పూరి, తారక్‌ల ‘టెంపర్‌’కు ఐదేళ్లు
పూరి జగన్నాథ్‌.. మాస్‌ దర్శకుడు.

ఎన్టీఆర్‌.. పవర్‌ఫుల్‌ నటుడు.


ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తొలిసారి వచ్చిన చిత్రం ‘ఆంధ్రావాలా’. 2004లో బాక్సాఫీసు బరిలో నిలిచిన ఈ సినిమా ఆశించినంత ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ కలయికలో మరో సినిమా రావడం కష్టమనుకున్నారంతా. అది నిజం కాదని, ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే పొందాలని నిరూపించారు ఈ ఇద్దరు. దాదాపు 11 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌కు తమ ‘టెంపర్‌’ తనం చూపించి రికార్డులు సృష్టించారు. 2015 ఫిబ్రవరి 13న విడుదలైన ఈ చిత్రం నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా..




పూరి కెరీర్‌లో తొలిసారి:
పూరి జగన్నాథ్‌ తొలిసారి తన కెరీర్‌లో వేరే రచయిత అందించిన కథకు దర్శకత్వం వహించాడు. ఎప్పుడూ స్వీయ రచనలో సినిమాలు తెరకెక్కించే ఆయన ఇలా చేయడానికి కారణం వక్కంతం వంశీ. ఈ సినిమా ప్రారంభం ముందు వంశీ తారక్‌కు ఓ పాయింట్‌ వినిపించాడు. అది బాగా నచ్చడంతో పూరికి తెలియజేశాడు తారక్‌. అప్పటికే పూరి ఓ కథ ఫైనల్‌ చేసినా.. నా కథ కాన్న బావుంటే ఓకే చేస్తానని చెప్పాడు. అలా వంశీ చెప్పిన కథ పూరిని ఆకట్టుకోవడంతో ‘టెంపర్‌’ రూపొందింది.



కథ:
దయా (ఎన్టీఆర్‌) ఎవరు లేని అనాథ. చిన్నప్పటి నుంచి డబ్బంటే ఆశ. పోలీసుగా మారితే కానీ ఎక్కువ డబ్బు రాదనుకుని పోలీసు అవుతాడు. అలా పోలీసయిన దయా.. డబ్బు కోసం విశాఖపట్నంలోని ఓ రౌడీ బృందంతో చేతులు కలుపుతాడు. అందులో ప్రముఖుడు వాల్తేర్‌ వాసు(ప్రకాశ్‌ రాజ్‌). వాసు చేసే అన్యాయాన్ని పట్టించకోకుండా అతని నుంచి కావాల్సినంత సొమ్ము తీసుకుంటుంటాడు దయా. ఈ నేపథ్యంలో ఓ రోజు జంతు ప్రేమికురాలు శాన్వి(కాజల్‌) ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు దయ. ఆమె పరిచయంతో దయాలో మార్పొస్తుంది. శాన్వి పుట్టిన రోజున వాసు గ్యాంగ్‌ ఆమెను కిడ్నాప్‌ చేసి చంపబోతారు. దయా అడ్డుపడతాడు. ఈలోగా వాసూ వచ్చి మనం చంపాల్సింది ఈ అమ్మాయిని కాదు అంటాడు.ఆ రాక్షసుల బారి నుంచి లక్ష్మీ(మధురిమ)ని కాపాడమని దయాని అడుగుతుంది శాన్వి. దీంతో వాసు, దయా మధ్య దూరం పెరుగుతుంది. అప్పటి నుండి వాసు చేసే అక్రమాలకు దయా ఎదురుతిరుగుతాడు. దాంతో వాసు.. దయాపై వైరం పెంచుకుంటాడు. ఆ లక్ష్మీ ఎవరు? దయా.. వాసుని ఎలా అంతమొందించాడు? చెప్పడం కంటే వీక్షిస్తేనే బావుంటుంది.


మరిచిపోలేని పాత్రలు, సన్నివేశాలు:

* ఈ చిత్రంలో చిరకాలం గుర్తిండి పోయే పాత్రలు మూడున్నాయి. దయ (ఎన్టీఆర్‌), వాల్తేరు వాసు (ప్రకాశ్‌ రాజ్‌), మూర్తి (పోసాని కృష్ణ మురళి). తన పై అధికారి దయా చేసే అరాచకం నచ్చక బాధపడే ఓ కానిస్టేబుల్‌ పాత్రలో జీవించాడు పోసాని. వాల్తేరు వాసుగా ప్రకాశ్‌రాజ్‌ విలనిజానికి ఎదురులేదు. ‘నా పేరు దయా.. నాకు లేనిదే అది’ అని ఎన్టీఆర్‌ చెప్పకనే చెప్పాడు. ఈయన నాయకుడా, ప్రతినాయకుడా తెలియడం కొంచెం కష్టమే.



* ఎన్టీఆర్‌- పోసాని మధ్య నడిచే ప్రతి సన్నివేశం ఆలోచిపంజేస్తుంది.
* సినిమాకే ప్రధానంగా నిలిచే సన్నివేశం క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సీన్‌. బాధితురాలికి న్యాయం జరిగేందుకు తప్పును తన మీద వేసుకుంటాడు తారక్‌. ఈ నేపథ్యంలో సాగే ప్రతి సంభాషణ ప్రేక్షకుణ్ని కట్టిపడేస్తుంది.

ఊపేసిన సంగీతం:
ఎన్టీఆర్‌ సినిమా అంటే డ్యాన్సులు ఉండాల్సిందే. అందుకే తన పంథా మార్చి తారక్‌తోనే కాదు యావత్తు సినీ ప్రేక్షకుల్ని తన సంగీతంతో ఉర్రూతలూగించాడు అనూప్‌ రూబెన్స్‌. ‘మీ తాత టెంటర్‌.. మీ అయ్య టెంటర్‌’ అంటూ ఫాస్ట్‌బీట్, ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ అనే ప్రత్యేకం గీతం, ‘నిన్ను చూసి పడిపోయా’ లాంటి మెలోడి, ‘దేవుడా దేవుడా’ అనే నాయకా ప్రధాన్య గీతాన్ని అందించింది అదుర్స్‌ అనిపించాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.