ముచ్చటగా మూడోసారి మురిపిస్తారా!!
చిత్రసీమలో హిట్‌ ఫార్మలా అనే పదానికి అనేక అర్థాలున్నాయి. దీన్ని కొన్ని సార్లు ఎంచుకునే కథలు డిమాండ్‌ చేస్తే.. మరికొన్ని సార్లు నాయకానాయికల జోడీలు, డైరెక్టర్‌ హీరో కాంబినేషన్‌లు ప్రభావితం చేస్తుంటాయి. అయితే వీటిలో మిగతా వాటికన్నా ఎక్కువగా అందరి దృష్టినీ ఆకర్షించేవి హిట్‌ కాంబినేషన్లే. ఈ కలయికలు బాక్సాఫీస్‌ వద్ద భలేగా మ్యాజిక్‌ చేస్తుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలాంటి క్రేజీ కాంబినేషన్లు కొన్ని తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.


* స్టైలిష్‌ స్టార్‌.. డబుల్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌

ప్రస్తుతం ఈ క్రేజీ కలయికల విషయంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వాడు అల్లు అర్జున్‌. ఎందుకంటే ప్రస్తుతం బన్నీ కథానాయకుడిగా నటిస్తోన్న ‘ఏఏ 19’, దీని తర్వాత పట్టాలెక్కబోయే ‘ఏఏ 20’ రెండూ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లే. ‘ఏఏ 19’కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దీని కన్నా ముందు బన్నీతో కలిసి ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించారు. ఈ నేపథ్యంలోనే ఈ హ్యాట్రిక్‌ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


ఇక ‘ఏఏ 20’ విషయానికొస్తే.. దీనికి దర్శకత్వం వహించబోతున్నది సుకుమార్‌. ‘రంగస్థలం’ వంటి హిట్‌ తర్వాత ఆయన తెరకెక్కించబోతున్న చిత్రమిది. అల్లు అర్జున్‌ స్టార్‌ కథానాయకుడిగా నిలబడటంలో, ఆయన్ను స్టైలిష్‌ స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో నిలపడంలో సుక్కు పాత్ర ఎంతో ఉంది. వీరిద్దరి కలయిలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ బాక్సాఫీస్‌ ముందు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ముచ్చటగా మూడో విజయమందుకునేందుకు మళ్లీ సెట్స్‌పైకి వెళ్లబోతోంది బన్నీ - సుక్కు జోడీ. మే 11న ఈ చిత్ర షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌ వెండితెరపై మెరవబోతుండటంతో ప్రేక్షకులు దీనిపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.


* మోహనకృష్ణుడితో మరోసారి మురిపించేందుకు..
తొలి అడుగులోనే ‘అష్టాచమ్మా’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించి.. హీరోగా నానిని వెనుతిరిగి చూసుకునే పనిలేకుండా చేశారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. దీని తర్వాత వీరిద్దరూ కలిసి ‘జెంటిల్‌మన్‌’తో రెండోసారి బాక్సాఫీస్‌ ముందుకు రాగా.. సినీప్రియులు మరో హిట్‌ను అందించి వారిని ఆశీర్వదించారు. ఇప్పుడీ జోడీ మరో వైవిధ్యభరిత కథా చిత్రంతో మూడోసారి అలరించేందుకు సెట్స్‌పై అడుగుపెట్టింది. ‘వి’ అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో నాని ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో నానితో పాటు యువ హీరో సుధీర్‌ బాబు కూడా మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ఇది ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


* మాస్‌ మహారాజా.. గోపీచంద్‌ మలినేని

గోపీచంద్‌ మలినేని - రవితేజ.. ఈ కాంబినేషన్‌ పేరు చెప్పగానే ‘డాన్‌ శీను’, ‘బలుపు’ వంటి సూపర్‌ హిట్లే మదిలో మెదులుతాయి. రవితేజలోని ఎనర్జీని, ఆయనలోని హైవోల్టేజి పెర్ఫామెన్స్‌ను సరిగ్గా వాడుకుంటే బాక్సాఫీస్‌ ముందు ఏ స్థాయిలో వసూళ్లు అందుకోవచ్చో ఈ చిత్రాలతో అందరికీ తెలియజేశాడు గోపీచంద్‌. ఇప్పుడీయన రవితేజతో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కావడంతో.. పూర్వ నిర్మాణ పనులను షురూ చేసేశారు. త్వరలోనే దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారు మలినేని. మరి ఈ హ్యాట్రిక్‌ చిత్రంతో మరోసారి తమ మ్యాజిక్‌ను ప్రేక్షకులకు రుచి చూపిస్తారేమో వేచి చూడాలి.


* నందమూరితో.. బోయపాటి హ్యాట్రిక్‌ మార్క్‌..

వరుస పరాజయాలతో డీలా పడిన దశలో నందమూరి బాలకృష్ణకు ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ విజయాలనందించి ఆయన కెరీర్‌కు కొత్త ఊపునిచ్చారు బోయపాటి శ్రీను. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో మరో చిత్రమనగానే ప్రేక్షకుల్లో సాధారణంగానే మంచి అంచనాలు ఏర్పడిపోతాయి. అందుకే దీనికి తగ్గట్లుగానే మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో మూడోసారి తెరపైకి దూకబోతుంది ఈ జోడీ. జూన్‌ నుంచి సెట్స్‌పైకి వెళ్లబోయే ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల్ని పలకరించనుంది.


* అవసరాలతో కలిసి హిట్‌ ట్రాక్‌ ఎక్కేందుకు..

నాగశౌర్య - అవసరాల శ్రీనివాస్‌ కాంబినేషన్‌కు చిత్రసీమలో మంచి పేరుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద చక్కటి విజయాల్ని అందుకున్నాయి. వీరిద్దరికీ నటుడిగా, దర్శకుడిగా మంచి పేరు కూడా తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే శౌర్యకు తన కథ వినిపించగా.. అతను కూడా ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈ సినిమా థియేటర్లలోకి రానుందట.


ప్రస్తుతం పట్టాలెక్కుతోన్న ఈ హ్యాట్రిక్‌ కాంబినేషన్లపై ప్రేక్షకులే కాదు.. ఆ చిత్ర దర్శకుడు, కథానాయకుడు సైతం భారీ ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే వీరిలో ఒక్క నాని తప్ప మిగతావారంతా ఓ సరైన హిట్‌ కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్న వారే. ఈ నేపథ్యంలో తమకు అచ్చొచ్చిన హిట్‌ కాంబినేషన్‌తోనైనా పరాజయాల పరంపరకు బ్రేక్‌ చెప్పాలని ఎదురు చూస్తున్నారు. మరి వీరిలో ఎంత మంది హ్యాట్రిక్‌ హిట్లు కొడతారో వేచి చూద్దాం.


- మందలపర్తి రాజేశ్‌ శర్మ, ఈనాడు డిజిటల్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.