త్రైమాసిక ఫలితాల్లో బాలీవుడ్‌ భేష్‌
రూ.వెయ్యి కోట్ల వసూళ్లు
ఏడాది బాలీవుడ్‌ అదరగొట్టేస్తోంది. విజయాల పరంగానూ, వసూళ్ల విషయంలోనూ రికార్డులు సృష్టిస్తోంది. కథలో నవ్యత ఉంటే చాలు.. తారాగణంతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తొలి మూడు నెలల్లో బాక్సాఫీసు వద్ద బాలీవుడ్‌ చిత్రాలు చేసిన సందడే అందుకు నిదర్శనం. ఈ మూడు మాసాల్లో బాలీవుడ్‌ చిత్రాలు మొత్తంగా రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచాయి. జనవరి నుంచి మార్చిలోపే ఆ స్థాయి వసూళ్లు రావడం ఈ ఏడాదే తొలిసారి కావడం విశేషం. దీంతో బాలీవుడ్‌ చిత్రసీమ ఆనందోత్సాహాల్లో తేలిపోతోంది.ఈ ఏడాది బాలీవుడ్‌ విజయ యాత్ర ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’తో మొదలైంది. సోలో హీరోగా ఇంతవరకూ చేయని విక్కీ కౌశల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. దానికి తోడు కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం కావడంతో విడుదలకు ముందు పెద్ద అంచనాలేమీ లేవు. కానీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకొని ఆశ్చర్యపరిచింది. ఏకంగా రూ.200 కోట్ల మార్కు దాటేసింది. ఆ తర్వాత వచ్చిన ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ ఈ విజయ ప్రస్థానాన్ని కొనసాగించింది. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో ఆమెతో పాటు క్రిష్‌ తెరకెక్కించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదలై రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఫిబ్రవరిలో విడుదలైన ‘గల్లీ బాయ్‌’ కూడా శభాష్‌ అనిపించింది. రణ్‌వీర్‌ సింగ్,ఆలియా భట్‌ జంటగా నటించిన ఈ చిత్రం స్టార్‌ హీరోలు కూడా గ్లామర్‌కు దూరంగా ప్రయోగాత్మక పాత్రలు చేయొచ్చనే ఉత్సాహాన్నిచ్చింది. అజయ్‌ దేవగణ్, అనిల్‌ కపూర్, మాధురీ దీక్షిత్‌ తదితరులు నటించిన మల్టీస్టారర్‌ కామెడీ చిత్రం ‘టోటల్‌ ధమాల్‌’ నవ్వించడంలో విజయం సాధించి వసూళ్లు చేచ్కీజిజిక్కించుకుంది. ‘లుకా చుప్పి’తో మార్చి నెల కూడా విజయాల బాట పట్టింది. కార్తిక్‌ ఆర్యన్, కృతి సనన్‌ లాంటి తారలతో వచ్చిన ఈ లోబడ్జెట్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అమితాబ్‌ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘బద్లా’ మెప్పించింది. అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన ‘కేసరి’ విజయ పరంపర కొనసాగిస్తోంది. ఈ ఉత్సాహంతో తర్వాతి చిత్రాల కోసం ప్రేక్షకులతో పాటు బాలీవుడ్‌ పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ‘‘తొలి మూడు నెలల్లోనే రూ.వెయ్యి కోట్ల వ్యాపారం జరగడం బాలీవుడ్‌ చరిత్రలో ఇదే తొలిసారి. అది కూడా మీడియమ్‌ బడ్జెట్‌తో వచ్చిన విభిన్న నేపథ్య చిత్రాలు విజయం సాధించడం శుభ పరిణామ’’మని ట్రేడ్‌ విశ్లేషకుడు జోగిందర్‌ టుటేజా పేర్కొన్నారు.
ఈ చిత్రాలదే సందడి.చిత్రం: వసూళ్లు
ఉరీ రూ.245 కోటు
మణికర్ణిక రూ.118 కోట్లు
గల్లీబాయ్‌ రూ.140 కోట్లు
టోటల్‌ ధమాల్‌ రూ.153 కోట్లు
లుకా చుప్పి రూ.90 కోట్లు
బద్లా రూ.70 కోట్లు
కేసరి రూ.110 కోట్లు(ఇప్పటివరకూ)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.