పొరుగు కథల పరుగు

భాష... ప్రాంతం..మనుషులు... వాళ్ల అలవాట్లు వేర్వేరు కావొచ్చు కానీ భావోద్వేగాలు మాత్రం ఎక్కడైనా ఒక్కటే. - ఈ విషయమే చిత్ర పరిశ్రమల్ని పొరుగు కథలపై మక్కువ ప్రదర్శించేలా చేస్తుంది. ఒక తెలుగు సినిమా బాగా ఆడుతోందనే మాట వినిపిస్తే చాలు, పొరుగు చిత్ర పరిశ్రమలకి చెందిన నిర్మాతలు హైదరాబాద్‌లో వాలిపోతుంటారు. సినిమాల్ని చూసేసి, నచ్చితే నిర్మాతలతో బేరాలు మొదలుపెట్టేస్తారు. పక్క భాషల్లో బాగా ఆడే సినిమాలపై మనం కూడా అదే రకమైన ఆసక్తిని కనబరుస్తుంటాం. అందుకే కథల ఎగుమతులు, దిగుమతులు జోరుగా సాగుతుంటాయి. ప్రస్తుతం ఎప్పుడూ లేని విధంగా తెలుగులో పలువురు అగ్రకథానాయకులు రీమేక్‌ చిత్రాలతోనే బిజీగా ఉన్నారు. వీటిలో ఈ వేసవిలో విడుదలయ్యేవే ఎక్కువ.



సురక్షితమైన ప్రయాణంగా భావించి రీమేక్‌లవైపు దృష్టిపెట్టేవాళ్లే ఎక్కువ. నిజానికి రీమేక్‌ అంత సురక్షితమేమీ కాదు. నేటివిటీ మొదలుకుని తారల ఇమేజ్‌ వరకు చాలా విషయాలు ఇందులో కీలకంగా మారిపోతుంటాయి. ఈమధ్యే ‘96’కి రీమేక్‌గా తెరకెక్కిన ‘జాను’ తెలుగు ప్రేక్షకులపై ప్రభావం చూపించలేకపోయింది. తమిళంలో మాత్రం ‘96’ ఒక క్లాసిక్‌గా సినిమాగా నిలిచిపోయింది. ఇలా భారీ అంచనాలతో పునర్నితమైన చాలా సినిమాలు మన బాక్సాఫీసు ముంగిట తేలిపోయాయి. అయినా సరే... మంచి కథల్ని మనం కూడా చెబుదాం అనే ఉత్సాహంలో మన దర్శకనిర్మాతలు కనిపిస్తుంటారు. హీరోలు కూడా ఆ కథల్ని బలంగా నమ్ముతున్నారు. దాంతో రీమేక్‌ సినిమాల జోరు తెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది.

‘పింక్‌’తో పవన్‌... ‘అసురన్‌’తో వెంకీ

రెండేళ్ల విరామం తర్వాత పవన్‌కల్యాణ్‌ మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. మరోపక్క ఆయన రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు కాబట్టి అందుకు తగ్గ కథ కూడా కావాలి. అందుకే బలమైన సామాజికాంశాలతో కూడిన ‘పింక్‌’ రీమేక్‌లో నటించడమే మేలని ఆయన నమ్మారు. అదే ‘వకీల్‌ సాబ్‌’గా తెరకెక్కుతోంది. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ నటించిన చిత్రం ‘పింక్‌’. తమిళంలో అజిత్‌ కూడా ఈ సినిమా రీమేక్‌లో నటించి విజయాన్ని అందుకున్నారు. రెండు చోట్లా మంచి ఫలితాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. వేసవి సందర్భంగా మేలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. రీమేక్‌ సినిమాలు చేయడంలో ముందుండే మరో కథానాయకుడు వెంకటేష్‌. ఆయన ఇప్పటివరకు 73 సినిమాలు చేయగా, అందులో 28 సినిమాలు రీమేక్‌లే. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘నారప్ప’ 29వ సినిమా కావడం గమనార్హం. తమిళంలో విజయవంతమైన ‘అసురన్‌’కి రీమేక్‌గా రూపొందుతోంది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. ఈ వేసవిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

యువతరానిదీ అదే దారి

అగ్ర కథానాయకులకి సరైన కథలు దొరకడం కష్టం. వాళ్ల వయసు... ఇమేజ్‌ ఇలా చాలా కారణాలుంటాయి. అందుకే వాళ్లు రీమేక్‌లతో ప్రయాణం చేయాలని భావిస్తుంటారు. యువ కథానాయకులకి ఆ సమస్య లేకపోయినా ఈమధ్య వాళ్లు కూడా పొరుగు కథలపైనే కన్నేస్తున్నారు. తమిళంలో విజయవంతమైన ‘తడమ్‌’కి రీమేక్‌గా రామ్‌ ‘రెడ్‌’ తెరకెక్కుతోంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి రవికిషోర్‌ నిర్మాత. ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రామ్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. ఈమధ్యే ‘భీష్మ’తో మళ్లీ విజయాలబాట పట్టిన నితిన్‌ కూడా పొరుగు కథకి ఫిదా అయిపోయారు. హిందీలో విజయవంతమైన ‘అంధాదున్‌’ రీమేక్‌లో ఆయన నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగులో రూపొందుతున్న

మరో రీమేక్‌ కూడా ప్రేక్షకుల్ని ఆసక్తికి గురిచేస్తోంది. ఆ చిత్రం పేరు... ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’.మలయాళంలో విజయవంతమైన ‘మహేషింతే ప్రతీకారమ్‌’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోంది. ‘కేరాఫ్‌ కంచరపాలెం’తో తన ప్రతిభని నిరూపించుకున్న వెంకటేష్‌ మహా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత ఆర్కా మీడియా వర్క్స్‌ నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇందులో సత్యదేవ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఏప్రిల్‌ 17న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

తెలుగులో ఒకప్పుడు కథల కొరత ఉండేది. కానీ యువ దర్శకులు పోటాపోటీగా కొత్త ఆలోచనలతో వస్తున్నారు. అలా ఒకపక్క మనవైన కథల జోరు కొనసాగుతున్నప్పటికీ.. మరోపక్క పొరుగు కథలు కూడా అదేస్థాయిలో దిగుమతి అవుతుండడం విశేషం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.