సినిమాలో దమ్ముని బట్టి వసూలు
ఖర్చు ఎంత? రాబడి ఎంత? - ఏ వ్యాపారానికైనా ముఖ్య సూత్రమిదే. పెట్టుబడి కంటే ఆదాయం ఎక్కువ అయితేనే వ్యాపారం రాణిస్తుంది. సినిమా కూడా అంతే! అందుకే ప్రతి సినిమాకీ కొన్ని బడ్జెట్‌ లెక్కలు ఉంటాయి. కథానాయకుడి మార్కెట్‌, ఇమేజ్‌, గత చిత్రాల వసూళ్లపై ఆధారపడి బడ్జెట్‌ని నిర్ణయిస్తారు. ‘ఈ హీరో సినిమా ఇంతలోనే తీయాలి’ అనే లెక్కలతోనే పని మొదలవుతుంది. కానీ ఇప్పుడు ఆ అంకెలు చెరిగిపోతున్నాయి. బడ్జెట్‌ లెక్కలు, భయాలు తొలగిపోతున్నాయి. ‘సినిమాలో దమ్ముంటే చాలు..ఎంతైనా వసూలు చేసుకోవచ్చు’ అన్న ధీమా ఎక్కువ అవుతోంది. అందుకే ఇప్పుడు తెలుగునాట భారీ బడ్జెట్‌ చిత్రాలు విరివిగా వస్తున్నాయి. సినిమా బడ్జెట్‌ రూ.వంద కోట్లు దాటడం చాలా సాధారణ విషయంఅయింది.


కొన్నేళ్ల క్రితం వరకూ బడ్జెట్‌ రూ.50 కోట్లు దాటితే భయాలు మొదలైపోయేవి. ఆ మొత్తాన్ని రాబట్టడం కష్టం అనుకునేవారంతా. కానీ ఇప్పుడు రూ.100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లంటూ ఆ అంకెలు పెరుగుతూనే ఉన్నాయి. ‘సైరా’ బడ్జెట్‌ దాదాపు రూ.250 కోట్లు. ‘సాహో’కీ ఇంచు మించుగా అంతే ఖర్చు చేస్తున్నారు. రాజమౌళి - రామారావు - రామ్‌చరణ్‌ల ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కి రూ.350 కోట్లకుపైనే ఖర్చు పెట్టడానికి నిర్మాత సిద్ధమయ్యారు. ఇదంతా ఆ కథలపై, కథానాయకులపై, దర్శకులపై ఉన్న నమ్మకం. మరీ ముఖ్యంగా ప్రేక్షకుల తీర్పుపై ఉన్న భరోసా.

తెలుగు సినిమా వసూళ్లు ఎప్పుడైతే రూ.వంద కోట్ల మైలు రాయిని దాటాయో అప్పుడే ఈ బడ్జెట్‌ పరిమితులు తొలగిపోయాయి. ‘బాహుబలి’తో తెలుగు సినిమాకి ఎల్లలు లేవని అర్థమైంది. మార్కెట్‌ చేసుకునే నైపుణ్యం ఉంటే ఖర్చు పెట్టిన ప్రతి పైసా రాబట్టుకోగలమన్న ధీమా పెరిగింది. అందుకే కథ రీత్యా ఎంత పెట్టుబడికైనా నిర్మాతలు వెనుకాడటం లేదు.

