ఎన్ని‘కల’లో... సినీ కళకళ!

రాజకీయాలకు, సినీరంగానికి ఉన్న అనుబంధం విడదీయలేనిది..సినీ గ్లామరే పెట్టుబడిగా రాజకీయాల్లో ఓట్లు రాబట్టుకోవడం రాజకీయ పార్టీల్లో షరా మామూలుగా మారింది. ఎన్నికల ప్రచారానికి ఊపు రావాలంటే ప్రచారం హోరెత్తిపోవాలి. అది కేవలం సినీ తారల వల్లే సాధ్యం. త్వరలో లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఓకే సారి రాబోతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు మరోసారి సినీ గ్లామర్‌ను అస్త్రంగా వదిలేందుకు అమ్ముల పొదిని సిధ్ధం చేసుకొంటున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీరించారు నటుడు ఎన్టీఆర్‌. తమిళనాడులో ఎమ్‌.జీ.ఆర్, జయలలితలు కూడా ఇదే తరహాలో ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టారు. బాలీవుడ్‌ నటులు గోవింద, తెలుగు నటుడు మోహన్‌బాబు(రాజ్యసభ), చిరంజీవిలు లోక్‌ సభలో ప్రాతినిధ్యం వహించారు. ఇలా ఎప్పటికప్పుడు ప్రజలు సినీ నటులను ప్రజాసేవ వైపు ప్రోత్సహిస్తూనే వచ్చారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో మరోసారి సినీ గ్లామర్‌ను వాడుకొనే పనిలో పడ్డాయి రాజకీయ పార్టీలు. అధికార భాజపా ఈ విషయంలో ముందంజలో ఉన్నట్లే కనిపిస్తోంది. బీజేపీ అధిష్టానం సినీ తారల్ని పార్టీలోకి లాగడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఉదాహరణకు..పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో కనీసం 22 స్థానాల్లోనైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది ఆ పార్టీ. మహాభారతం సీరియల్‌లో ద్రౌపది పాత్రతో ప్రజల్లో పాపులరైన నటి రూపాగంగూలీ. ఈమెను ఇప్పుడు భాజపా తరపున ప్రయోగించబోతున్నారు. ఇంకొకవైపు ప్రముఖ బెంగాలీ గాయకుడు బాబూల్‌ సుప్రియో ఇప్పటికే అసన్‌సోల్‌ నుంచి బీజేపీ ఎంపీగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వచ్చిన తార మౌసమీ ఛటర్జీ భాజపాలో చేరారు. గత ఏడాది అమిత్‌ షా బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ను ముంబైలో కలుసుకున్నారు. దీంతో అప్పట్లో మహారాష్ట్రలోని పుణే నుంచి ఎన్నికల బరిలో ప్రచారానికి మాధురీ వస్తోందనే వార్తలు వచ్చాయి. ఇలా కంగనా రనౌత్, ప్రీతి జింటా, పల్లవి జోషీ, రవీనా టాండన్, అక్షయ్‌ కుమార్‌లను కూడా ప్రచారంలో పాల్గొనేలా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దక్షిణాదిలో మలయాళ నటడు మోహన్‌లాల్‌ తిరువనంతపురం నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. మోహన్‌లాల్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకోవడం ఇందుకు బలాన్నిచ్చింది. కానీ ‘‘రాజకీయాల్లో చేరాలనే ఉద్దేశం లేదని, నటుడిగా సంతృప్తిగా ఉంద’’ని చెప్పారాయన. మొత్తంగా రాజకీయపార్టీలు వీలైనంత సినీ గ్లామర్‌ను వాడుకొని ఎన్నికల్లో నెగ్గేందుకు తమవంతు ప్రయత్నాల్లో ఉన్నాయి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.