అప్పుడు నన్ను అందరూ వింతగా చూశారు!
అతను హీరోతో కథ నడిపించే మనిషి కాదు.. కథనే హీరోగా నడిపించే మనిషి..
అతను కసితోనే పనిచేసే మనిషి కాదు.. కసితో పని చేయించే మహా రుషి కూడా..
అతను గెలిచే మనిషి మాత్రమే కాదు.. గెలుపును ప్రపంచానికి పరిచయం చేసే మహర్షి..
సినిమా సినిమాకీ తన స్థాయిని పెంచుకునే మనిషి కాదు.. సినిమా స్థాయిని కూడా పెంచే దమ్మున్న మనిషి..
అతనే వంశీ పైడిపల్లి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సంగతులు పంచుకున్నారు.


కంగ్రాట్స్‌ వంశీ. ఈ ఏడాది ‘మహర్షి’తో మంచి విజయాన్ని అందుకున్నందుకు..!
వంశీ పైడిపల్లి
: థాంక్యూ.

మహేశ్‌తో సినిమా చేయడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు?
వంశీ పైడిపల్లి: మేమిద్దరం కలిసి పనిచేద్దామని అంతకుముందు కూడా అనుకున్నాం. అది వర్కవుట్‌ కాలేదు. ఆ తర్వాత నేను ‘ఊపిరి’ చేశా. ఈ సినిమా తర్వాత నేను మహేశ్‌ను కలిసి ఒక లైన్‌ చెప్పాను. ‘బాగుంది. డెవలప్‌ చేస్తే పూర్తి కథ వింటాను’ అన్నారు. ఆరు నెలలు కూర్చొన్ని పూర్తి కథ సిద్ధం చేసిన తర్వాత చెబితే ఆయనకు విపరీతంగా నచ్చింది. అప్పటికే మహేశ్‌ చేతిలో ‘స్పైడర్’, ‘భరత్‌ అనే నేను’ చిత్రాలు ఉన్నాయి. అయితే, ‘కథ నాకు బాగా నచ్చింది వంశీ. ఏం చేద్దాం’ అన్నారు. ‘ఫర్వాలేదు సర్‌ నేను వెయిట్‌ చేస్తా’అని చెప్పా. నేను ‘మహర్షి’ కథ మహేశ్‌ను ఊహించుకుని రాసిందే. దాని నుంచి బయటకు వచ్చి వేరే సినిమా చేద్దామని నాకు అనిపించలేదు.

దర్శకుడు కాకముందు ఎవరి దగ్గర పనిచేశారు?
వంశీ పైడిపల్లి: నా తొలి చిత్రం ‘ఈశ్వర్‌’. జయంత్‌గారి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. ప్రభాస్‌కూ, నాకూ మొదటి సినిమా అదే. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి, మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ సోదరుడు మార్తాండ్‌ కె.శంకర్‌ నాకు ఫ్రెండ్‌. ఆయన ద్వారా జయంత్‌గారి దగ్గరికి వచ్చా. దాదాపు మూడు నెలలు ఆయన చుట్టూ తిరిగాను. చివరికి రేపు షూటింగ్‌ అనగా, ఫోన్‌ చేసి రమ్మన్నారు. నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి వస్తున్నప్పుడు నన్ను అందరూ వింతగా చూశారు. అయితే, నేను మాత్రం అసిస్టెంట్‌ డైరెక్టర్ అయితే చాలులే అనుకుని వచ్చా. భవిష్యత్‌ ఏమవుతుందో కూడా తెలియదు.

ఆ తర్వాత ఎవరి దగ్గర పనిచేశారు?
వంశీ పైడిపల్లి: ‘ఈశ్వర్‌’ సినిమాతోనే నేనూ, ప్రభాస్‌ స్నేహితులయ్యాం. దాంతో ‘వర్షం’ సినిమాకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేశా. ఆ సినిమాలో మూడు పాటలకు లారెన్స్‌ కొరియోగ్రఫీ చేశారు. అప్పుడు నాగార్జునగారితో ‘మాస్‌’ సినిమా ఒకే కావడం, లారెన్స్‌ మాస్టర్‌ ఆ సినిమాకు పనిచేయమని నన్ను అడగడంతో వెళ్లా. ఆ తర్వాత దిల్‌రాజుగారు ‘భద్ర’ సినిమాకు చేయమని అడిగారు. అయితే, సగం సినిమా అయిపోయాక వెళ్లి జాయిన్‌ అయ్యా. ఆ సినిమా చేస్తున్నప్పుడే ‘వంశీ నువ్వు సినిమా కథ రాసుకో చేద్దాం’ అని రాజుగారు అనడంతో ‘మున్నా’ కథ రాశా. 26ఏళ్లకే నేను డైరెక్టర్‌ను అయిపోయా. మొదటి సినిమా చాలా ఈజీగా వచ్చేసింది.