కథలు డిమాండ్‌ చేస్తున్నాయి
పిండి కొద్ది రొట్టె. బడ్జెట్‌ కొద్ది సినిమా. అవును... ప్రపంచీకరణ వల్ల అంతర్జాతీయ సినిమా అందుబాటులోకి వచ్చింది. హాలీవుడ్‌ సినిమాలతో ప్రాంతీయ చిత్రాల్ని పోల్చుకోవడం మొదలెట్టారు. నాణ్యత విషయంలో రాజీ పడితే ప్రేక్షకుల మన్ననలు పొందడం కష్టమన్న సంగతి అర్థమైంది. అందుకే నిర్మాణ విలువల విషయంలో ఎవ్వరూ రాజీ పడడం లేదు. దానికి తోడు కథల ఎంపిక కూడా అదే రీతిన సాగుతోంది. భారీ కాన్వాస్‌ ఉన్న కథల్ని ఎంచుకోవడం వల్ల, వాటికి తగిన రీతిలో ఖర్చు పెట్టక తప్పడం లేదు. ‘సైరా’ చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం. బ్రిటిష్‌ కాలం నాటి పరిస్థితుల్ని తెరపై ప్రతిబింబించాల్సిన అవసరం ఏర్పడింది. సైన్యం, యుద్ధాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అవసరం ఏర్పడింది. పైగా ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు చిరంజీవి. అందుకే అమితాబ్‌ బచ్చన్‌ లాంటి స్టార్లని తీసుకొచ్చారు. దాంతో బడ్జెట్‌ పెరిగింది. ‘బాహుబలి’ తరవాత ప్రభాస్‌ మార్కెట్‌ పెరిగింది. బాలీవుడ్‌లోనూ అభిమానులు ఏర్పడ్డారు. పెరిగిన అంచనాలని అందుకోవాలంటే వినూత్నమైన కథల్ని ఎంచుకోక తప్పడం లేదు. పైగా ఆ భారీదనం కూడా చూపించాలి. ‘సాహో’లో ఆ అంశాలన్నీ మేళవించారు. యాక్షన్‌ సన్నివేశాల కోసమే దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెట్టారు. అందుకే రూ.250 కోట్లు లెక్క తేలింది. ఇక ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సంగతి చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి కలలెప్పుడూ భారీగా ఉంటాయి. ఈసారీ అలాంటి కథనే ఎంచుకున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ పాత్రలకు కల్పిత కథని జోడించి ఈ సినిమా తీస్తున్నారు. అసలే మల్టీస్టారర్‌, పైగా చారిత్రక నేపథ్యం. అందుకే అంత ఖర్చు. రానాని ‘హిరణ్యకశ్యప’గా చూపించబోతున్నారు గుణశేఖర్‌. ఈ సినిమా కోసం హాలీవుడ్‌ నిపుణుల్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేయబోతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ చిత్రానికి బడ్జెట్‌ దాదాపు రూ.200 కోట్లని ప్రచారం జరుగుతోంది.

ఆదాయ మార్గాలెన్నో
ఇది వరకు సినిమాకి రాబడి ప్రదర్శనకారుల నుంచే వచ్చేది. థియేటరికల్‌ రైట్స్‌ తప్ప మరో ఆదాయ మార్గం లేదు. ఆ తరవాత శాటిలైట్‌ మార్కెట్‌ వచ్చింది. దీంతో పాటు డిజిటల్‌ మార్కెట్‌ పెరగడం వల్ల ఆ రూపంలోనూ డబ్బులొస్తున్నాయి. హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ పేరిట మంచి మొత్తం నిర్మాతలకు అందుతోంది. ఓవర్సీస్‌ మార్కెట్‌లో తెలుగు సినిమా దమ్ము పెరిగింది. చైనా, జపాన్‌లాంటి దేశాల్లోనూ తెలుగు సినిమాలకు కాసుల వర్షం కురుస్తోంది. ఇవన్నీ నిర్మాతలలో భరోసా కల్పిస్తున్నాయి. కథకి అవసరమైన మేర ఖర్చు పెట్టడం తప్పు లేదు. పెద్ద హీరోల చిత్రాలకు అభిమానుల అండ ఉంటుంది. కాబట్టి బడ్జెట్‌ పెరిగినా తిరిగి వస్తుందన్న నమ్మకం ఉంటుంది. ఈమధ్య మధ్యస్థాయి కథానాయకుల చిత్రాలూ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. సినిమా బాగుంటే రూ.వంద కోట్లు వసూళ్లు పెద్ద కష్టం కాదని ‘గీతా గోవిందం’లాంటి చిత్రాలు రుజువు చేశాయి. అయితే కేవలం స్టార్‌డమ్‌ని నమ్ముకుని డబ్బులు వెదజల్లడమూ తప్పే. అలాంటి ప్రయత్నాల్ని ప్రేక్షకులు తిప్పికొడతారన్న నిజాన్ని మర్చిపోకూడదు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.