చిన్న సినిమాలదే పెద్ద విజయం
సినిమాల్లో చిన్న పెద్ద అనే తేడా ఏమీ ఉండదని... విజయవంతమైతే ప్రతిదీ పెద్దదే అనేది సినీ పండితులు చెప్పే మాట. అయితే సినిమాకి పెట్టే వ్యయం... అందులో నటులు.. అంచనాల్ని బట్టి పరిశ్రమ వర్గాలు చిన్న పెద్ద అని విడదీస్తుంటాయి. అగ్ర తారలు నటించే చిత్రాలు నెలకి ఒకట్రెండుకి మించి రావు. పరిమిత వ్యయంతో తెరకెక్కే చిత్రాలు మాత్రం వారానికి రెండు మూడు చొప్పున విడుదలవుతుంటాయి. చిత్రసీమ ఎప్పుడూ సందడిగా ఉండేది వాటితోనే. అందులో ఒక్క సినిమా విజయవంతమైనా ఆ స్ఫూర్తితో మరిన్ని సినిమాలు కొబ్బరికాయ కొట్టుకుంటాయి. అందుకే చిన్న సినిమాల ఫలితాల గురించి కొండంత ఆశతో ఎదురు చూస్తుంటుంది చిత్రసీమ. గడిచిన ఆర్నెళ్ల కాలంలో స్టార్‌ కథానాయకుల చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చినవి కొన్నే. అందులో విజయ తీరాలకి చేరినవెన్నో వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. పరిమిత వ్యయంతో తెరకెక్కిన చిన్న చిత్రాలు మాత్రం బాక్సాఫీసు ముందుకు వరుస కట్టాయి. గత రెండు వారాల్లోనే పది సినిమాలొచ్చాయంటే ఆ ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్నెళ్లలో మంచి వసూళ్లు రాబట్టింది... బాక్సాఫీసుకి విజయాల రుచి చూపించింది కూడా పరిమిత, మధ్యస్థ వ్యయంతో తెరకెక్కిన చిత్రాలే.


తొలి ఆర్నెళ్లు తెలుగు చిత్రసీమకి కీలకం. సంక్రాంతి, వేసవిలాంటి బలమైన సీజన్లు ఈ ఆర్నెళ్లలోనే వస్తాయి కాబట్టి అగ్ర కథానాయకుల చిత్రాలు పెద్దయెత్తున ముస్తాబవుతుంటాయి. క్రికెట్‌లో ఓపెనర్లుగా స్టార్‌ బ్యాట్స్‌మెన్లు ఎలా దిగుతారో... అలా సంక్రాంతికి స్టార్‌ కథానాయకుల చిత్రాలు విడుదలవుతుంటాయి. ఆ సినిమాలు బాగున్నాయంటే కొత్త రికార్డులు నమోదు అవుతుంటాయి. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల ప్రభంజనం కనిపిస్తుంటుంది. అయితే ఈసారి సంక్రాంతి నిరాశపరిచింది. ‘ఎఫ్‌2’ మినహా మిగిలిన చిత్రాలేవీ ఆకట్టుకోలేదు. రామ్‌ చరణ్‌, బాలకృష్ణ, రజనీకాంత్‌ లాంటి అగ్ర తారల చిత్రాలొచ్చినా ప్రభావం చూపించలేకపోయాయి. దాంతో వేసవి సీజనే ఆధారమైంది. ఈసారి వేసవిలో విడుదలైన చిత్రాలు ఎక్కువగా యువ కథానాయకులు నటించినవే. క్రికెట్‌లో ఓపెనర్లు నిరాశపరిచినా.. నాలుగైదు స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు నిలదొక్కుకుని మెరుపులు మెరిపిస్తే ఎలా ఉంటుందో అలా వేసవిలో వచ్చిన యువ కథానాయకులు అదరగొట్టారు. కళ తప్పిన బాక్సాఫీసుకి ఊరట కలిగించారు.


ఆ రెండు నెలలు: సంక్రాంతికొచ్చిన ‘ఎఫ్‌2’ తర్వాత లాభాల్ని రుచి చూసిన చిత్రం ‘యాత్ర’. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా, పరిమిత వ్యయంతోనే తెరకెక్కిన ఆ చిత్రం మంచి వసూళ్లని రాబట్టింది. ఆ తర్వాత వేసవి సీజన్‌ని ‘118’తో విజయవంతంగా ఆరంభించాడు కల్యాణ్‌రామ్‌. థ్రిల్లర్‌ కథతో తెరకెక్కిన ఆ చిత్రం నిర్మాతకి రూపాయికి రెండు రూపాయలు లాభాల్ని తెచ్చిపెట్టింది. మధ్యలో కొన్ని వారాలు ఏ సినిమా కూడా నిలబడలేకపోయింది. ‘సూర్యకాంతం’, ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదలైనా అవి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. వేసవి సెలవులు మొదలైన ఏప్రిల్‌లో మాత్రం సినీ ప్రేమికులు చక్కటి వినోదాన్ని ఆస్వాదించారు. నాగచైతన్య ‘మజిలీ’, సాయిధరమ్‌ తేజ్‌ ‘చిత్రలహరి’, నాని ‘జెర్సీ’ చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించాయి. ఆయా కథల్లో నవ్యత, కథా నాయకుల నటన, దర్శకుల ప్రతిభ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు గాడిన పడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మే నెల మొత్తం మహేష్‌ ‘మహర్షి’ హంగామానే సాగింది. ఏప్రిల్‌ తరహాలో మళ్లీ వరుస విజయాల పరంపర కొనసాగింది మాత్రం జూన్‌లోనే. ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’, ‘మల్లేశం’, ‘బ్రోచేవారెవరురా’ విజయం సాధించాయి. ‘మల్లేశం’ మంచి సినిమాగా పేరు తెచ్చుకోగా, ‘ఏజంట్‌..’, ‘బ్రోచేవారెవరురా’ చక్కటి వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ మూడూ పరిమిత వ్యయంతో తెరకెక్కినవే. యువతరం నటులు ప్రధాన పాత్రధారులుగా కొత్తతరం దర్శకులు తెరకెక్కించిన ఈ చిత్రాలు ప్రస్తుతం మంచి వసూళ్లు రాబట్టుకొంటున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో విడుదలైన ‘ఫలక్‌నుమా దాస్‌’, ‘గేమ్‌ ఓవర్‌’ కూడా ఆకట్టుకున్నాయి. ‘ఎఫ్‌2’, ‘మహర్షి’ చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టినా... ‘కల్కి’ బీ, సీ సెంటర్లలో సందడి చేస్తున్నా... తొలి ఆర్నెళ్లలో పరిమిత వ్యయంతో రూపొందిన యువ కథా నాయకుల చిత్రాలే విజయాల కొరతని తీర్చాయి. వచ్చే ఆర్నెళ్లలో స్టార్‌ హీరోల సందడి ఎక్కువగా ఉండబోతోంది. ప్రభాస్‌ ‘సాహో’, చిరంజీవి ‘సైరా..’, నాగార్జున ‘మన్మథుడు2’, వెంకటేష్‌ - నాగచైతన్యల ‘వెంకీమామ’ చిత్రాలు రాబోతున్నాయి. అవి అంచనాలకి తగ్గట్టు విజయవంతమైతే ద్వితీయార్ధం సుఖాంతమైనట్టే.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.