సాధారణంగా ఒక సినిమాకు డైరెక్టర్‌ అవ్వాలంటే చాలా కష్టపడాలి? మరి మీకు అంత తేలిగ్గా అవకాశం ఎలా వచ్చింది?
వంశీ పైడిపల్లి: ‘భద్ర’ చేస్తుండగానే రాజుగారు నన్ను కథ రాసుకోమని చెప్పారు. అలా నాకు వచ్చిన ఆలోచనను ప్రభాస్‌కు చెబితే, తనూ ఒప్పుకొన్నాడు. నా మొదటి సినిమా అవకాశం చాలా ఈజీగా వచ్చేసింది. అసలైన జీవితం అంటే ఏంటో తెలిసింది మాత్రం.. మొదటి సినిమా తర్వాతే.

‘మున్నా’ హిట్టా.. యావరేజా.. ఫ్లాపా..?
వంశీ పైడిపల్లి: నాకు తెలిసి అది హిట్‌ సినిమా కాదు. మేము అనుకున్నట్లుగా సినిమా రీచ్‌ కాలేదు. నా వల్లే సినిమా హిట్‌ కాలేదు. రాజుగారు నేను అడిగినంత ఇచ్చారు. ప్రభాస్‌ కూడా నన్ను నమ్మి సినిమా చేశారు. అయితే, ఆ వయసులో త్వరగా అవకాశం రావడం వల్ల కాస్త పొగరు పెరిగిందనుకుంటా. దాంతో సినిమా ఆడలేదు. ఆ బాధ్యత నాదే. అందుకే దర్శకుడిని కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అంటారు.

ఒక సినిమా ఫ్లాప్‌ అయితే, మళ్లీ హిట్‌ కొట్టాలని ఏ దర్శకుడికైనా కసి ఉంటుంది. మరి వంశీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారట!
వంశీ పైడిపల్లి: నాకు ఎన్నో కష్టాల తర్వాత దర్శకుడిగా అవకాశం వచ్చి ఉంటే డిప్రెషన్‌లోకి వెళ్లి ఉండేవాడిని కాదు. చాలా ఈజీగా అవకాశం వచ్చింది కాబట్టి, కష్టం తెలిసింది. తొలి అవకాశం దక్కించుకోవడానికి అందరూ కష్టపడుతుంటారు. కానీ, నాకు ఫస్ట్‌ సినిమా అయిపోయి, అది అనుకున్నంత విజయం సాధించలేకపోవడంతో నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేశా. దాన్ని డిప్రెషన్‌ అనడం కన్నా, ఆ ఏడాది కాలం నాకు చాలా దోహదపడింది. ఒకవేళ నేను తీసిన తొలి సినిమా విజయం సాధించి ఉంటే, ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఇప్పుడు ప్రతి సినిమాకు ఎంతో జాగ్రత్తగా అన్ని అంశాలు మేళవించి ఎమోషన్స్‌ ఉండేలా చూసుకుంటున్నా. అక్కడ తడబడ్డాను కాబట్టే, ఆ తర్వాత జాగ్రత్త పడుతున్నా.

మీ సొంతూరు ఏది?
వంశీ పైడిపల్లి: ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌. అసలు మా అమ్మానాన్నలది కరీంనగర్‌ జిల్లా జగిత్యాల దగ్గర బీమారం. వాళ్లకు పెళ్లయిన తర్వాత ఖానాపూర్‌లో థియేటర్‌ కొన్నారు. ఆ తర్వాత నాలుగు నెలలకు నేను పుట్టాను. నా చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. బేగంపేట హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో చదివా. సెలవులకు ఇంటికి వెళ్తే, థియేటర్‌లో ఎక్కువ గడిపేవాడిని. అప్పట్లో ఒక్కో సినిమా 100, 200 రోజులు ఆడేది. దీంతో ఎక్కువ సమయం థియేటర్‌లో గడుపుతూ అన్నీ నేర్చుకున్నా.

