ప్రచారమంతా పేచీలమయం!
సినిమా చేయడం ఒకెత్తు... దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం మరో ఎత్తు. ఎలాగైనా సినిమాను ప్రేక్షకుల దృష్టిలో పడేలా చేయాలి. అప్పుడే టికెట్లు తెగేది. ఇది జరగాలంటే... సరైన ప్రచారమే మార్గం. అందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్‌ని కూడా కేటాయిస్తుంటారు నిర్మాతలు. తారలు కూడా సినిమాని ప్రమోషన్‌ చేయడానికి కలిసొస్తుంటారు. ప్రత్యేకంగా కొన్ని కాల్షీట్లు కూడా కేటాయిస్తుంటారు. అయితే ఈ ప్రచార పర్వం కొన్నిసార్లు పేచీలమయంగా మారిపోతోంది. తారలు మేం రాలేమంటూ మొండికేస్తుంటారు. రావాల్సిందే అని నిర్మాతలు డిమాండ్‌ చేస్తుంటారు. ప్రస్తుతం ప్రచారంలో తారలు పాల్గొంటున్న తీరు గురించి దక్షిణాది చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చే నడుస్తోంది.


ఈమధ్యే తమిళంలో అగ్ర కథానాయిక త్రిష ప్రచారానికి హాజరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మాత శివ. ప్రచారానికి రాకపోతే సదరు కథానాయిక తీసుకున్న పారితోషికంలో కొంత భాగం వెనక్కిచ్చేయాల్సిందే అని డిమాండ్‌ కూడా చేశారాయన. తెలుగులో ఇటీవల విడుదలైన ‘అశ్వథ్థామ’ ప్రచారంలో కథానాయిక మెహరీన్‌ పాల్గొనకపోవడం ఆ చిత్ర నిర్మాతకి ఆగ్రహం తెప్పించింది. దీనిపై సదరు కథానాయిక కూడా సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. తెలుగులో ఈమధ్య ఓ కథానాయకుడు తన సినిమా ప్రచార కార్యక్రమాలపై సరిగ్గా పాల్గొనలేదని నిర్మాత గుర్రుగా ఉన్నారు.

- ఇలా ఎక్కడో ఒక చోట... ఎవరో ఒకరు ప్రచారం విషయంలో పేచీలు పడటం సర్వసాధారణంగా మారిపోయింది. నిజానికి అగ్ర కథానాయకుల చిత్రాలకి ప్రచారం అంతగా అవసరం లేదు. కథానాయకుల ఇమేజ్‌తో, అభిమానుల అండతో సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోతుంటుంది. మరిన్ని వసూళ్లు రాబట్టుకునేందుకు కథానాయకులు కొంచెం చొరవ తీసుకుని ప్రచార కార్యక్రమాల్ని ఉద్ధృతం చేస్తుంటారు. చిన్న చిత్రాలు, అగ్ర తారలు లేని చిత్రాలకి మాత్రం ప్రచారం చాలా ముఖ్యం. అందులోని కంటెంట్‌తో ఆసక్తిని రేకెత్తిస్తూనో, ఇతరత్రా ప్రయత్నాలతోనో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాల్సిందే. చిత్రబృందాలు ఆ విషయంలో పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతుంటాయి.

దానికీ ఓ లెక్క
సినిమాలో నటించడం వరకే కాదు, ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది. ప్రచారంలో పాల్గొనే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ముందే తారలకి పారితోషికాలు ఇస్తుంటారు. అది ఇష్టం లేని తారలు మొదట్లోనే మేం రామంటూ చెప్పేస్తుంటారు. దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార నిర్మాతలతో కుదుర్చుకునే ఒప్పందంలోనే ఆవిషయాన్ని స్పష్టం చేస్తుంటారు. అలాంటి నాయికలతో చిత్రీకరణకే పరిమితం అవుతుంటారు నిర్మాతలు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పి, ఆ తర్వాత చేతులెత్తేసినప్పుడే పేచీలు మొదలవుతుంటాయి. చాలాసార్లు పారితోషికంలో కొంతభాగాన్ని అట్టిపెట్టుకుంటుంటారు నిర్మాతలు. ప్రచార కార్యక్రమాలు పూర్తయ్యాకగానీ ఆ మొత్తాన్ని ఇవ్వరు. హీరోలు ఓ సినిమా పూర్తయితే కానీ మరొక సినిమాని ప్రారంభించరు కాబట్టి... దాదాపుగా ప్రచారానికి అందుబాటులోనే ఉంటారు. నాయికలకి మాత్రం పలు సినిమాలు చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్లు సమయం కేటాయించడం కష్టం. దాంతో వివాదాలు తలెత్తుతుంటాయి.

