నాన్నతో చర్చిస్తా..కానీ నిర్ణయం నాదే
ఒక్కసారి.. కన్ను గీటి.. సన్నగా నవ్వి...
చేతిని తుపాకీలా చేసి పేల్చిందంతే...!
ప్రపంచం మొత్తం ఆమెకు ఫిదా అయిపోయింది.
ఇంకా సినిమా విడుదల కాకముందే...
ఎందరో అభిమానుల్ని తన ఖాతాలో వేసుకున్న ఆ కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ‘హాయ్‌’తో పంచుకున్న సంగతులు...


మాది కేరళలోని త్రిశ్సూర్‌. నాన్న ప్రకాశ్‌ వారియర్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌లో చేస్తారు. అమ్మ ప్రీతా గృహిణి. చిన్నప్పటి నుంచి స్టేజ్‌ ఫియర్‌ ఉండేది కాదు. సంగీతం, డాన్స్‌ వచ్చు. త్రిశ్సూర్‌లోని విమలా కాలేజ్‌ ఫర్‌ విమెన్‌లో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నా. సృజనాత్మక రంగంలోకి వెళ్లాలని ఆశ. మా అంకుల్‌ ఒకరు మోడల్‌ అని పిలిచేవారు. ఆ మాటలు విన్నప్పుడు నేను మోడల్‌ ఎందుకు కాకూడదని అనిపించింది. అది క్రమంగా ఆసక్తిగా మారింది. అమ్మవాళ్లు కూడా చదువు ముఖ్యం అంటూనే ప్రోత్సహించారు. ‘ఒరు ఆదార్‌ లవ్‌...’కి ఆడిషన్లు జరుగుతున్నాయని తెలిసి వెళ్లా. ఎంపికయ్యా. ‘మాణిక్య మలరాయ పూవి’ పాట ముందువరకూ నాది చిన్న పాత్రే. ఆ తరువాతే పూర్తి స్థాయిలో అవకాశం ఇచ్చారు.

*
దర్శకుడు పాట గురించి వివరిస్తూ కనుబొమలు ఎలా పైకెత్తాలి... కన్ను ఎలా గీటాలనేది చెప్పారంతే. ఒక టేక్‌లోనే పూర్తిచేశా. అప్పటివరకూ నా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య వెయ్యి. ఆ వీడియో విడుదలైన వెంటనే ఆ సంఖ్య మిలియన్లకు చేరుకుంది. ఇప్పుడు ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడా సినిమా నాలుగు భాషల్లో విడుదల కాబోతోంది. మాది అమ్మాయిల కాలేజీ కావడంతో లవ్‌లెటర్లేమీ రాలేదు కానీ... నా ఈమెయిల్‌ ఇన్‌బాక్స్‌ మొత్తం డేట్‌ల ప్రతిపాదనలతో నిండిపోయింది.

*
మాణిక్య మలరాయ పూవి పాట వచ్చినప్పుడు ఓ విచిత్రం జరిగింది. నా వీడియోను నాన్న స్నేహితుడు నాన్నకు షేర్‌ చేశాడట. అది నాన్న చూసి ‘ఈ అమ్మాయి ఎవరో తెలుసా...’ అని అడిగారట. తెలియదనడంతో నా గురించి చెప్పారట.

*
తర్వాత అమ్మావాళ్లు జాగ్రత్తలు చెప్పడమే కాదు కొన్ని రోజులు నా ఫోను తీసేసుకున్నారు. మొదటినుంచీ నాకు స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లడం ఇష్టం. కానీ వీడియో వైరల్‌ అయ్యాక ఆ సాహసం చేయలేకపోయా.

*
మలయాళం మాత్రమే కాదు, తెలుగు, తమిళం, బాలీవుడ్‌ నుంచి సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగులో అయితే అల్లు అర్జున్‌తో చేసే అవకాశం వచ్చింది. అయితే మొదటి సినిమాకి చేయాల్సింది ఇంకా ఉండటంతో బాధపడుతూ తిరస్కరించా. తెలుగులో నన్ను మొదట గుర్తించింది అల్లు అర్జునే. ట్వీట్‌ చేసి, ఆ వీడియోను డబ్‌స్మాష్‌ చేయడం ఆనందం కలిగించింది.

*
‘ఒరు...’ పూర్తయ్యే సమయానికి శ్రీదేవి బంగ్లా అంగీకరించా. నాకు ఆ కథ నచ్చడం, థ్రిల్లింగ్‌గా ఉండడంతో ఓకే చెప్పా. చాలామంది అది శ్రీదేవి చరిత్ర అనుకుంటున్నారు కానీ.. కాదు. అందులో నా పాత్ర పేరు శ్రీదేవి అంతే.

*
తీరిగ్గా ఉన్నప్పుడు స్నేహితులతో సరదాగా గడపడం, సినిమాలు చూడటం నాకు ఇష్టం.

*
ఈ ఒక్క సినిమా అనే కాదు... మున్ముందు చేయబోయే వాటిల్లో నన్ను నేను పూర్తిస్థాయిలో నిరూపించుకోవాలనుకుంటున్నా. అందుకోసం ఇప్పటినుంచీ కసరత్తులు చేస్తున్నా. ఏ మాత్రం ఖాళీ దొరికినా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లిష్‌ సినిమాలు చూస్తున్నా. తెలుగు కొద్దిగా అర్థమవుతుంది కానీ... మాట్లాడటం నేర్చుకోవాలి.

*
ఇప్పుడిప్పుడే మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. స్క్రిప్ట్‌ విని నాన్నతో చర్చించినా చేయాలా వద్దా అనే నిర్ణయం మాత్రం నాదే.
* మొదటిసారి హైదరాబాద్‌ వచ్చా. నగరం అంతా తెలియదు కానీ... బిర్యానీ అయితే తిన్నా. రామోజీ ఫిలింసిటీ కూడా చూశా.

నా వీడియోను చూసిన అప్పటి నటుడు రిషీకపూర్‌ ట్విట్టర్‌లో నా గురించి రాస్తూ ‘ఆమెకు పెద్ద స్టార్‌డమ్‌ వస్తుంది. అభినయం కవ్వించేట్టుగా ఉన్నా... ముఖం అమాయకంగానే ఉంది అంటూనే... నా సమయంలో ఎందుకు రాలేదు...’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రిన్స్‌ ఆఫ్‌ రొమాన్స్‌గా పేరు తెచ్చుకున్న రిషీకపూర్‌గారి మాటలు నాకు చాలా ఆనందం కలిగించాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.