అందరూ సైలెంట్‌గా సినిమా చూస్తుంటే, మీరు మాత్రం థియేటర్‌లో గోలగోల చేసేవారట?
వంశీ పైడిపల్లి: చాలా సినిమాలకు అలా జరిగింది(నవ్వులు),. ‘ప్రేమదేశం’ సినిమాకైతే లాఠీ దెబ్బలు కూడా తిన్నా. అందులో లీనమైపోయి చూస్తుంటా. అందుకే ప్రతి సన్నివేశానికీ స్పందిస్తుంటా. అలా గోల చేస్తుంటే, కొట్టి థియేటర్‌ నుంచి పంపించేశారు. అదే థియేటర్‌లో ఇప్పుడు నేను దర్శకత్వం వహించిన ‘మహర్షి’ విడుదలైంది.

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ సుదర్శన్‌ థియేటర్‌లో ‘ఒక్కడు’ సినిమాను ఒక సాధారణ వ్యక్తిలా చూసిన వంశీ.. అదే హీరో మూవీకి డైరెక్షన్‌ చేస్తానని అనుకున్నారా?
వంశీ పైడిపల్లి: అస్సలు అనుకోలేదు. ఆ సినిమా విడుదలైనప్పుడు మహేశ్‌ నా కన్నా మూడు సీట్ల ముందుకు కూర్చొని చూస్తున్నారు. ఆయన వెనుక నేను కూర్చొని ఉన్నా. ‘మురారి’ సమయంలో నేను ముందు కూర్చొని ఉంటే ఆయన నా వెనకాల కూర్చొని ఉన్నారు. సినిమా చూస్తూ మధ్య మధ్యలో ఆయనని చూసేవాడిని. (మధ్యలో అలీ అందుకుని.. మురారి మహేశ్‌ ముందు కూర్చొని చూశావు. ‘ఒక్కడు’ ఆయన వెనకాల కూర్చొని చూశావు. ‘మహర్షి’ ఆయనతో కలిసి కూర్చొని చూశావు. కాలం ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు కదా) నిజమే! మహేశ్‌ 25వ సినిమాకు నేను దర్శకత్వం వహించడం. అదే సుదర్శన్‌ థియేటర్‌లో ఆయన పక్కన కూర్చొని చూడటం.. ఇవన్నీ చెప్పడానికి మాటలు చాలవు. అప్పట్లో నా కోరిక బలమైనది అనుకుంటా. అది ఇప్పుడు నిజమైంది. మహేశ్‌ కూడా ఇదే చెబుతారు.


‘మున్నా’ ఆడకపోయినా, దిల్‌రాజు, ఎన్టీఆర్‌లు మీలో ఏం చూసి ‘బృందావనం’ సినిమాలో అవకాశం ఇచ్చారు?
వంశీ పైడిపల్లి: ‘మున్నా’ తర్వాత నాకు చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. నేను ఏ సినిమానైనా పెద్దగానే చూస్తా. చిన్నప్పటి నుంచి అది అలవాటైంది. అందుకే మళ్లీ సినిమా చేస్తే పెద్ద హీరోతోనే చేయాలనుకున్నా. ‘మున్నా’ తర్వాత ఏడాది పాటు నాకు సంపాదన లేదు. మా నాన్నగారు నన్ను పోషించారు. నా పెళ్లి కూడా ఆయనే చేశారు. చిన్నప్పటి నుంచి డబ్బుల విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా నన్ను చూసుకున్నారు. వాళ్లు ఇబ్బంది పడినా, నాకు కష్టం తెలియకుండా పెంచారు. నేను రెండో సినిమా మొదలు పెట్టడం వెనుక నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ‘మున్నా’ టీజర్‌ చూసి ఎన్టీఆర్‌ నాకు ఫోన్‌ చేశారు. అప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం పెరిగింది. ఆ సినిమా విడుదలైన తర్వాత ‘వంశీ నువ్వు దర్శకుడిగా ఫెయిల్‌ కాలేదు. కథలో ఎక్కడో లోపం ఉంది. మంచి కథ సిద్ధం చేసుకుంటే బాగుంటుంది’ అన్నారు. ఆ తర్వాత ఒక కాఫీ షాప్‌లో నేనూ, చరణ్‌ అనుకోకుండా కలిసినప్పుడు ఆయన కూడా ఇదే మాట అన్నారు. ఆ ఏడాది ఇవన్నీ నాకు ఒక మోటివేషన్‌లా పనిచేశాయి. ఆ తర్వాత ‘బృందావనం’ కథ రాసుకున్నా. మళ్లీ రాజుగారిని కలిసి ఈ ఆలోచన చెప్పా. ఆయనకు బాగా నచ్చింది. దీంతో ఎన్టీఆర్‌కు కథ చెప్పా. ఫస్ట్‌లైన్‌ చెప్పగానే లేచి హగ్‌ చేసుకుని ‘మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు. మన దగ్గర విజయాలు లేనప్పుడు మనల్ని నమ్మడమే నిజమైన నమ్మకం. రాజుగారి కుటుంబం నన్ను ఒక దర్శకుడిగా ఎప్పుడూ చూడలేదు.