ఖర్చులు భారమవుతున్నాయా?
ప్రచారం విషయంలో ఈమధ్య బయటికొచ్చిన పేచీల్లో ఖర్చుల ప్రస్తావన కూడా వెలుగు చూసింది. కథానాయికల రోజువారీ ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని, సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడు ఆ ఖర్చులు భరించక తప్పదు కానీ... ప్రచార కార్యక్రమాల సమయంలోనూ వాటి భారం మోయడం కష్టమవుతోందని వాపోతున్నారు నిర్మాతలు. సహాయకులు, మేకప్‌మెన్‌లు, కాస్ట్యూమ్‌ డిజైనర్లు... ఇలా ఆరేడుగురు కథానాయికతో పాటు ఉంటారు. వాళ్ల రోజువారీ జీతభత్యాల్ని, బస ఏర్పాట్లని నిర్మాతలే భరించాల్సి వస్తోంది. అగ్ర కథానాయిక సిబ్బంది కోసం అలా రోజుకి రూ.70 వేల నుంచి రూ.1 లక్ష వరకు భరించాల్సి ఉంటుంది. ఈ ఖర్చుల విషయంలో ఇటీవల తమిళ నిర్మాత కె.రాజన్‌ ముగ్గురు అగ్ర కథానాయికలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారితోషికం విషయంలో కథానాయకులతో పోలిస్తే మాకు తక్కువ మొత్తమే చెల్లిస్తున్నారు కదా, ఖర్చులు కూడా మేమే భరిస్తే ఏం మిగులుతుందనేది కొంత మంది కథానాయికల మాట. ఇలా అటు నిర్మాతలు ఇటు నాయికలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.

నిర్మాతలు నాపై నమ్మకంతో సినిమా చేస్తుంటారు. అలాంటప్పుడు నేను ప్రచార బాధ్యతని తీసుకోవాల్సిందే. ప్రచారం వల్ల పదిమంది టికెట్లు కొంటారంటే, నేను ప్రచారం చేయడానికి ఎక్కడికైనా వెళతా. సినిమా విజయవంతమయ్యాక ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికి సంకోచిస్తానేమో కానీ విడుదలకి ముందు ప్రచారం చేయడానికి మాత్రం వెనకాడను’’.

- ఇటీవల ప్రచారం గురించి అగ్ర కథానాయిక సమంత చెప్పిన మాట ఇది.

నిర్మాత కోసమే ప్రచారం అనుకునేవాళ్లే ఎక్కువ మంది. అది తప్పు. నిర్మాతకి ఆ సినిమా హిట్టయితే కాస్త డబ్బు రావొచ్చు కానీ, అందులో నటించిన తారలకి జీవితమే వస్తుంది. ప్రచారం అంటే సినిమాకే కాదు, తారలు వాళ్లని వాళ్లు ప్రమోట్‌ చేసుకున్నట్టే. సినిమానే కెరీర్‌ అనుకున్నవాళ్లు కచ్చితంగా ప్రచారం విషయంలో సహకరిస్తారు. ప్రస్తుతానికి డబ్బు వచ్చింది కదా తీసుకుందాం, కెరీర్‌ ఉంటే ఉండనీ పోతే పోనీ అనుకున్నవాళ్లు ప్రచారంపై దృష్టిపెట్టరు. తారలు ప్రచారం విషయంలో సగం బాధ్యతని తీసుకోవాల్సిందే. నిర్మాతలు కూడా ముందే వాళ్లతో ఒప్పందం కుదుర్చుకోవాలి’’.

- తమ్మారెడ్డి భరద్వాజ,
  
ప్రముఖ నిర్మాత  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.