సౌజన్యం..త్రివిక్రమం..సహచర్యం
ఏదయినా ఒక ప్రదర్శన ఇవ్వాలంటే దాదాపు మూడు నెలలు సాధన చేయాలి. అది కూడా గురు ముఖంగానే. అలాగే ప్రదర్శన ఇవ్వబోయే ప్రాంతంలోని ప్రేక్షకుల అభిరుచి, ఆసక్తికి తగ్గట్లుగానే అంశాన్ని ఎంచుకోవాలి. ముందుగా అంశం చర్చించుకున్నాక గురువుగారు దానికి కంపోజ్‌ చేస్తారు. మేం సాధన చేస్తాం...


సౌజన్యా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌... నిన్నమొన్నటి వరకూ... మాటల మాంత్రికుడి అర్థాంగిగా... పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి తమ్ముడి కూతురిగానే గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడామె... ఓ నృత్యకారిణి. రకరకాల ప్రదర్శనలు ఇస్తోన్న ప్రతిభావని. ఓ ఇల్లాలిగా... ఇద్దరు పిల్లల తల్లిగా... ఓవైపు బాధ్యతలను నెరవేరుస్తూనే... మరో వైపు నృత్యకళను కొనసాగిస్తోందామె.

పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలిచ్చిన సౌజన్య విశాఖపట్నంలో డిగ్రీ పూర్తిచేసింది. సరిగ్గా ఆ సమయంలోనే త్రివిక్రమ్‌తో పెళ్లవడంతో హైదరాబాద్‌ వచ్చేసింది. ఇక్కడికొచ్చిన తరువాతా నృత్యాన్ని కొనసాగించాలనుకుంది. దాంతో నెట్‌లో ఎవరైనా గురువు వివరాలు దొరికితే... చిరునామా వెతుక్కొని మరీ వెళ్లేది. అక్కడ కొన్ని రోజులు నేర్చుకునేసరికి ఏదో అసంతృప్తి. తాను కోరుకున్న నృత్యం అది కాదనే భావన. అలా చాలా చోట్ల శిక్షణ తీసుకుంది. పాత సినిమాల్లో క్లాసికల్‌ డాన్స్‌ ఉన్న పాటలన్నింటినీ ఆసక్తిగా చూసేది. ఎక్కడైనా శాస్త్రీయ నృత్య ప్రదర్శనలున్నా హాజరయ్యేది. వీటన్నింటికీ కారణం నృత్యంపై ఉన్న ఇష్టం, తపనే అంటుందామె. ‘ఇలా గురువుల దగ్గరకు వెళ్లడం, కొన్నాళ్లు నేర్చుకుని వచ్చేయడం మా వారు గమనించేవారు. చివరకో రోజు ఎవరైనా గురువు దొరుకుతారేమో చూద్దాం అని అన్నారు. ఎంత బిజీగా ఉన్నా... నాకోసం గురువుల వివరాలు సేకరించేవారు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో.. అని చెప్పేవారు. అయినా నాలో చిన్న అపరాధ భావన. పెళ్లై, ఇద్దరు పిల్లల తల్లయ్యాక మళ్లీ నృత్యం వైపు వెళ్తే బాగుంటుందా అని సందేహించేదాన్ని. ఆ సమయంలో చెన్నై కళాక్షేత్ర వ్యవస్థాపకురాలు రుక్మిణి అరుండేల్‌ గురించి చదివే అవకాశం వచ్చింది. ఇంతలో మంచి గురువు కూడా దొరకడంతో మళ్లీ నృత్యంవైపు అడుగులేశా’ అని చెబుతుంది సౌజన్య.

‘ప్రౌడ్‌ ఆఫ్‌ యూ’ అని అన్నారు...
అలా భర్త సహకారంతో సౌజన్య గురువు పసుమతి రామలింగ శాస్త్రి దగ్గర నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. రెండేళ్ల తరువాత వేదికపై ప్రదర్శన ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఈ మధ్య హైదరాబాద్‌, రవీంద్రభారతిలో ప్రదర్శన ఇచ్చింది. ఆ సమయంలో తన కన్నా, ఎదురుగా కూర్చుని చూస్తున్న భర్తే ఎక్కువ ఒత్తిడికి లోనయ్యారని చెబుతుందామె. ‘మావారు ముందు వరుసలో కూర్చున్నారు. ఆయన ముఖంలో చాలా టెన్షన్‌ కనిపించింది. ప్రదర్శన అంతా అయ్యాక దగ్గరకు వచ్చి ప్రౌడ్‌ ఆఫ్‌ యూ అని అన్నారు. ఆయన నుంచి నేనందుకున్న మొదటి ప్రశంస అది. ఇక పెద్దనాన్నకి అయితే నేనెప్పుడూ చిన్నపిల్లనే. నా ప్రదర్శన అయ్యేంతసేపూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఇతరుల ప్రశంసల కన్నా... వీళ్లిద్దరి నుంచి అభినందలు రావడం ఎప్పటికీ మర్చిపోలేను...’ అని అంటుందామె.