‘బృందావనం’ సెట్‌ వేసినప్పుడు వర్షం వచ్చి మునిగిపోయిందట!
వంశీ పైడిపల్లి: అసలు జరిగింది అది కాదు. సెట్‌ వేసి సినిమా తీశాం కూడా. క్లైమాక్స్‌ మిగిలిపోయింది. భారీగా ఉండాలని హైదరాబాద్‌ శివార్లులో చెరువు పక్కన సెట్‌ వేశాం. వేసవికాలంలో సెట్‌ వేసి, సినిమా అంతా అక్కడే తీశాం. చివర్లో క్లైమాక్స్‌ తీద్దామని అనుకున్నాం. ఈలోపు వర్షాకాలం ప్రారంభమై చెరువు నిండిపోయి ఇల్లు కూడా మునిగిపోయింది. స్విట్జర్లాండ్‌ వెళ్లి సాంగ్స్‌ చేసుకుని వచ్చేసరికి ‘సెట్‌ మునిగిపోయింది’ అని చెప్పారు. క్లైమాక్స్‌ గుడిలో తీద్దామని దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో ఉండగా ఆలోచన వచ్చింది. దీంతో ‘దాన వీర శూర కర్ణ’ నుంచి పెద్ద ఎన్టీఆర్‌ విజువల్స్‌ తీసుకుని పూర్తి చేశాం. అది మన మంచికే జరిగిందనుకోవాలి.

మీది లవ్‌ మ్యారేజ్‌ కదా!
వంశీ పైడిపల్లి: నేను ‘భద్ర’ షూటింగ్‌ కోసం బెంగళూరు వెళ్లా. అక్కడ శ్వేత అనే డిజైనర్‌తో పాటు మాలిని (వంశీ భార్య) కూడా ఉన్నారు. మాలినిని శ్వేత నాకు పరిచయం చేసింది. ఆ రోజు పుట్టిన రోజు కావడంతో తనకి విషెస్‌ కూడా చెప్పా. ఆ తర్వాత తను వెళ్లిపోతుంటే కారు ఇచ్చి పంపించా. అదే రోజు సాయంత్రం రవితేజ అన్నతో కలిసి శ్వేత, నేను డిన్నర్‌కు వెళ్లాం. అప్పుడు శ్వేత మాలినికి ఫోన్‌ చేసి మాట్లాడుతుంటే నేను కూడా మాట్లాడా. ఆ తర్వాత తన ఫోన్‌ నెంబరు తీసుకున్నా. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం. దీంతో తనపై నాకు ఒక ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడింది. మరో వారం రోజుల్లో హైదరాబాద్‌ వెళ్లిపోతామనగా, తనని కలవాలని అనిపించింది. రాజుగారిని కలిసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చెప్పా. ఆయన ఆశ్చర్యపోయారు. కారు తీసుకుని బెంగళూరు వెళ్లా. తనికి ఫోన్‌చేస్తే రానని చెప్పింది. అయినా నేను వెయిట్‌ చేస్తానని చెప్పా. గంట తర్వాత ఆ అమ్మాయి వచ్చింది. ఇద్దరం మాట్లాడుకున్నాం. తను వెళ్లేటప్పుడు తిరిగి చూస్తుందనుకున్నా. అలా చూస్తే నా ప్రేమ నిజమవుతుందని భావించా. కానీ, చూడలేదు(నవ్వులు). నెల రోజుల తర్వాత ఫోన్‌ చేసి ‘నాకు పెళ్లి చూపులు’ అని చెప్పింది. నేను ఫోన్‌ పెట్టేశా. రెండు, మూడు రోజుల తర్వాత ఫోన్‌ చేసి, ‘ఏంటి ఫోన్‌ చేయడం మానేశావు’ అని అడిగింది. ‘నీకు పెళ్లి చూపులు అన్నావు కదా! ఇక ఎందుకులే చేయడం అని మానేశా’ అని అన్నాను. ‘నువ్వు ప్రేమ విషయం చెబుతావేమోనని వెయిట్‌ చేస్తున్నా. చెప్పాలి కదా’ అంది. దీంతో ఇద్దరం నవ్వుకున్నాం. 2007లో పెళ్లి చేసుకున్నా.

