’, కీర్తిసురేష్‌ ‘మిస్‌ ఇండియా’... ఇలా ఆసక్తికరమైన చిత్రాలన్నీ మార్చిలోనే విడుదలకు ముస్తాబయ్యాయి. వీటిలో కొన్ని మినహా మిగతావన్నీ దాదాపు రూ.30 కోట్ల పైచిలుకు వ్యయంతో తెరకెక్కినవే. అవన్నీ కరోనా ప్రభావంతో విడుదలకి నోచుకోకుండా ఆగిపోయాయి. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూసివేయడంతో మొదట సినిమాల విడుదల ఆగిపోయింది. ఆ తర్వాత వేసవే లక్ష్యంగా షూటింగ్‌ జరుపుకుంటున్న సినిమాలన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’, వెంకటేష్‌ ‘నారప్ప’, నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’, రవితేజ ‘క్రాక్‌’, సాయితేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటరు’, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’తో పాటు ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’, ‘శ్రీకారం’...ఇవన్నీ ఈ వేసవికి వస్తాయనుకున్న చిత్రాలే. వీటిలో రూ.50కోట్ల పై చిలుకు బడ్జెట్లతో ముస్తాబవుతున్నవీ ఉన్నాయి. ఈ వేసవిలో సుమారు రూ.600 కోట్ల వ్యాపారం జరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. కానీ కరోనాతో ఈ వేసవి సీజన్‌ తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ థియేటర్లు ప్రారంభమయ్యాకా వేసవి సినిమాలన్నీ వరుస కట్టబోతున్నాయి. అది ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కొన్ని చిన్న చిత్రాలు ఓటీటీల వైపు చూస్తున్నాయి.


‘‘చిత్ర పరిశ్రమలో సంక్రాంతి తర్వాత వేసవికే ప్రాధాన్యత. ఈ సీజన్‌లో ఏ చిత్ర పరిశ్రమకైనా అత్యధిక రాబడి వస్తుంది. ఈసారి చిన్నాపెద్దా కలిపి దాదాపు 40 చిత్రాల విడుదల ఆగినట్టే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1800 థియేటర్లు ఉన్నాయి. వారానికి ఒక్కో థియేటర్‌కు సగటున రూ.3లక్షలు నష్టం వాటిల్లుతోంది. వేసవిలో ఆ నష్టం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒకరకంగా మిగిలిన అన్ని పరిశ్రమలతో పోల్చితే ఎక్కువ నష్టం చిత్రసీమకే’’.

- టి.ప్రసన్న కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి.
‘‘ఈ కరోనా ప్రభావం నుంచి గట్టెక్కి చిత్రసీమ సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సమయమే పట్టొచ్చు. వేసవి సీజనే కాదు.. ఈ సంవత్సరం పూర్తిగా కోల్పోయినట్లే. జనవరి వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చు. ప్రేక్షకులు వందల మంది వచ్చినా ఎటువంటి భయాలు ఉండని పరిస్థితి వచ్చే వరకూ థియేటర్స్‌ పరిస్థితి మారదు. చిత్ర పరిశ్రమ, థియేటర్లు కోలుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుంది. పెద్ద చిత్రాలు ప్రేక్షకులు నిర్భయంగా థియేటర్లకు వచ్చేవరకు వేచిచూడాల్సిందే’’.

- పి.రామ్మోహన్‌ రావు, నిర్మాత, టి.యస్‌.ఎఫ్‌.డి.సి ఛైర్మన్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.