థియేటర్‌ నుంచి వెబ్‌ సిరీస్‌కు..

‘రాత్రి పూట పుస్తకంలో కొన్ని పేజీలు తిప్పందే కొంతమందికి నిద్రరాదు. అలా ఇప్పుడు చాలా మందికి వెబ్‌ సిరీస్‌లు చూడటం అలవాటైంది. రోజూ ఒక ఎపిసోడ్‌నైనా ఆస్వాదించందే నిద్రపోరు. కొన్నాళ్ల తర్వాత మనకు వెబ్‌ సిరీస్‌లు తప్ప మరో  ప్రత్యామ్నాయం ఉండదేమో. ప్రతి ఒక్కరు  ఆ వేదికని దృష్టిలో ఉంచుకొని కథలు  సిద్ధం చేస్తారు’’.
- ఇదొక అగ్ర దర్శకుడి అభిప్రాయం
‘2020 నాటికి మన దేశంలో    డిజిటల్‌ మార్కెట్‌ రూ.35 వేల కోట్లకి చేరబోతోంది. ఇక నుంచి ప్రతి నిర్మాణ సంస్థ డిజిటల్‌ మాధ్యమాలని దృష్టిలో ఉంచుకొని కథలు సిద్ధం చేయాల్సిందే’’.
- ఒక నిర్మాత మాట ఇది
‘‘హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు వెబ్‌ సిరీస్‌లు వస్తున్నాయి. వాటిని అస్సలు చిన్నచూపు చూడకూడదు. వాటి స్థాయి అలాంటిది. భవిష్యత్తులో నా దగ్గరికీ ఒక మంచి కథ వస్తే చేయడానికి సిద్ధమే’’.
- ఇది ఒక యువ కథానాయకుడి అంతరంగం. 

వినోదం అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది సినిమానే. ఆ తర్వాత టెలివిజన్‌ వచ్చి కొంచెం వాటాని సొంతం చేసుకొంది. సినిమాలు మొదలుకొని... ధారావాహికల వరకు ఎన్నో  కార్యక్రమాలకి టెలివిజన్‌ వేదికైంది. అలా టీవీ  గట్టి పోటీగా మారినా... సినిమా దాని స్థానాన్ని అది ఎప్పుడూ కాపాడుకొంటూనే వచ్చింది. ప్రేక్షకులు సినిమాని చూసే విధానంలో మార్పు వచ్చిందేమో కానీ... సినిమాల మార్కెట్‌ మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అయితే కొన్నేళ్లుగా సినిమాని కూడా ప్రభావితం చేసే స్థాయిలో కొత్త రకమైన వినోద వేదికలు పుట్టుకొస్తున్నాయి. అంతర్జాల విస్తృతే అందుకు కారణం. డిజిటల్‌ మీడియా వల్ల తాజాగా   వెబ్‌ సిరీస్‌ల జోరు పెరిగింది. సినిమాని శాసించే స్థాయిలో అవి ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. మొన్నటిదాకా హిందీలోనే వెబ్‌ సిరీస్‌ల సందడి కనిపించింది. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోనూ   యువతరం వెబ్‌ సిరీస్‌ జపం చేస్తోంది. దాంతో నటులు, నిర్మాతలు, దర్శకులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మొన్నటిదాకా హిందీలోనే సిరీస్‌లు నిర్మించిన ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌) డిజిటల్‌ ఛానల్స్‌ ఇప్పుడు తెలుగు మార్కెట్‌పైనా దృష్టిపెట్టాయి.


థియేటర్‌లో సినిమా చూసే  ప్రేక్షకులు కొంతమందైతే... కూర్చున్నచోటే వినోదాన్ని ఆస్వాదించాలనే దృక్పథం మరికొందరిది. అలాంటప్పుడు టీవీ చూద్దామనుకుంటే అక్కడ కోరుకొన్న వినోదం అన్నిసార్లూ దొరక్కపోవచ్చు. ఈ ఇబ్బందే వెబ్‌ సిరీస్‌ల వైపు మళ్లిస్తోంది.  వెబ్‌ సిరీస్‌లు సినిమాకి సమానమైన వినోదంతో రూపుదిద్దుకొంటున్నాయి. సాంకేతికంగానూ ఉన్నతమైన హంగులు కనిపిస్తుంటాయి. ఇది డిజిటల్‌ యుగం. అంతర్జాలం అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాంతో ప్రేక్షకుడు వెబ్‌ ఛానల్స్‌కి మరింత దగ్గరవుతున్నాడు. ఆ ఆదరణని దృష్టిలో ఉంచుకొని డిజిటల్‌ ఛానల్స్‌ సినిమాలతో పాటు సొంతంగా  వెబ్‌ సిరీస్‌ల్ని నిర్మించి ప్రేక్షకుడికి అందుబాటులో ఉంచుతున్నాయి. సభ్యత్వం, ప్రకటనలు, బ్రాండింగ్‌ తదితరాల రూపేణా డిజిటల్‌ ఛానల్స్‌ ఆదాయాన్ని సమకూర్చుకుంటుంటాయి. యూట్యూబ్‌ మొదలుకొని... అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ ఫైవ్‌, హాట్‌స్టార్‌ ఇలా ఎన్నో వేదికల్లో వెబ్‌ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. 


