ప్రచార పర్వానికి ‘గీతో’పకారం

మాట మనిషికి అలంకారమైతే... పాట.. భారతీయ సినిమాకి ప్రత్యేక ఆభరణం. ఏవో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు మినహా.. పాటల్లేని సినిమాలు మన దగ్గర అరుదుగానే ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. అసలు సినిమా టాక్‌ మొదలయ్యేది గీతాల విడుదల నుంచే. ఇవి ఆకట్టుకునేలా ఉన్నాయంటే... సినిమా సగం విజయం సాధించినట్టుగానే సంబరపడిపోతుంటారు. ఈ మధ్య విజయ శిఖరాలను అధిరోహించిన చిత్రాలు దాదాపు.. ఈ పాటల పల్లకి ఎక్కి ఊరేగినవే. ప్రస్తుతం కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల వెండితెరపై కొత్త చిత్రాల సందడి లేకున్నా.. సినీప్రియుల మదికి ఊరటనిస్తున్నవి మాత్రం కొత్త గీతాలే. ఈ గీతాస్త్రాలే రేపొద్దున థియేటర్లు తెరవగానే ప్రేక్షకుడిని తమ చిత్రానికి తీసుకొస్తాయని దర్శక, నిర్మాతలే కాదు... హీరోలూ భావిస్తున్నారు.తారలు తెరపై ఉత్సాహంగా ఆడిపాడుతుంటే చూసి... అదే స్థాయిలో స్పందిస్తూ ఆస్వాదించడం ప్రేక్షకులకు అలవాటు. వాళ్ల ఆటా పాటా నచ్చిందంటే థియేటర్లు ఈలలూ.. కేకలతో సంబరాలు చేసుకుంటాయి. అందుకే తమ చిత్రాల్లో ఆకట్టుకునే గీతాలుండేలా చూసుకుంటారు దర్శకనిర్మాతలు. హీరోలైతే ఈ విషయంలో జాగ్రత్త వహిస్తుంటారు.


కాంబినేషన్లలో సంగీత దర్శకుల పేర్లు కీలకంగా మారిపోయేదీ అందుకే మరి! ప్రచార పర్వం భుజాలకెత్తుకోవడంలో ఒకొక్కరిది ఒక్కో పంథా. కొందరు ఫస్ట్‌లుక్కులు, టైటిళ్లతోనే క్రేజు పెంచితే.. మరికొందరు టీజర్లు, ట్రైలర్లతో కిక్కిచ్చే ప్రయత్నం చేస్తుంటారు. పేర్లు ఏవైనా ప్రతి ప్రచార చిత్రం వెనుకా లక్ష్యం ఒక్కటే. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం. ఇటీవల పాటలు అందులో భాగమవుతున్నాయి. ఇప్పుడీ లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల విడుదలకు నోచుకోలేకపోయిన చిత్రాలకూ ఈ పాటలే కావాల్సినంత ప్రచారాన్ని అందిస్తున్నాయి.

ఆ చిత్ర ఫలితాలే స్ఫూర్తిగా..

పాటలు సినిమాకి ప్రచారాన్ని తీసుకురావొచ్చేమో కానీ... ఫలితాల్ని ప్రభావితం చేసేది అంతిమంగా అందులో ఉన్న విషయమే. పాటలు ఎంత బాగున్నా... కథ, కథనాలు నచ్చలేదంటే ప్రేక్షకుడి తిరస్కరణ తప్పదు. ఆ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అయితే ఇటీవల పాటలతో మురిపించి సినీ ప్రియుల్ని ఆకర్షించిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో ‘అల.. వైకుంఠపురములో’ ప్రముఖమైనది. తెలుగులో ఓ పెద్ద హీరో సినిమా విడుదలవుతుందంటే.. నెలన్నర ముందు నుంచి పాటల సందడి మొదలవుతుంది. వైకుంఠపురం బృందం మూడు నెలల ముందే తొలి గీతంగా ‘సామజవరగమన..’ను సినీ ప్రియులకు చేరువ చేసింది.

 దీని తర్వాత బయటకొచ్చిన ‘‘రాములో రాములా’’, ‘‘బుట్టబొమ్మ..’’ గీతాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక గతేడాది పాటలతోనే సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘సైరా’, ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్ర బృందాలు ఇదే మార్గంలో నడిచాయి. ఈ విజయాలిచ్చిన స్ఫూర్తితోనే ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలూ పాటల పల్లకినే ప్రచార అస్త్రాలుగా మలుచుకున్నాయి.

మిలియన్‌ మార్క్స్‌

లాక్‌డౌన్‌ కాలంలో మారుమోగిన వాటిల్లో ముందు వరుసలో ఉన్నవి ‘ఉప్పెన’, ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’, ‘వకీల్‌ సాబ్‌’, ‘వి’, ‘సోలో బ్రతుకే సో బెటరు’ చిత్రాల్లోని గీతాలు.

పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీ చిత్రం ‘వకీల్‌సాబ్‌’ను మేలో విడుదల చేద్దామనుకున్నారు. ఈ ఉద్దేశంతోనే చిత్ర ప్రచార పర్వానికి రెండు నెలలు ముందుగానే మార్చిలో మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ‘మగువా మగువా’ పాటతో శ్రీకారం చుట్టారు. తమన్‌ స్వర కల్పనలో సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన గీతమిది. ఈ చిత్రం అనుకున్న సమయానికి తెరపైకి రాలేకపోయినప్పటికీ.. ఈ చిత్ర గీతం నెట్టింట సినీ సంగీత ప్రియులకు మంచి కాలక్షేపాన్ని అందిస్తోంది. ఇప్పటికే ఈ గీతాన్ని యూట్యూబ్‌లో దాదాపు 2కోట్ల మందికి పైగా వీక్షించారు.ఇక ఇటీవల దేవిశ్రీ ప్రసాద్‌ స్వర సారథ్యం వహించిన ‘ఉప్పెన’లోని ‘‘నీ కన్ను నీలి సముద్రం..’’, ‘‘ధక్‌.. ధక్‌..’’ గీతాలు సైతం సినీప్రియులకు కావల్సినంత కాలక్షేపాన్ని, చిత్ర బృందానికి ప్రచారాన్నీ తెచ్చిపెడుతున్నాయి. ‘‘నీ కన్ను నీలి సముద్రం’’కి ఇప్పటికే నెట్టింట 7కోట్ల పైచిలుకు వీక్షణలు దక్కగా.. ‘‘ధక్‌ ధక్‌’’ గీతానికి 1కోటీ 40లక్షలకు పైగామంది వీక్షించారు.

సాయితేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటరు’లోని ‘‘నో పెళ్లి’’ గీతం నెల క్రితం విడుదలై యూట్యూబ్, టిక్‌టాక్‌ల్లో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ పాటకు నెట్టింట 10మిలియన్ల వ్యూస్‌ దక్కాయి.

రామ్‌ ‘రెడ్‌’ చిత్రంలోని ‘‘నువ్వే నువ్వే’’ 2.7 మిలియన్, ‘‘ధించక్‌’ 3.9మిలియన్‌ వ్యూస్‌తో సినీ సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి. నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ‘వి’ నుంచి ఇప్పటికే రెండు గీతాలు విడుదలయ్యాయి. వీటిలో ‘‘మనసు మారే’’ పాటను ఇప్పటికే 6మిలియన్ల మందికి పైగా వీక్షించగా.. ‘‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’’ గీతాన్ని దాదాపు 5మిలియన్ల మందికి పైగా ఆస్వాదించారు.

చిన్న చిత్రానికి పెద్ద ప్రచారం

ఏ చిత్ర పరిశ్రమలోనైనా చిన్న సినిమాలకు సరైన ప్రచారం దొరకడమన్నది కాస్త కష్టమైన విషయమే. వీటికీ పాటలు పెద్ద ప్రచారాన్ని తీసుకొస్తున్నాయి. ‘ఆర్‌ఎక్స్‌ 100’ అనే చిన్న చిత్రానికి ‘పిల్లా రా..’ అనే గీతంతో దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. నాయకానాయికలు కొత్త వాళ్లయినా.. చిత్రాన్ని తెరకెక్కించింది కొత్త దర్శకుడైనా ప్రేక్షకులను ఆ చిత్రం వైపు దృష్టి సారించేలా చేసింది ఆ పాట. ఇదంతా చేతన్‌ భరద్వాజ్‌ చేసిన సంగీత మాయాజాలం.

 ‘హుషారు’ చిత్రానికి రథన్‌ స్వరకల్పనలోని ‘ఉండిపోరాదే.. పాట ఆకట్టుకుంది. ‘దొరసాని’లోని కళ్లలో కలవరమై..., ‘కౌసల్య కృష్ణమూర్తి’లోని ముద్ద బంతి పువ్వులిలా..., ‘ఫలక్‌నుమాదాస్‌’లోని అరరే మనసా... ‘సవారి’లోని నీకన్నులు నా దిల్లులో నాటుకున్నాయే వంటి పాటలు ఆ చిత్రాలకు ఎంతో ప్రచారం తెచ్చిపెట్టాయి.

అనూప్‌ రూబెన్స్‌ సంగీత సారథ్యం వహించి, చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’లోని ‘నీలి నీలి ఆకాశం...’ పాటైతే ఓ పెద్ద సంచలనమైంది. ఒక్క పాటతో పెద్ద చిత్రాల స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాటకు ఇప్పటికే నెట్టింట 15కోట్లకు పైగా వీక్షణలు దక్కడం విశేషం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.