గ్యాప్‌... వచ్చిందా? తీసుకున్నారా?
మురళీ శర్మ: ఏంట్రా గ్యాప్‌ తీసుకున్నావ్‌?
అల్లు అర్జున్‌:
తీసుకోలేదు.. వచ్చింది

‘అల... వైకుంఠపురములో’ టీజర్‌లో వినిపించిన డైలాగ్‌ ఇది. తెలుగు చిత్రసీమకు గ్యాప్, బ్రేక్‌ అనే మాటలు సుపరిచితం. ఇక్కడెవరూ గ్యాప్‌లు తీసుకోరు. వస్తాయంతే. అందుకే బన్నీ పేల్చిన ఆ డైలాగ్‌ బాగా పాపులర్‌ అయ్యింది. ప్రస్తుతం కొంతమంది దర్శకులు సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. చేతిలో హిట్టు పడినా సినిమా చేయనివాళ్లు కొందరైతే, కథలు సిద్ధం చేసుకుని క్లాప్‌ కొట్టడానికి ఎదురుచూస్తున్నవాళ్లు మరికొందరు. ఇంకొంతమంది ఇంకా హీరోల్ని ఒప్పించే ప్రయత్నాల్లోనే ఉన్నారు.''


చిత్రసీమలోని ప్రతిభా వంతులైన దర్శకుల్లో క్రిష్‌ ఒకరు. ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ తరవాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతున్నా, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆ విషయం తేలేవరకూ క్రిష్‌ ఖాళీనే. బోయపాటి శ్రీను నుంచి ‘వినయ విధేయరామ’ తరవాత సినిమా పట్టాలెక్కలేదు. నందమూరి బాలకృష్ణతో సినిమా ‘ఓకే’ అయ్యింది. వచ్చే జనవరిలో ప్రారంభమయ్యే అవకాశాలుఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ ‘రూలర్‌’తో బిజీ. ఆయన కోసమే బోయపాటి ఎదురుచూస్తున్నారు. ‘మహానటి’తో విజయాన్ని అందుకున్నారు నాగ అశ్విన్‌. ఆ చిత్రం విడుదలై ఏడాది దాటింది. అయినా ఆయన నుంచి కొత్త సినిమా సంగతులేవీ బయటకు రాలేదు. ఓ మంచి విజయం ఖాతాలో పడిన వెంటనే, ఆ ఉత్సాహంలో మరో కొత్త సినిమా మొదలెట్టేయడం పరిపాటి. కానీ నాగ అశ్విన్‌ తొందరపడడం లేదు. ప్రస్తుతం ఆయన స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. ‘జెర్సీ’తో విజయం అందుకున్న యువ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. ఈ సినిమా బాలీవుడ్‌ రీమేక్‌కూ ఆయనే దర్శకుడు. అందుకే తెలుగులో ఆయన సినిమాకి గ్యాప్‌ వచ్చింది. ‘అర్జున్‌ రెడ్డి’ తరవాత సందీప్‌ రెడ్డి వంగా అదే సినిమాని బాలీవుడ్‌కు తీసుకెళ్లారు. తెలుగులో మాత్రం రెండో సినిమాని ఇంకా మొదలెట్టలేదు. త్వరలోనే ఓ అగ్ర కథానాయకుడితో ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ‘గరుడవేగ’ తరవాత ప్రవీణ్‌ సత్తారు గ్యాప్‌ తీసుకున్నారు. ఆయన నుంచి కొత్త సినిమా కబుర్లేం వినిపించడంలేదు. త్వరలోనే ఆయన కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ తరవాత శ్రీనువైట్ల సినిమా ఏదీ మొదలెట్టలేదు. ఆయన ‘ఢీ 2’ని చూపించే పనుల్లో ఉన్నారని, అందులోనూ విష్ణునే హీరోగా నటిస్తారని చెప్పుకుంటున్నారు. ‘యాత్ర’తో మెప్పించిన మహి.వి.రాఘవకీ విరామం వచ్చింది. ఆయన తదుపరి సినిమాని ఇంకా మొదలెట్టలేదు.


వివేక్‌ ఆత్రేయ (బ్రోచేవారెవరురా), స్వరూప్‌ (ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ), ఎవరు (రామ్‌జీ) కూడా ఆకట్టుకున్న దర్శకులే. కానీ వాళ్ల తదుపరి సినిమా ఏమిటో ఇప్పటి వరకూ తెలీలేదు. చాలామంది హీరోలైతే ఈ యువ దర్శకులకు టచ్‌లో ఉన్నారు. పరశురామ్‌ తెరకెక్కించిన ‘గీతా గోవిందం’ రూ.వంద కోట్ల చిత్రాల జాబితాలో నిలిచింది. ఆ సినిమా వచ్చి ఏడాది దాటినా, పరశురామ్‌ తదుపరి సినిమా ఏంటో తెలీలేదు. మధ్యలో మహేష్‌బాబుతో ఆయనో సినిమా చేస్తారని ప్రచారం సాగినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌కి కథ వినిపించడానికి సిద్ధమవుతున్నారు. ప్రభాస్‌ ‘ఓకే’ చెప్పినా, ఈ కలయికలో సినిమా రావడానికి సమయం పట్టేట్టు ఉంది. శ్రీకాంత్‌ అడ్డాల మెగాఫోన్‌ పట్టి చాలాకాలం అయ్యింది. ‘బ్రహ్మోత్సవం’ తరవాత ఆయన కనిపించలేదు. గీతా ఆర్ట్స్‌లో ఆయనో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. కానీ హీరో ఎవరన్నదీ స్పష్టత లేదు. మహేష్‌బాబు ‘మహర్షి’తో విజయాన్నందుకున్న వంశీ పైడిపల్లికి అనుకోకుండా విరామం వచ్చింది. కథల ఎంపిక కోసం సమయం తీసుకుంటారు వంశీ. ఈసారీ అంతే. పైగా ఆయన మళ్లీ మహేష్‌తోనే పనిచేయబోతున్నారట. మహేష్‌ ఏమో.. వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అందుకే మహేష్‌ పిలుపు కోసం వంశీ ఎదురుచూస్తున్నారు.జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త చిత్రాలు పట్టాలెక్కితేనే చిత్రసీమ బాగుంటుంది. అలా జరగాలంటే దర్శకులు వేగం పెంచాలి. కొత్త కథలు, కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. అలా వస్తే ప్రోత్సహించడానికి నిర్మాతలు, హీరోలు సిద్ధంగానే ఉంటారు. చేతిలో విజయాలు ఉండి కూడా.. ‘చూద్దాం.. చేద్దాం’ అనే రీతిలో కాలయాపన చేస్తే... ఆ దర్శకుల్ని పరిశ్రమ మర్చిపోయే ప్రమాదం ఉంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.