మీ కుటుంబం ఎక్కడ ఉంటోంది?
వంశీ పైడిపల్లి: ఇక్కడే హైదరాబాద్‌లో ఉంటున్నాం. చిన్నప్పుడు మా అమ్మానాన్న నాకు కష్టం తెలియకుండా పెంచారు. ఇప్పుడు వారికి కష్టం తెలియకుండా చూసుకుంటున్నా. మన పిల్లలకు కష్టం తెలియకూడదనే ఉద్దేశంతోనే వాళ్లు పెంచుతారు. వాళ్లు పెద్ద వాళ్లయిన తర్వాత మనం చూసుకోకపోతే జీవితానికి ఒక అర్థం ఉండదు. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే వారే కారణం. నిజమైన సక్సెస్‌ అంటే, డబ్బున్న వాళ్లంతా హ్యాపీగా ఉన్నట్లు కాదు. రోజంతా కష్టపడి ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడ చిరునవ్వులు కనిపిస్తే, అది నిజమైన సక్సెస్. అది దేవుడి దయ.

‘ఊపిరి’ సినిమా కోసం ఎన్టీఆర్‌ను అనుకున్నారా?
వంశీ పైడిపల్లి: అవును కార్తీ చేసిన పాత్రకు ఎన్టీఆర్‌ను అనుకున్నాం. అయితే, అప్పటికి ఎన్టీఆర్‌ వేరే సినిమాకు డేట్స్‌ ఇచ్చారు. మరోపక్క నాగార్జునగారు కూడా వేరే సినిమాలను ఒప్పుకొన్నారు. దీంతో ఎవరు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నప్పుడు కార్తీ కనిపించారు. వెళ్లి ఆయనకు కథ చెబితే నచ్చి ఒప్పుకొన్నారు. దీని వల్ల తమిళంలో కూడా సినిమా విడుదల చేసే అవకాశం వచ్చింది.


కథ చెప్పగానే నాగార్జున ఒప్పుకొన్నారా?
వంశీ పైడిపల్లి: నేను కథ చెప్పడానికి రెండేళ్ల ముందే ఆయన ఫ్రెంచ్‌లో ఈ సినిమాను చూశారట. ‘ఇలాంటి సినిమా నేను చేస్తే బాగుంటుంది’ అని అమలగారితో అన్నారట. నేను కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ఆయన వెంటనే ఒప్పుకొన్నారు. అయితే, కథను మన నేటివిటీకి మార్చడానికి రెండు మూడు వెర్షన్స్‌ రాసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తెరపై మీరు చూసింది ఫైనల్‌ వెర్షన్‌.

‘మహర్షి’లో వీకెండ్‌ వ్యవసాయం ఆలోచన ఎవరిది?
వంశీ పైడిపల్లి: నేనూ, హరీశ్‌ సాల్మన్‌ కలిసి ఆలోచించాం. సమస్యలు చెప్పడమే కాదు, దాని పరిష్కార మార్గాలు చెప్పడం కూడా తెలియాలి అని ఇది చూపించాం. చెన్నైలో వీకెండ్‌ వ్యవసాయం చేసే పద్ధతి ఉందని ఆ తర్వాత మాకు తెలిసింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కొందరు వ్యవసాయం బాట పడుతున్నారని తెలుసు కానీ, వీకెండ్‌ ఫార్మింగ్‌ అప్పటికే ఉందని తెలియదు.


