ఫిట్‌నెస్సే వీరికి ప్లస్‌
కుర్ర హీరోలతో పోటీపడాలి. సీనియర్లకి జోడీ అయితే వాళ్లకి తగ్గట్టుగా

కాస్త ఒళ్లు చేయాలి. నడుమును నాజూగ్గా మార్చేసి తీగలాగా వంచాలి,

డ్యాన్సులతో దుమ్ము దులిపేయాలి. అవసరమైతే ఫైటింగులూ చేయాలి. ఇలా కథానాయికలకి ఎన్ని సవాళ్లో! అందుకే మన కథానాయికలు ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారు. ఒకే సినిమా కోసం బరువు తగ్గుతారు, పెరుగుతారు. ఫిట్‌నెస్‌

విషయంలో వాళ్లకున్న మక్కువ చూస్తే ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే.


వీళ్లు చేసే కసరత్తులు చూసి యువతరం కూడా స్ఫూర్తి పొందుతోంది. ఆరోగ్యం... ఫిట్‌నెస్‌ విషయంలో మన కథానాయికలు చెబుతున్న కబుర్లివీ...

తమన్నా
మన జీవన శైలి బాగున్నప్పుడే మనం బాగా పని చేయగలుగుతాం అంటోంది తమన్నా. ఫిట్‌నెస్‌ మన జీవన శైలిలో ప్రధానమైంది కాబట్టి ఆ విషయంలో ముందు నుంచీ నేను కఠినంగా ఉంటున్నా అంటుందామె. రోజులో ఒక గంట కచ్చితంగా జిమ్‌కి కేటాయిస్తుంది తమన్నా. కార్డియో, యోగా, పరుగు, వెయిట్‌ ట్రైనింగ్‌ లాంటి కసరత్తులు చేస్తుంది. వారంలో రెండు రోజులు తనకి ఇష్టమైనవన్నీ తినేస్తుందట. అయితే ఆ రోజుల్లో మరికాసేపు ఎక్కువగా వ్యాయామం చేస్తానని చెబుతోంది. వ్యాయామం, ఆహారం పక్కాగా ఉంటే మన మానసిక స్థితి బాగుంటుందని చెబుతోంది తమన్నా.


సమంత

భర్త నాగచైతన్యతో పోటీపడి మరీ జిమ్‌లో చెమటోడుస్తుంటుంది సమంత. ఒకరిని మించి మరొకరు బరువులు ఎత్తుతూ కనిపించే వాళ్ల జిమ్‌ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంటాయి. అమ్మాయిలు అందంగా మాత్రమే కనిపిస్తే సరిపోదు, బలంగా కూడా ఉండాలంటోంది సమంత. అందుకే చిత్రీకరణకి వెళ్లడానికి ముందు ఒక గంట తప్పనిసరిగా జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తుందట. దూర ప్రాంతాలకి వెళ్లినప్పుడు జిమ్‌ అందుబాటులో లేకపోతే జాగింగైనా చేస్తుందట. దక్షిణాది యుద్ధ విద్యల్లో ఒకటైన సిలంబంలోనూ ఆమె ప్రావీణ్యం సంపాదించింది. ప్రత్యేక ట్రైనర్లని నియమించుకొని ఆమె వ్యాయామం చేస్తుంటుంది. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందు కష్టంగానే ఉంటుంది, కానీ ఒకసారి దాని ఫలితం చూశాక ఇక వదిలి పెట్టలేమని చెబుతోందామె. గుడ్లు, చిరు ధాన్యాలతో చేసిన ఆహారాన్ని, పరిమితంగా మాంసాహారాన్ని తీసుకొంటుందట సమంత. తాగునీరు తీసుకోవడంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకొంటానని చెబుతోంది సమంత.


రాశీ ఖన్నా
ఆరోగ్యం, సంతోషం... ఈ రెండూ చాలా ముఖ్యమైనవని చెబుతోంది రాశీ ఖన్నా. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాకే తాను ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టానని చెబుతోంది. తొలినాళ్లలో బొద్దుగా కనిపించిన రాశి, ఆ తర్వాత సన్నజాజిలా మారింది. ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడుతూ ‘‘చాలామంది రాత్రికి రాత్రే ఫలితాలు రావాలని ఆశ పడుతుంటారు. నేను కోరుకున్నట్టుగా మారడానికి నాకు రెండేళ్లు సమయం పట్టింది. వారానికి ఆరు రోజులు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తా. పిండిపదార్థాలు, ప్రొటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన సమతులాహారాన్ని తీసుకుంటా’’ అని చెప్పింది రాశీ ఖన్నా.