అగ్ర నిర్మాణ సంస్థలదీ ఇదే దారి
ది ఫ్యామిలీమ్యాన్‌’ పేరుతో తెలుగు దర్శకులు రాజ్‌ నిడుమోరు, కృష్ణ డీకే తీసిన వెబ్‌సిరీస్‌ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకొంటోంది. అది సినిమాని తలదన్నే స్థాయిలో ఆదరణని సొంతం చేసుకొంది. అందులో తెలుగు నటులు ప్రియమణి, సందీప్‌కిషన్‌ కీలక పాత్రలు పోషించారు. దానికి లభించిన ఆదరణని దృష్టిలో ఉంచుకొని వెంటనే రెండో సీజన్‌కి రంగం సిద్ధమైంది. అందులో అగ్ర కథానాయిక సమంత నటిస్తోందని సమాచారం. ‘గ్యాంగ్‌స్టార్స్‌’తో అమెజాన్‌ స్టూడియోస్‌ తెలుగులో వెబ్‌ సిరీస్‌ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ నిర్మాణ సంస్థ     వైజయంతీ మూవీస్‌ కూడా ఇందులో భాగమైంది. జగపతిబాబు, నవదీప్‌, శ్వేతా బసుప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిహారిక చేసిన ‘ముద్దపప్పు ఆవకాయ’, లక్ష్మీప్రసన్న, శ్రీనివాస్‌ అవసరాల నటించిన ‘మిసెస్‌ సుబ్బలక్ష్మి’తో పాటు ‘గీతా సుబ్రమణ్యం’, అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పించిన ‘పెళ్లిగోల’ తదితర వెబ్‌ సిరీస్‌లు యువ ప్రేక్షకుల్ని  అలరించాయి. నిహారిక ప్రధాన పాత్రలో ‘మ్యాడ్‌హౌస్‌’ అనే మరో కొత్త సిరీస్‌ ఇటీవలే మొదలైంది. త్వరలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ఓ వెబ్‌  సిరీస్‌ని మొదలు పెట్టనున్నట్టు సమాచారం.
అవకాశాలకి నెలవు
నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అవకాశాల వేదికగా నిలుస్తున్నాయి వెబ్‌ సిరీస్‌లు. కంటెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి రచయితలకి అవకాశాలకి నెలవుగా మారింది ఈ మాధ్యమం. హాలీవుడ్‌, బాలీవుడ్‌లో అగ్ర నటులు సైతం వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ నటించిన ‘సేక్రెడ్‌ గేమ్స్‌’ సంచలనం సృష్టించింది. దీనికి రెండో సీజన్‌ కూడా సిద్ధమైంది. వివేక్‌ ఒబెరాయ్‌ ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించారు. రాధికా ఆప్టే ‘లస్ట్‌ స్టోరీస్‌, ‘సేక్రెడ్‌ గేమ్స్‌’తో పాటు ‘ఘౌల్‌’ అనే సిరీస్‌లో నటించింది. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ   తమిళంలో జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఓ సిరీస్‌లో నటిస్తోంది. ‘భరత్‌ అనే నేను’తో మెరిసిన కియారా అడ్వాణీ ‘లస్ట్‌ స్టోరీస్‌’ సిరీస్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మాధవన్‌ ‘బ్రీత్‌’ అనే సిరీస్‌లో నటించారు. ‘గూఢచారి’ నాయిక శోభిత ధూళిపాల ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ అనే హిందీ సిరీస్‌లో నటించింది. తెలుగు దర్శకుడు అవినాష్‌ కురువిల్లా ‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’ అనే సిరీస్‌ను సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో రూపొందించారు. దర్శకులు స్వేచ్ఛగా కథని చెప్పేందుకు వెబ్‌ సిరీస్‌లు ఉపయోగపడుతున్నాయి. సినిమా అంటే చాలా పరిమితుల మధ్య తీయాలి. సెన్సార్‌ నుంచి సమస్యలు ఎదురవుతుంటాయి. వెబ్‌ సిరీస్‌లతో ఆ సమస్యలు ఉండవు. రామ్‌గోపాల్‌ వర్మ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఓ వెబ్‌సిరీస్‌ని మొదలుపెట్టారు. ప్రేక్షకులకే కాకుండా..దర్శకనిర్మాతలకి, నటులకి వెబ్‌ సిరీస్‌లు ప్రత్యామ్నాయ వేదికలుగా మారుతున్నాయి.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.