ఆయన సలహాతోనే...
ఓ వైపు ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు... మరో వైపు నృత్య సాధన. వీటితో ఒత్తిడి తప్పదు. ఆ సమయంలో భర్త సలహా తనకు మందులా పనిచేస్తుందని అంటుంది సౌజన్య. ‘పనులన్నీ ఒకేసారి చేయాలనుకోకు. ఒకటి పూర్తయ్యాకే మరొకటి. ఒకే లక్ష్యం పెట్టుకో... సాధించగలుగుతావ్‌ అని అంటూంటారు. ఆ మాటల్ని పాటిస్తా. నాట్య ప్రదర్శన ఇవ్వబోయే అంశాన్ని కూడా ఆయనతోనే చర్చిస్తా. దానికి కారణం ఆయనకు రామాయణం, భారతం, భాగవతం వంటి పురాణాలపై ఉన్న పట్టే. వాటికి సంబంధించి ఆయనకు తెలియని విషయం ఉండదు. అందుకే నాట్య ప్రదర్శనకు సంబంధించి ఎంచుకునే కాన్సెప్ట్‌, సందేహాలు ఆయన్నే అడిగి తెలుసుకుంటా. నాకే కాదు... పిల్లలకు కూడా పురాణ ఇతిహాసాల్లోని కథలు చెబుతారు. అప్పుడు నేనూ వాళ్లతోపాటు చిన్నపిల్లనై వింటా. పిల్లలకు చదువొక్కటే కాదు... కుటుంబ విలువల్ని నేర్పాలి అని అంటారాయన...’ అంటూ వివరిస్తుంది సౌజన్య.

మావారికి నేను పెట్టే కాఫీ చాలా ఇష్టం. నాకు మా వారు చేసిన సినిమాలన్నీ ఇష్టమే. ‘అతడు’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘అరవింద సమేత’... ఇలా అన్నీ నచ్చుతాయి. అయితే ప్రీవ్యూకి మాత్రం వెళ్లను. విడుదలయ్యాక థియేటర్‌కి వెళ్లి జనం మధ్యలో కూర్చుని చూడటమే ఇష్టం. ఆయన రాసిన డైలాగులకు జనం నవ్వుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతీ సినిమా చూసిన తరువాత ‘నీకు నచ్చిందా’ అని అడుగుతారాయన. నచ్చిందంటే, ఏ జోనర్‌ అనీ అడుగుతారు. మేమిద్దరం కలిసి చూసిన మొదటి సినిమా ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’ నాకెప్పుడూ ప్రత్యేకమే.

అదే నా లక్ష్యం...
నాకు మొదట్లో స్టేజ్‌ ఫియర్‌ ఉండేది. ఇప్పుడు లేదు. రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు బాగా చేయగలనా అని మావారిని అడిగా. ‘నీపై నీకు అపనమ్మకం ఉండకూడదు. అనుకున్న పని పూర్తి చేయగలను... అని మనసులో అనుకో. సాధించగలవు’ అని అన్నారు. అదే అనుసరించా. అలాగే ఫిట్‌గా ఉండటానికి నృత్యంతోపాటు యోగా చేస్తా. ఇప్పటివరకు చిన్నతనం నుంచీ కలిపి గ్రూప్‌, సోలో, సూత్రధారులుగా దక్షిణభారతదేశమంతా గురువుగారి ఆధ్వర్యంలో 30 వరకూ ప్రదర్శనలిచ్చా. నా అభిమాన నృత్యకళాకారిణి యామినీ కృష్ణమూర్తి. ఆ స్థాయికి వెళ్లాలనేదే నా ఆశ. నాట్య ప్రదర్శనలో ‘రిపోర్ట్‌వా’ కూడా చేయాలని ఉంది. పుష్పాంజలితో మొదలుపెట్టి అలరిప్పు, జతిస్వరం, శబ్దం, వర్ణం తరువాత జావళి లేదా కీర్తన... చివర తిల్లానాతో పూర్తి చేయాలి. నేను వేసే కృష్ణుడి వేషం, అభినయం మా వారికి చాలా చాలా ఇష్టం’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.