కాజల్‌

వృత్తి కోసమే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టలేదంటోంది కాజల్‌ అగర్వాల్‌. ఆమె తొలినాళ్లలో ఎలా కనిపించేదో, ఇప్పుడూ అంతే నాజూగ్గా కనిపిస్తోంది. ఆమె పద్దెనిమిదేళ్ల వయసులోనే జిమ్‌లో చేరిందట. అప్పట్నుంచే నాలో ఫిట్‌నెస్‌పై మక్కువ పెరిగిందని చెబుతోంది. ఆ తర్వాత యోగా నేర్చుకుంది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నాతో పాటే యోగా మ్యాట్‌ని తీసుకెళుతుంటానని చెబుతోంది. ఆమె ఒకేసారి 150 సూర్య నమస్కారాలు చేస్తుందట. భోజన ప్రియురాలైన కాజల్‌ ఆహార నియమాల్ని పాటించడం తనకి పెద్ద సవాల్‌ అంటోంది. ‘‘సినిమాల కోసం నా ఆకారాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. కానీ అనుకోకుండా ఒకసారి బరువు తగ్గాను. అప్పట్నుంచి శాకాహారిగా మారిపోయా. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటా. వారంలో రెండు రోజులు ఇష్టమైనవన్నీ తినేస్తా. రోజూ ఇన్ని గంటలు వ్యాయామం చేయడమంటూ ఏమీ లేదు. వారంలో మూడు రోజులు జిమ్‌లో ఉంటా’’ అని చెప్పింది కాజల్‌.


రకుల్‌ప్రీత్‌

కథానాయికలు వ్యాయామం మొదలుపెట్టారనగానే జీరోసైజ్‌ ప్రస్తావన తప్పకుండా వస్తుంది. కానీ ఫిట్‌నెస్‌కీ, జీరోసైజ్‌కీ సంబంధమే లేదంటోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఆరోగ్యంగా ఉండటం మన జీవన శైలి కావాలంటుందామె. మనం రోజూ ముఖాన్ని కడుక్కుని దుమ్ము ధూళి నుంచి ఎలా పరిరక్షించుకొంటామో, అలా దేహం లోపల కూడా శుద్ధి చేసుకోవాలి. అది వ్యాయామంతోనే సాధ్యం అంటోంది. స్కిప్పింగ్, వెయిట్‌ ట్రైనింగ్, కిక్‌ బాక్సింగ్, యోగా చేస్తూ ఆమె ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటోంది. డైట్‌ అనే మాట అస్సలు నచ్చదంటోందామె. మనం ఏం తింటున్నాం అనేదానిపై అవగాహన ఉంటే చాలంటోంది. ఆరోగ్యం, ఆహారంపై ఉన్న ఆసక్తితోనే ఆమె ఎఫ్‌-45 పేరుతో జిమ్‌లని నిర్వహిస్తోంది. రోజూ 45 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలు... ప్రతి ఒక్కరూ చురుగ్గా మారిపోతారని చెబుతోంది రకుల్‌.


పూజా హెగ్డే

పూజా హెగ్డేకు గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టకముందు ఫిట్‌నెస్‌పై అవగాహనే ఉండేది కాదట. భరతనాట్యం నేర్చుకోవడంతో నాజూగ్గానే ఉండేదాన్ని కానీ, నా శరీరంపై నాకు అంత నియంత్రణ ఉండేది కాదంటోందామె. కానీ ఇప్పుడు పూజ అంటే ఫిట్‌నెస్‌కి మారుపేరు అనేంతగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కిక్‌ బాక్సింగ్‌తో పాటు స్క్వాట్స్, పిలేట్స్, కాలిస్తెనిక్స్‌ లాంటి కసరత్తులతో అదరగొడుతోంది. యోగా, సల్సాలోనూ ఆమె దిట్టే. ‘‘చిత్ర పరిశ్రమలోకి రావడంతోనే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ల ప్రాముఖ్యత బాగా అర్థమైంది. ఇప్పుడు నేనెక్కడ ఉన్నా సరే, ఒక గంట వ్యాయామం తప్పనిసరిగా చేస్తా. ఎక్కడికెళ్లినా నాతోపాటే కొన్ని జిమ్‌ పరికరాల్ని తీసుకెళ్తుంటా. వ్యాయామమైనా, ఇతరత్రా మరే కొత్త ప్రయత్నమైనా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే అది అలవాటుగా మారిపోతుంది. ఫిట్‌నెస్‌ అనగానే అందరూ జిమ్‌కి వెళ్లడమే అనుకుంటారు. మనకెక్కడ కుదురుతుందిలే అనుకొని ఆగిపోతుంటారు. కానీ ఫిట్‌నెస్‌ అంటే జిమ్‌ మాత్రమే కాదు. శరీరానికి పని పెట్టే పని ఏం చేసినా సరే... అది మన ఫిట్‌నెస్‌ని కాపాడుతుంది. నృత్యం చేయడమూ ఒక వ్యాయామమే. ఫిట్‌నెస్‌ పేరుతో నేనెప్పుడూ నోరు కట్టుకోలేదు. ఇష్టమైనవన్నీ తింటా, కానీ పరిమితంగా తింటా’’ అని చెప్పింది పూజా హెగ్డే.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.