పోటా పోటీగా వయసుమళ్లిన పాత్రల్లో ..
కథానాయికల పారితోషికం
కథానాయకుల వయసూ అడక్కూడదు.
ఇదే సినీ సూత్రం!
యాభై దాటిన హీరోలూ.. కాలేజీకి వెళ్తూ పదహారేళ్ల నాయికలకు సైటు కొట్టేస్తుంటారు.
బామ్మ ‘పెళ్లి చేసుకోరా మనవడా’ అని అడిగితే...
‘అప్పుడే పెళ్లేంటి బామ్మా’ అంటూ మెలికలు తిరిగిపోతుంటారు.


వయసు దాచేయడంలో హీరోలు... హీరోయిన్లతో పోటీ పడిపోతుంటారు. అభిమానులకూ అదే నచ్చేస్తుంటుంది. తమ కథానాయకుడు యువకుడిగా మారిపోతూ ఉంటే ముచ్చటపడిపోతారు. అందుకే మన హీరోలు తలకు రంగేసుకుని, ముడతల్ని మేకప్‌తో కప్పేసి ఇప్పటికీ నవ మన్మథుల్లా వెండి తెరపై మెరిసిపోతుంటారు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్‌ మారింది. ఉన్న వయసుని ఇంకా పెంచేసుకోవడం కొత్త ఫార్ములాలా మారింది. తెలుగులో తెరకెక్కుతున్న కొన్ని చిత్రాల్లో కథానాయకులు తమ వయసుని మించిన పాత్రల్ని పోషిస్తున్నారు.


ద్విపాత్రాభినయం తెలుగు తెరకు కొత్తేం కాదు. తండ్రీ కొడుకుల్లా రెండు పాత్రల్లోనూ మెరిసి అభిమానుల్ని అలరించారు మన హీరోలు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌... వీళ్లంతా ఇలాంటి పాత్రల్లో సిద్దహస్తులు. ‘స్నేహం కోసం’లో చిరు, ‘ఎదురులేని మనిషి’లో నాగ్, ‘బొబ్బిలి సింహం’లో బాలయ్య, ‘సూర్యవంశం’లో వెంకటేష్‌.. తలకు తెల్లటి రంగేసేశారు. కమల్‌హాసన్‌ గురించైతే చెప్పనవసరం లేదు. తనో ప్రయోగశాల. ఒకే సినిమాలో రకరకాల పాత్రలలో అలరించారు. ముఫ్ఫైలలో ఉన్నప్పుడే అరవై ఏళ్ల వయసున్న పాత్రలు పోషించేశారు. ‘భారతీయుడు’లో ముసలి కమల్‌హాసన్‌ని మర్చిపోలేం. అప్పట్లో కమల్‌కి వేసిన మేకప్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మరోసారి ‘భారతీయుడు 2’లో కమల్‌ అదే గెటప్పులో కనిపించబోతున్నారు. ‘భారతీయుడు’ వచ్చి దాదాపు 23 ఏళ్లయిపోయింది. అంటే ఆ లెక్కన ఈసారి ఇంకాస్త ముసలి కమల్‌ దర్శనమివ్వడం ఖాయం. మరి ఈ పాత్ర కోసం కమల్‌ కొత్తగా ఏం చేస్తారా? అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే మేకప్‌ కోసం విదేశీ నిపుణుల్ని రంగంలోకి దించినట్టు సమాచారం. విక్రమ్, సూర్యలకు గెటప్పుల మీద మమకారం ఎక్కువ. అందుకే అప్పుడప్పుడూ వయసు మీరిన పాత్రల్లో కనిపించి భళా అనిపించారు. ‘బాహుబలి’లో భళ్లాలదేవగా కనిపించిన రానా పాత్రలోనూ ముసలి ఛాయలుంటాయి.


ఇప్పుడు మన కథానాయకుల వంతు వచ్చింది. బాలకృష్ణ, రవితేజ, శర్వానంద్‌.. వీళ్లంతా వయసు మీరిన పాత్రలు పోషిస్తున్నారు. సమంత కూడా ఈ జాబితాలో చేరిపోయింది. నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’లో తన తండ్రిగా కనిపించబోతున్నారు. ఎన్టీఆర్‌ మరణించేనాటికి ఆయన వయసు 73 ఏళ్లు. బాలయ్య ప్రస్తుత వయసు 59 ఏళ్లు. అంటే ఈ పాత్ర కోసం బాలయ్య తన వయసుని పెంచేసుకుంటున్నారన్నమాట. యువ కథానాయకుడు శర్వానంద్‌ కూడా అదే చేస్తున్నాడిప్పుడు. ప్రస్తుతం సుధీర్‌వర్మ దర్శకత్వంలో శర్వా నటిస్తున్నాడు. అందులో శర్వా రెండు రకాల పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఓ పాత్ర వయసు ఇంచుమించు యాభై ఏళ్లట! ఈ పాత్రకు సంబంధించిన లుక్‌ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే రీతిలో ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఆ లుక్‌ని త్వరలో విడుదల చేయబోతున్నారు. రవితేజ కూడా ఇదే బాట పట్టారు. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రెండో పాత్రలో వృద్ధాప్య ఛాయలుంటాయట. ఆ పాత్రలో రవితేజ గెటప్‌ కూడా కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ కథానాయకులకు పోటీగా సమంత ఓ ప్రయోగం చేయబోతోంది. సమంత ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న చిత్రం ‘ఓ బేబీ’. హాలీవుడ్‌లో రూపొందిన ‘మిస్‌ గ్రానీ’కి ఇది రీమేక్‌. ఓ బామ్మ.. పదహారేళ్ల మనవరాలి వయసుకి మారిపోవడమే ఈ కథలోని ప్రత్యేకత. పైకి అమ్మాయిలా కనిపించే ‘బామ్మ’ చేసే వింతలూ విశేషాలూ ఈ సినిమాలో చూడొచ్చు.


కొత్త కథలు వస్తే పాత్రలూ కొత్తగా మారిపోతుంటాయి. పాత్రల్ని బట్టే లుక్‌ ఉంటుంది. మనవాళ్లు వైవిధ్యభరితమైన గెటప్పులలో దర్శనమిస్తున్నారంటే కొత్త కథలు వస్తున్నట్టే! తెలుగు సినిమాకి ఇంతకంటే కావల్సిందేముంది? ఈ ట్రెండ్‌ని ఇంకెంతమంది కథానాయకులు ముందుకు తీసుకెళ్తారో చూడాలి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.