తెలుగుదనం.. అదే కదా అందం!
ఈ రోజుల్లో పేరు చూసి ‘ఇది తెలుగు సినిమానా, తమిళమా, హిందీనా, ఇంగ్లీషా..’ అన్నది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే సినిమా పేరుకి భాషతో పనిలేదు. నోటికి అందేలా (అంటే క్యాచీగా) ఉంటే సరిపోతుంది. యువతరానికి అర్థమయ్యేలా, పెద్దలకూ నచ్చేలా పేర్లు పట్టుకోవడంలో, అవి తమ సినిమాలకు పెట్టుకోవడంలో మన దర్శకులు ఆరితేరిపోయారు. అందుకే... తెలుగు సినిమాలో యథేచ్ఛగా పరభాషా పేర్లు వచ్చి చేరిపోతున్నాయి. వాటిని ఎవ్వరూ తప్పుబట్టడం లేదు. సినిమా అనేది వ్యాపారం కాబట్టి, పేరు పెట్టుకోవడంలోనూ వ్యాపార సూత్రాల్ని అన్వయించుకోవాల్సివస్తోంది. కాబట్టి అదే ఒప్పుగా చలామణీ అయిపోతోంది. కానీ తెలుగు సినిమాకి అచ్చమైన తెలుగు పేరు పెట్టుకుంటే, వినడానికి చెప్పుకోవడానికి బహు కమ్మగా ఉంటుంది.


తెలుగు సినిమాల్లో తెలుగుదనం కనిపించడం లేదని చాలామంది వాపోతారు. అది నిజం కూడా. తెలుగులో పరభాషా నటుల హవా ఎక్కువ. పాటల్లో హిందీ, ఇంగ్లిషు పదాల చొరబాటు ఎక్కువ. ఆధునిక పోకడల వెంట కథలు పరుగెడుతున్నాయి కాబట్టి, మనదైన సంప్రదాయాలు, సంస్కృతులు వెండి తెరపై గుభాళించడం లేదు. అయితే కొంతమంది దర్శకులు, రచయితలు, కథానాయకులు, నిర్మాతలు తెలుగుదనం ఉట్టిపడేలా సినిమాలు తీస్తుంటారు. కనీసం తమ భాషాభిమానాన్ని పేర్లు పెట్టడంలోనైనా చూపిస్తుంటారు.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే పేరు వినగానే తెలుగు కొంగొత్తగా గుభాళించినట్టు అనిపించింది చిత్రసీమకు. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి చేస్తున్న చిత్రానికి అలాంటి పేరు పెట్టడం పరిశ్రమని ఆశ్చర్యంలోనూ, ఆలోచనలోనూ ముంచేసింది. మాస్‌ హీరోల చిత్రాలకు ఇలాంటి స్వచ్ఛమైన పేర్లు పెట్టాలన్న ఆలోచన కలిగించింది. ఓ రకంగా.. శ్రీకాంత్‌ అడ్డాల మంచి మార్పుకి బీజం వేశారు. అక్కడి నుంచి తెలుగు సినిమా పేర్లలో ఓ మార్పు కనిపించింది.
దర్శకుడు త్రివిక్రమ్‌ తెలుగు భాషా ప్రేమికుడు. ‘అత్తారింటికి దారేది’, ‘అ ఆ’, ‘అరవింద సమేత’... ఇలా తెలుగు పేర్ల విషయంలో ఆయనా తన వంతు పాత్ర పోషించారు. ఈమధ్య ఆయన ‘అల... వైకుంఠపురములో’ అనే పేరు పెట్టేసరికి అదేమిటి? ఎందుకు? అనే కుతూహలం కలిగింది. పోతన రచించిన ‘గజేంద్రమోక్షం’లో అదో పద్యమని కొంతమందైనా తెలుసుకోగలిగారు. ఓ రకంగా భాషకు ఇది ఇతోధిక సాయమే అనుకోవాలి. ఆయన ఎన్టీఆర్‌తో చేసే సినిమా కోసం ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దాంతో ఈ పేరు వెనుక కథేమిటో తెలుసుకోవాలన్న ఉత్సాహం కలుగుతోంది. క్రిష్, ఇంద్రగంటి మోహనకృష్ణ, అవసరాల శ్రీనివాస్‌ లాంటి దర్శకులు తమ సినిమాలకు తెలుగు పేర్లనే పెట్టాలన్న కృత నిశ్చయంతో ఉంటారు. ఇలాంటి దర్శకుల వల్లే తెలుగు సినిమాల్లో తెలుగు పేర్లు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి.తెలుగు పేర్ల విషయంలో చిన్న చిత్రాలే ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నాయి. ఎందుకంటే.. పేరుతోనే ఆకట్టుకోవడం వాళ్లకు చాలా అవసరం. ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, ‘కనులు కనులను దోచాయంటే’, ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’, ‘మీకు మాత్రమే చెబుతా’, ‘మత్తు వదలరా’, ‘దొరసాని’, ‘తిప్పరామీసం’, ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’, ‘తోలు బొమ్మలాట’, ‘బుర్ర కథ’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘చావు కబురు చల్లగా’, ‘ఉప్పెన’, ఊరంతా అనుకుంటున్నారు’, ‘వినరా సోదరా వీర కుమార’ ఇవన్నీ చిన్న సినిమాల పేర్లే.