‘మహర్షి’కి ముగ్గురు నిర్మాతలు ఉండటానికి కారణం?
వంశీ పైడిపల్లి: అలా జరిగిపోయింది. కథ అందరికీ నచ్చింది. నాకు, మహేశ్‌కి ఉన్న కమిట్‌మెంట్స్‌ వల్ల అందరూ తలో చేయి వేశారు. నేను చాలా హ్యాపీగా ఫీలైన అంశం ఏంటంటే, అశ్వనీదత్‌గారు నిర్మాణంలో పనిచేయడం. ఎందుకంటే చిన్నప్పుడు ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చూసి అసలు ఇంత అద్భుతంగా సినిమా ఎవరైనా తీస్తారా అనుకున్నా. అలాంటి వ్యక్తితో ఈ సినిమా చేశా. నాకు దర్శకుడిగా జన్మనిచ్చిన రాజుగారు, ‘ఊపిరి’ సినిమాను నిర్మించిన పీవీపీగారు.. ఇలా అందరూ కలవడం ‘మహర్షి’ విజయంలో వాళ్లదే కీలక పాత్ర. వాళ్లు ఈ సినిమాను నమ్మారు.

మీ అమ్మగారు మీకు ఇచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఏది?
వంశీ పైడిపల్లి: ‘ఊపిరి’ చూసిన తర్వాత నన్ను హగ్‌ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘మహర్షి’ చూసిన తర్వాత అమ్మానాన్న ఇద్దరూ హగ్‌ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. దాని కన్నా పెద్ద విజయం మరొకటి ఉండదు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలేసి వచ్చినప్పుడు నన్ను ఎవరూ నమ్మలేదు. ప్రపంచం కూడా నమ్మలేదు. అమ్మ మాత్రమే నమ్మింది.

జీవితంలో ఇప్పటివరకూ మీకు మాత్రమే తెలిసిన సీక్రెట్‌ ఏదైనా ఉందా?
వంశీ పైడిపల్లి: (నవ్వులు) చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి. ఇంట్లో అమ్మకు తెలియకుండా డబ్బులు తీసుకుని సినిమాలు చూసేవాడిని. ఇంతవరకూ ఎవరికీ ఆ విషయం తెలియదు. అయితే, కేవలం సినిమా కోసం మాత్రమే డబ్బులు తీసేవాడిని తప్ప. ఇతర ఏ విషయంలోనైనా అలా చేసేవాడిని కాదు. నాకు మందు, సిగరెట్‌ అలవాటు కూడా లేదు. అమ్మా.. నీకు సారీ చెబుతున్నా.

వంశీ పైడిపల్లి డైరెక్టర్స్‌ని, హీరోలని ఇమిటేట్‌ చేస్తారని విన్నాం?
వంశీ పైడిపల్లి: (నవ్వులు) అస్సలు చేయను. కానీ, అనిల్‌ రావిపూడి చేస్తాడు. నాకు యాక్టింగ్‌ అస్సలు రాదు.

మీ తర్వాతి సినిమాలేంటి?

వంశీ పైడిపల్లి
: ప్రస్తుతానికి విహారయాత్ర నిమిత్తం వెళ్తున్నా. అంతా సిద్ధంగా ఉంది. వచ్చిన తర్వాత ప్రకటిస్తా.

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం

సాఫ్ట్‌వేర్‌ జాబ్‌: నా గతం
అసిస్టెంట్‌ డైరెక్టర్‌: ఒక కల నిజమైంది
మున్నా: ఒక పాఠం
దిల్‌ రాజు: ఆత్మ బంధువు
మాలిని: ఒక అదృష్టం
ఎన్టీఆర్‌: అన్నయ్య
మహేశ్‌: సోల్‌మేట్‌
ప్రభాస్‌: అమేజింగ్‌ ఫ్రెండ్‌
ఊపిరి: మై రీఇన్వెన్షన్
కోపం: తగ్గించుకోవాలి
నవ్వు: ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది
మహర్షి: ఒక మధురమైన ప్రయాణం


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.