ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క

మన భాష... మన అభిరుచులు... మన ప్రేక్షకులు... మన మార్కెట్‌...
- ఇలా పరిమితులు, హద్దుల మధ్యే తెలుగు సినిమా ప్రయాణం సాగుతుంది. మన ప్రేక్షకుల్ని మెప్పిస్తే చాలన్న దృక్కోణంలోనే సినీ రూపకర్తలు ఆలోచిస్తుంటారు. వంద రోజులు ఆడితేనో, రూ.వంద కోట్లు వసూళ్లు సాధిస్తేనో అదే గొప్పగా భావిస్తూ సంతృప్తి పడుతుంటారు. కానీ ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్నట్టుగా ‘బాహుబలి’ తర్వాత సినిమా లెక్కలన్నీ మారిపోయాయి. మన సినిమా అంత దూరం వెళ్లొచ్చా? మన సినిమాకి అంత మార్కెట్‌ ఉందా? అని ఆశ్చర్యపోయేలా చేసింది ఆ సినిమా. చిత్రసీమ సరికొత్త సాంకేతికత, ప్రమాణాలు అందిపుచ్చుకొంటున్న దశలోనే, కొత్త మార్కెట్లు తెరచుకొన్నట్టైంది. అది దర్శకనిర్మాతలకి కొత్త దారుల్ని చూపించింది. కొత్త సాంకేతికత, కొత్త మార్కెట్లే ఆలంబనగా అత్యున్నత ప్రమాణాలతో సినిమాలు తీయడంపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు సినీ రూపకర్తలు. తమిళంలోనూ అదే వరస. ఆ జోరుతో బాలీవుడ్‌ సైతం చిన్నబోతోంది. రూ.వందల కోట్ల వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో బోలెడన్ని సినిమాలు దక్షిణాదిలో రూపుదిద్దుకొంటున్నాయి.


‘సాహో’, ‘సైరా’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘హిరణ్య’.. ఈ చిత్రాలన్నీ రూ.250 కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందుతున్నవే. అన్ని చిత్రాలు బహు భాషా మార్కెట్లని లక్ష్యంగా చేసుకొని రూపుదిద్దుకొంటున్నవే. మరింత మంది నిర్మాతలు ఈ తరహా సినిమాల కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. తమిళం నుంచి కూడా ఇలాంటి చిత్రాలే రాబోతున్నాయి. విక్రమ్‌ ‘మహావీర్‌ కర్ణ’ దాదాపు రూ.300 కోట్లతో రూపొందుతోంది. కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ కూడా అధిక వ్యయంతో రూపొందుతున్న చిత్రమే. దక్షిణాది సినీ పరిశ్రమ పెంచుకొంటున్న ప్రమాణాలకి, స్థాయికి అద్దంపట్టే సినిమాలే ఇవన్నీ. అతి పెద్ద పరిశ్రమ అయిన హిందీలో కూడా ఈ స్థాయి చిత్రాలు తెరకెక్కడం లేదు.


సాంకేతికతని అందిపుచ్చుకోవడంలో తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ముందుంటుంది. కాకపోతే ఇదివరకు మార్కెట్‌ పరిధిని దృష్టిలో ఉంచుకొనే సాంకేతికతని వినియోగించాల్సి వచ్చేది. ఆ పరిమితుల్లోనే అప్పుడప్పుడు నాణ్యమైన చిత్రాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకనిర్మాతలు. ఇతర పరిశ్రమలకి ఏమాత్రం తీసిపోమని చాటి చెప్పారు. ఇప్పుడు మార్కెట్‌ పరంగా, బడ్జెట్‌ పరంగా పరిమితులు తొలగిపోవడంతో... భారీ చిత్రాల హంగామా మొదలైంది. ఒకప్పుడు బాలీవుడ్‌ స్థాయి చిత్రాన్ని మేం తీశామనే మాటలు ఇక్కడ వినిపించేవి. కానీ ఇప్పుడు బాలీవుడ్‌ వర్గాలే తెలుగు సినిమాల గురించి ప్రస్తావిస్తుండడం విశేషం. ‘‘మన ప్రేక్షకులంతా టీవీలకే పరిమితమయ్యారు. వాళ్లని థియేటర్‌కి రప్పించడమే అతి పెద్ద విజయం’’ అనే అభిప్రాయాలు ‘బాహుబలి’ ముందు వరకు వినిపించాయి. అయితే కొత్త అనుభవాన్నిస్తే తప్పకుండా ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడని ‘బాహుబలి’ చిత్రాలు నిరూపించాయి. టీవీలకి పరిమితమైన ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించడమే కాకుండా... ఇతర భాషల ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాలకి ఆకర్షితమయ్యేలా చేశాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలపై అంచనాలు ఏర్పడుతున్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టే మరిన్ని హంగులతో, నాణ్యతతో చిత్రాలు రూపొందుతున్నాయి.

 బాండ్‌ సినిమాల తరహాలో

ప్ర
భాస్‌కి ‘బాహుబలి’ చిత్రాలతో జాతీయ స్థాయిలో మార్కెట్‌ ఏర్పడింది. ఆ స్థాయిలోనే ఆయన తదుపరి చిత్రం ‘సాహో’ రూపొందుతోంది. హాలీవుడ్‌లో తెరకెక్కే బాండ్‌ చిత్రాల తరహాలో, లైవ్‌ యాక్షన్‌ ఘట్టాలతో, ఛేజింగ్‌లతో ‘సాహో’ తెరకెక్కుతోంది. సుజీత్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రూ.250 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం బడ్జెట్‌ మరింత పెరగొచ్చని సమాచారం. ‘బాహుబలి’ చిత్రాలతోనే మార్కెట్‌ పరిధిని విస్తృతం చేసుకున్న యువ కథానాయకుడు రానా ‘హిరణ్య’ పేరుతో అంతర్జాతీయ స్థాయి చిత్రం చేస్తున్నారు. గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉంది. చారిత్రక గాథతో రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ లక్ష్యం కూడా జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే. అందుకు తగ్గ తారాబలం కూడా చిత్రానికి ఉంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకుడు. నయనతార కథానాయిక. ‘బాహుబలి’ తర్వాత ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథా నాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌ ప్రధానంగా సాగుతుందని సమాచారం. మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణాది, హిందీ నటులతో ‘రామాయణ’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు అల్లు అరవింద్‌ మరికొద్దిమంది నిర్మాతలతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకి రూ.500 కోట్లపైనే ఖర్చు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రాల ప్రభావంతోనే తమిళంలోనూ రూ.300 కోట్ల వ్యయంతో ‘మహావీర్‌ కర్ణ’ రూపొందుతోంది. విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ‘‘ప్రేక్షకుల అభిరుచులు మారాయి. ఇన్నాళ్లూ చిత్ర పరిశ్రమ ఒక రకమైన కమర్షియాలిటీకి అలవాటు పడి సినిమాలు చేసింది. రాజమౌళి, శంకర్‌లాంటి కొద్దిమంది దర్శకులు పరిధిని దాటి ఆలోచించారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలున్న సినిమాలు తీశారు. అలా ఆలోచించినప్పుడే కొత్త సాంకేతికత వస్తుంది. ప్రేక్షకులు కూడా కొత్త అనుభూతికి గురవుతారు. థియేటర్లకి వచ్చే ప్రేక్షకుల శాతం ఇంకా తక్కువగానే ఉంది. అది పెరగాలంటే మరిన్ని నాణ్యమైన సినిమాలు రూపుదిద్దుకోవాలి’’ అన్నారు ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.