ఈ విషయంలో అగ్ర హీరోలు, దర్శకుల దృక్పథం కూడా ఇప్పుడు మారుతోంది. ‘కొత్తగా ఉంటే చాలు.. స్వచ్ఛమైన తెలుగు పేరే పెడదాం..’ అనుకుంటున్నారు. ప్రభాస్‌ - రాధాకృష్ణల చిత్రానికి ‘రాధే శ్యామ’, చిరంజీవి చిత్రానికి ‘ఆచార్య’, అల్లు అర్జున్‌ - సుకుమార్‌ల చిత్రానికి ‘శేషాచలం’ అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ‘నాగేశ్వర్రావు’, ‘నారప్ప’, ‘అలివేలు వెంకటరమణ’, ‘ఆకాశం నీ హద్దురా’, ‘అరణ్య’, ‘ఉప్పెన’, ‘నిశ్శబ్దం’, ‘శ్రీకారం’, ‘విరాటపర్వం’ ఇవన్నీ అగ్రహీరోల చిత్రాలకు నిర్ణయించిన పేర్లే. అయితే ఎప్పటిలా ఇంగ్లిష్‌ పేర్లూ తెగ వాడేస్తున్నారు. క్రాక్, వైల్డ్‌ డాగ్, వరల్డ్‌ ఫేమస్‌ లవర్, లవ్‌స్టోరీ, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఇలా వాటి పరంపర కొనసాగుతోంది. వీటి మధ్య స్వచ్ఛమైన తెలుగు పేర్లు కనిపించడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. భవిష్యత్తులోనూ మన దర్శక నిర్మాతలు మరిన్ని మంచి పేర్లతో ప్రేక్షకుల్ని పలకరించాలి. తెలుగు భాష ఇలాగైనా కాస్త వర్థిల్లాలి.

(ఈరోజు ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా)

‘‘సినిమా ఎప్పుడూ భాషకు ద్రోహం చేయదు. కొద్దో గొప్పో సాయమే చేస్తుంది. ఆత్రేయ, వేటూరి, సీతారామశాస్త్రి లాంటి వాళ్లు రాసిన పాటలు వింటూ, పాడుకుంటూ ఆస్వాదిస్తుంటాం. కొన్నిసార్లు అర్థాలు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాం. సినిమా పేరు వినగానే ఓ పద్యమో, మనదైన తెలుగు మాటో గుర్తొస్తే ‘ఇది మన సినిమా’ అనే భావన కలుగుతుంది. అందుకే నేను అలాంటి ప్రయత్నాలు చేస్తుంటా’’.

- త్రివిక్రమ్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.