తెలుగు తెర ‘కొత్త’ పుంతలు!


2019 ద్వితీయార్థం టాలీవుడ్‌లో కొత్తగా రాబోతున్న నటీనటులతో కళకళలాడబోతోంది. విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్, జీవిత రాజశేఖర్‌ కుమార్తె శివాత్మిక, సాయిథర్మ తేజ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌లు తెలుగు తెరపై తెరంగేట్రం చేయబోతున్నారు. వీరు నటిస్తున్న సినిమాలకు దర్శకత్వం వహిస్తూ కొత్త దర్శకులు పరిచయం కాబోతున్నారు. విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘దొరసాని’. ఈ చిత్రంతోనే సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ రెండో తనయ శివాత్మిక కథానాయికగా పరిచయం కాబోతోంది. పీరియాడిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుబోతున్న ఈ సినిమా కె.వి.ఆర్‌.మహేంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. జూలై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం. మెగా హీరో సాయిధర్మ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’. ఇందులో వైష్ణవ్‌తో జంటగా కృతి శెట్టి నటిస్తోంది. టాలీవుడ్‌లో కృతి నటిస్తున్న తొలిచిత్రం ఇదే. దర్శకుడు సుకుమార్‌ వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు బుచ్చిబాబు. ‘ఉప్పెన’తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా త్వరలో తెలుగుతెరకు పరిచయం కాబోతున్నారు. రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు దాసరి లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మోనికా శర్మ మొదటిసారి అమన్‌ సరసన కనిపించబోతోంది. మొత్తంగా ఈ ఏడాది ద్వితీయార్థం తెలుగు తెరకు పరిచయం కాబోతున్న నాయకా,నాయికలకు, దర్శకులకు కీలకం కాబోతోంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.